ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -16-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.ఫోన్ : 701 3660 252.
September 21, 2020 • T. VEDANTA SURY • Memories

 అలపర్తి సుబ్బారావుగారు వ్రాసిన పిల్లల నాటిక“ చివరకు మిగిలేది”. నాటికలు రాయడంలో అలపర్తివారిది అందవేసినచేయి. ఇది పిల్లల సాంఘిక నాటిక.  అనేకచోట్ల ప్రదర్శింపబడింది. డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారి పరిశోధనా గ్రంథం " బాల సాహితీ వికాసం" లో సాంఘిక నాటికలు విభాగంలో ఈ నాటికను ఉదహరించారు. బాలల అకాడమీ  ప్రచురించిన “ పాల వెన్నెల” సంకలనం లో కూడా ఈ నాటిక చేర్చబడింది. అడుక్కునే అబ్బాయి అనే గ్రంథంలో 5 కథలు ఉంటాయి. వీటికి అందమైన బొమ్మలు వాటికి. తోడై ఉంటాయి. మబ్బు తెరపై మసక బొమ్మలు గ్రంథంలో కూడా అనేక కథలుంటాయి. ఈ కథలన్నీ పిల్లల మనస్తత్వానికి చెందినవే." చిన్న- పెద్ద" అనే  గ్రంథం కూడా బాలల కథలకు సంబంధించినదే. ఇందులో ఆరు కథలు ఉన్నాయి. ఈ కథలు 1961 లోను, మరల 2003లో రెండవ సారి  ప్రచురితమయ్యాయి." గాలిపటం చెప్పింది" అనే గ్రంథములో ఉన్న కథలు అనువాద కథలు. ఇవి మొదటి సారిగా హిందీ పత్రికలో ప్రచురింపబడ్డాయి. వీటి కథా సారాంశాన్ని అలపర్తివారు   ముందుగా తెలుసుకుని తెలుగులో స్వేచ్ఛానువాదం చేశారు. అందువలన వీటిల్లో అలపర్తి వారి ముద్ర పడి ఉంటుంది."ఆటలు పాటలు " గ్రంథం1965 లోనూ 1979లోనూ ముద్రింపబడింది. ఇందులోని పాటలు ఆంధ్రప్రభ బాలభారతి, బాల లాంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.  అలపర్తి వారి బాలసాహిత్యంపై సి. నారాయణ రెడ్డి గారు "ఆటలు పాటలు  పిల్లలకు-- అచ్చట ముచ్చట  పెద్దలకు"-- ఈ రెండు పంక్తులు చాలు బాల గీతాల రచనలో మీ (అలపర్తి వారి) ముద్రను చాటడానికి" అంటారు. అలపర్తి వారు రాసిన మరో గేయ సంపుటి  "తాయం" అన్నది. ఇది 1967 జూలైలో ముద్రణ జరిగింది.  ఇందులో గేయాలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. ఇందులో ప్రబోధాత్మక గేయాలు చాలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురణగా   శ్రీ బి.వి నరసింహారావు సంకలన కర్తగా వెలువడిన " మల్లెలు-- మందారాలు" లో 'తల్లి తలంపులు' గేయం స్థానం సంపాదించింది. ఈ పుస్తకం పిల్లల విజ్ఞానానికి తగిన విధముగా ఉంది. " నెమలి కన్నులు" అనే గ్రంథం గేయ కథలుగా వెలువడింది. డాక్టర్ వెలగా వెంకటయ్యప్పయ్య గారు తన "గ్రంధాలయ సర్వస్వం " పత్రికలో దీనిపై చక్కని సమీక్ష చేశారు. చిత్ర  పరిచయ పోటీలలో  అలపర్తి వారికి రెండుసార్లు బహుమతి లభించింది. “ నిమ్మ తొనలు” అనేది అలపర్తి వారి మరో గేయ కథా సంపుటి. ఈ గేయ కథలు 1975లో ప్రచురిత మయ్యాయి. వీటిని పిల్లలు పెద్దలు మెచ్చుకున్నారు. చిట్టి కవితలు అనే మరో గ్రంథాన్ని వ్రాశారు. ఇందులో పక్షుల గురించి జంతువుల గురించి వ్రాయబడ్డా యి.   అలపర్తివారి వ్రాసిన కొన్ని  గేయాలను చూద్దాం ! కుందేలు పై గేయం “ హాయిగ తిరుగు కుందేలు/ వేయును పరుగు పందేలు/ కొందరి నమ్మిక ఇటులుంది/ చందమామ లో ఇది ఉంది// పలక ప్రాధాన్యతను  తెలుపుతూ " పలకేది ఓయమ్మ/బలపమేదమ్మా? పలక బలపం ఇస్తే/ పలు బొమ్మ లేస్తా!/ పలకపైనా రామచిలకనే వేస్తా/ చిలక నోటా జామ పండునే వేస్తా/ పలకపైనా బావి గిలకనే వేస్తా!/గిలక మీదా  చేద  తాడునే వేస్తా!/ పలకపైనా తాత పిలకనే వేస్తా/ పిలక చివరా మల్లెపువ్వునే వేస్తా !//అలపర్తి వారి ఈగేయం ఎలా ఉంటుందో చూడండి. ----" అనగనగా ఒక ఊరు/  ఆ వూళ్లో ఉన్నారు అక్కచెల్లెళ్ళు/ అక్కకు తల లేదు కన్నుంది/ చెల్లికి తల ఉంది/ కళ్ళు మాత్రం లేవు/ ఈ అక్క చెల్లెలు ఎవరో చెప్పండి?/ చెప్పలేని చో నేనే/ చెబుతా వినండి!/ సోదులూ వద్దు/ సోదాలు వద్దు/ సాదా సీదాయే ఇది/ సూది, గుండు సూది!!// మరో గేయం--- కాయ్ కాయ్ కాయ్! కాయ గాని కాయ్/అందమైనదోయ్! ఏందో చెప్ప వోయ్/ ఏడుస్తున్న పాపాయి కిచ్చి చూడు ఈ కాయ్/ ఎగిరి గంతులిడునోయ్!/
ఏడ్పుమాని హాయ్ హాయ్!/ పప్పుడక లేదటోయ్!
చెప్పుచుంటి వినవోయ్! / చిట్టి పొట్టి పాపాయ్  చేతిలోని గిలక్కాయ్// ఇక " బాలల ఊహ" ను చూద్దాం. " కాకి ఎత్తుకెళ్లే మా సబ్బు బిళ్ళ/ కాకి ఏమిజేయు నా సబ్బు బిళ్ళ?/ కాకికున్నదేమో ఓ చంటిపిల్ల/ ఒళ్ళు రుద్దనేమొ 
ఆ సబ్బుబిల్ల/ సబ్బు రుద్దినాగాని కాకి పిల్ల/ నల్లగానే ఉంటుంది ఎందువల్ల? ............ కాకికీ ముద్దు కదా కాకి పిల్ల/ అందుకే రుద్దు సదా సబ్బు బిళ్ళ (పిల్లనగ్రోవి గ్రంథం నుండి ). ఇక అలపర్తి వారి శబ్ద చమత్కారం చూద్దాం “ పలకా చెక్క బలపం  ముక్క/ దొరికిన వక్క ద్వారం ప్రక్క/పలకా చెక్క- పైనా లెక్క/ చేస్తానక్క - చూస్తావక్క// బొచ్చూ కుక్క--బొమ్మకప్రక్క/ గీస్తాచక్క-- చూస్తావక్క?కాకీ నక్కా-- కథ అటుప్రక్క/ వ్రాస్తాచక్క --చూస్తా వక్క//(తాయం లోనిది)// బోడి గుండు గేయంలోచూద్దాం - “ బోడి గుండు - బొప్పాయి పండు/ కాకి దండు కనిపెట్టి ఉండు/ తిరుపతి గుండు- తిన్నగ ఉండు/ కాకాని గుండు- గరుకుగ ఉండు"//
" మ్యావ్ మ్యావ్ పిల్లి / పాలకొరకు వెళ్ళి/మూతనెట్టి త్రాగ/మూతి కాలె బాగా!// ఎక్కడిదే కాకి!ఆ/ మొక్కజొన్న కండె?/ నువ్వెదురుగ తింటుంటే/ నోరు ఊరుచుండె// ఏ తోటను
కాజేశావ్/యించక్కటి కండె?/ వరుస వరుస ముత్యాల్లా/ మెరిసి పోవుచుండె !!// అలపర్తి వారు ఇలా ఎన్నో చక్కనైన రచనలు చేసారు.  అలపర్తి వారు చేసిన రచనలను ఎన్ని సార్లు చదివినా చదవాలనిపిస్తుంది.1982లో ' తెలుగు బాలల రచయితల సంఘం' రజితోత్సవాల సందర్భంగా పదిమంది బాల సాహితి ప్రముఖులను హైదరాబాదులో సన్మానించారు. ఆ పది మందిలో ఏడిద కామేశ్వరరావు గారితోపాటు అలపర్తివారు ఉన్నారు. డాక్టర్ దాశరథిగారు వారికి జ్ఞాపికలు అందించారు. ఆ సందర్భంగా  అక్కడ సన్మానింపబడుతున్న వారి గురించి ఏడిదగారే అభినందన పత్రాలు వ్రాసి ఉన్నారు.అందులో అలపర్తి వారి గురించి రాస్తూ “ పలుక  లేని పాలపాపలా  ఆయన పలుకలేడు. కానీ ఆయన  బాల పలుకులు కోటి కోయిలల  కులుకులుగా వసంతరాగాల నాలపిస్తాయి. తాను  పాడడు. కానీ పాడగలిగిన గేయాలను అల్లుతాడు. తాను ఆడడు. కానీ ఆడ కలిగిన నాటికలను ఆడిస్తాడు. తాను నవ్వడు. కానీ నవ్వు పువ్వుల వెదజల్లే వినోద కథలను కంచి కంచికి పంచుతాడు. మనిషి ఎంత ముభావో  ఆయన రచన అంత ముగ్ధ. బాల సాహిత్య రంగంలో ఆయన ఏకలవ్యుడు. అదే అతనిని ఏకభవ్యునిగా తీర్చిదిద్దింది. తక్కువ మాట్లాడటం ఎక్కువగా రచనలు చేయడం శ్రీ అలపర్తి మంచి గుణాలలో ఒకటి. చిట్టి చిట్టి పలుకులతో చిట్టి చిట్టి కవితలల్లి, చిన్నారి లోకానికి చిరుగజ్జెలుగా సమర్పించిన రచనాశిల్పి. శ్రీ అలపర్తి రచనలు బాల వాఙ్మయానికి బంగారు తొడుగులు. తెలుగు బాలల రచయితల సంస్థ రజిత ఉత్సవాల సందర్భముగా శ్రీ అలపర్తి ని సన్మానించడం ఈ ఉత్సవాలకు ఒక నిండుద నంగా భావిస్తుంది" ( పాలధార --పంచదార అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ) సన్మాన పత్రంలో ఏడిద 
కామేశ్వరరావుగారు వ్రాసినట్టు చాలా ముభావంగా ఉంటారు. సరదాగా ఉంటారు. మనం పదిమాటలు మాటా  డితే పదిమాటలకు  తన  చిరునవ్వే సమాధానం. అలా అని గర్విష్టికాదు. అహంకారికాదు. చిలకలూరిపేట సభల్లో రెండు రోజులు కలిసున్నాం. సరదాగానే ఉండేవారు. జోకులు వేసేవారు. ఇంత ముభావంగా ఉన్న మనిషికి  జోకులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనుకునేవాడిని. అతని రచనల్లో హాస్యపూరితమైన సంఘటన ఎన్నో కనిపిస్తాయి.    ఇక్కడ మనం అలపర్తి వారి గురించి తెలుసుకోవలసింది ఏమిటంటే గ్రామీణ ప్రాంతంలో జన్మించినప్పటికీ, చదువు కూడా అంతంత మాత్రమే ఉన్నప్పటికీ బాల సాహిత్య రచయితగా అత్యున్నత స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. వారు పుట్టుకతోనే భగవంతునిచే ఆశీర్వదింపబడ్డా  రు  అనిపిస్తుంది. అలపర్తివారు  ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.ఆ అవార్డులు గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. వారిని మనం ఆదర్శంగా తీసుకుందాం.
బాలసాహిత్య రచయితలగా ఉత్తమ రచనలు చేద్దాం. ( సశేషం )