ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -18--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,--ఫోన్: 7013660252.
September 23, 2020 • T. VEDANTA SURY • Memories

' బాలబంధు అలపర్తి వెంకట సుబ్బారావు రచనలు---
పరిశీలన'' అనే  సిద్ధాంత గ్రంథాన్ని డాక్టర్ రావెళ్ల శ్రీనివాస రావు గారు ఎంతో చక్కగా, బాల సాహిత్యానికి చుక్కానిగా అన్ని విషయాలను పరిశీలించి వ్రాసారు. ఈ గ్రంథానికి ముందుమాట డాక్టర్ జి ఎస్ భాస్కర రావు ప్రొఫెసర్ సాహిత్య పీఠం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఉపాధ్యక్షులు కేంద్రీయ హిందీ సంస్థాన్ అగ్రా వారు, డాక్టర్ వెలగా వెంకటప్పయ్య ప్రముఖ బాల సాహితీ వేత్తగారు, రెడ్డి రాఘవయ్యగారు ఈ గ్రంథానికి అత్యంత విలువలతో కూడుకున్న బాల సాహిత్యానికి సంబంధించి  అనేక విషయాలను పొందుపరిచారు. రావెల శ్రీనివాసరావుగారు "నా మాట"అనే శీర్షికతో చక్కని భావనలను వ్యక్తపరిచారు. ఈ సిద్ధాంత గ్రంథాన్ని సంక్షిప్తముగా వారి మాటలలో చెప్పుకోవాలంటే మొదటి అధ్యాయములో అలపర్తివారికి సంబంధించిన అన్ని విషయాలు పొందుపరిచారు. రెండవ అధ్యాయంలో బాల సాహిత్యాన్ని అంతవరకు అలా అలా పరిచయం చేశారు. ఇక మూడవ అధ్యాయంలో అలపర్తి వారి కథలను విశ్లేషించారు. నాలుగవ అధ్యాయంలో గేయ రచనలను వివరించారు. ఐదవ భాగములోపద్య రచనలను 6వ అధ్యాయములో దృశ్య రచనలను విశ్లేషించారు. చివరి అధ్యాయము కవి ప్రతిభకు స్వభావానికి సంబంధించింది. పిల్లల మనసుకు, వయస్సుకు సంబంధించి వారికి కావలసిన కథలు,గేయకథలు, వ్యాసాలు గేయాలు, పద్యాలు మున్నగు నవి అలపర్తి వారు వ్రాయడం జరిగింది. అందులో సామెతలు ఉంటాయి.అలపర్తి వారు రాసిన పిల్లనగ్రోవి అనే గ్రంథం నుండి తొలకరి అన్న గేయం 1984లో 2వ తరగతి వాచకంలో చేర్చబడింది. అలపర్తి వారు వ్రాసిన" ఎలుక టోపీ" కథ ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురింపబడింది. అదే కథను గవర్నమెంట్ వారి నాలుగవ తరగతి వాచకంలో చేర్చారు. అనపర్తి వారి గేయాలు బాల లో నీతిని పెంపొందిస్తుంది. రెడ్డి రాఘవయ్య గారు బాల సాహితీ మూర్తులలో అలపర్తి వారిని పరిచయం చేస్తూ"మంచి మిత్రుని ఎంచుకొనుడు, ఎంచి చెలిమిని పెంచు కొనుడు, కష్ట సుఖములు పంచుకొనుడు, ఇస్టుసఖులనిపించుకొనుడు"  అనే చరణాలను పేర్కొన్నారు. చిన్నారి లోకం అనే గ్రంథంలో బాలల మనస్తత్వాలను చిత్రీకరిస్తూ. " చిన్నారులూ! పొన్నారులూ!/ఇది మీ లోకం! చిన్నారి లోకం!/ మీ ఆటలు మీ పాటలు/ మీ లయలు మీ హొయలు/ మీ మారాములు  మీ గారాములు// మీ ఆశలు మీ నిరాశలు/ మీ ముద్దులు మీ ముచ్చట్లు /మీ ఊహలు   మీ సందేహాలు/నీ ముద్దు మాటలు మీ తెలివితేటలు/  మీ చిలుకపలుకులు మీ చిలిపి చేష్టలు// అన్ని కలగలిసిన కదంబం /ఒక విధంగా ఇది మీ ప్రతిబింబం /అందుకే-- ఈ పుస్తకం తీసుకోండి/ ఇందులో మిమ్ము మీరే చూసుకోండి"// అంటూ పిల్లలకు స్వాగతం పలుకుతారు.  " ఉద్దేశం ఉంటే చాలు"అనే గ్రంథంలో సుబ్బాయమ్మ అనే ముసలవ్వ కూలి పనులు చేసుకుంటూ కొంత డబ్బు కూడపెడుతుంది. ఆ కూడ పెట్టిన సొమ్ముతో ఊరు సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తుంది. ఆ కారణంగా ఊరి వారంతా మెచ్చుకొని సుబ్బయమ్మను ఈ క్రింది విధముగా అభినందిస్తారు----" ఓహో! ఓహో! సుబ్బాయమ్మ// ఉత్తమ మహిళవు నీవమ్మా!!/ కూలి పనులను చేసావు/ కొంత సొమ్మును దాచావు/ దానధర్మాలు చేసావు/ దానకర్ణుని మించావు// అంటారు." ఇందిర అలుక మానింది" అనే గ్రంథం పిల్లల మనస్తత్వాన్నితెలియజేస్తుంది.
ఈ గ్రంథం విషయంలో నాగభైరవ కోటేశ్వరరావు గారు ఇది బాలసాహిత్యానికి గొప్ప కంట్రిబ్యూషన్ లాంటిది అన్నారు. ఇందిరకు ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చమని అమ్మను ఏమడిగినా లేదంటుంది. తోటలోని జామకాయలతో ఆకలి తీర్చుకోవచ్చు అని భావిస్తుంది. చెట్టు కొమ్మన ఉన్న రామచిలుక దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది. “ అమ్మ కోపగించ నేను/ అలిగి వస్తినీ!/ అవుతున్నది అంతులేని// ఆకలిప్పుడూ!// రామచిలుక కొట్టి రాల్చు/ జామకాయలూ!/తిందునమ్మ! నా ఆకలి/ తీరి పోవగా!//--- అందుకు రామచిలుక సమాధా నం  ఇలా ఇస్తుంది - - “ అమ్మ మీద అలిగి వచ్చి/ నావు కనుక, నే/ కొట్టనమ్మ జామకాయ/ కొట్ట
నొక్కటీ// అలుక మాని, నీవు అమ్మ/ కలసి వచ్చు చో/ ఇందిరమ్మ! బోలెడన్ని/ ఇచ్చి పంపుతా///అంటుంది. ఇక సాంఘిక గేయాలు, కథలే గాకుండా భారత కథ, రామ కథ, భాగవత కథల పేరుతో అనేక కథలను అలపర్తివారు బాలలకు తెలిపి ఉన్నారు. అలపర్తివారు బాలల నాటికల్లో 
" వారసత్వం” అన్న నాటికను చూద్దాం.ఈ కథలో తల్లి దండ్రులు  పిల్లలను ఎంతో  ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుతారు. అటువంటిదీ కొడుకుకు పెండ్లి అయిన తరువాత భార్యతో కలసి తండ్రిని ఇంటి నుండి బయటికి నెట్టి ఒక గొడ్ల పాకలో పెట్టేసి చాలా హీనంగా చూస్తారు. ముసలి వాని మూకుడులో  ఈగలు ముసిరిన చద్దన్నం పడేస్తూ ముంతలో నీరు పోస్తూ ఉంటారు. అది మనవడు  చూసి తాత దగ్గరకు వెళ్లి ఇలా అంటూ....! " లేలే లే లే తాతయ్యా / లేచి అన్నము తినవయ్యా/ సూర్యుడు నెత్తిన ఎక్కాడు/ సుర సుర నిప్పులు కక్కాడు/ లేలే లేలే తాతయ్యా/లేచి అన్నము తినవయ్యా// కూర్చో పెడతాడు. తాత ఏడుస్తాడు. వెంటనే మనవడు " ఎందుకు తాత/ఏడుస్తావు/ఎవరేమన్నా/రిప్పుడు నిన్ను?/ఎందుకు తాతా ఏడుస్తావు?/ చెప్పుము తాతా/ఇప్పుడే వెళ్ళి/ చప్పున వాళ్లని/ చంపేస్తాను! పరపర  పర పర/ నరికేస్తాను/ బిరబిర బిరబిర/  తిరిగొస్తాను!!/ ఎందుకు తాతా/ ఏడుస్తావు?///
అంటూ తాతను మనవడు బుజ్జగిస్తాడు. అందుకు తాత తన కొడుకు, కోడలు పెట్టిన బాధలు మనవడికి చెప్పి పెద్దయిన తర్వాత నువ్వు మీ నాన్నకు బుద్ధి చెప్పాలి అని చెప్తాడు. ఒక నాడు మనవడు స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తాడు. తల్లిదండ్రులు బాబుని కొట్టబోతే అడ్డంగా వెళతాడు ముసలివాడు. ముసలి  వాడిని కొడుకు గట్టిగా తోసేస్తాడు. ఆ ముసలి వానికి దెబ్బ తగిలి చనిపోతాడు. ఆ సంఘటన మనవడి మనసుకు పట్టేస్తుంది. మరి కొన్నాళ్ళయ్యేసరికి  ఈ బాలుని తండ్రి ముసలివాడు అవుతాడు. గతంలో తన తాతకు తండ్రి పెట్టిన బాధలు లాంటివే ఈ కుర్రవాడు తన తండ్రికి రుచి చూపిస్తాడు. ఇలా కథంతా సులువైన పదాలతో పిల్లలు చదువుకునేందుకు, వినేటందుకు వీలుగా మంచి నీతితో కథను అలపర్తివారు వ్రాయడం జరిగింది. అలపర్తి వారి రచనలలో అనేకమైన సూక్తులు, సుభాషితాలు ఉంటాయి. రావెళ్లవారు వీటిలో  కొన్నింటిని పేర్కొంటూ వేరుగా రాశారు. నేను ఇటీవల అలపర్తి వారిపై రాసిన వ్యాసాలలో పేర్కొన్న విషయాలు నాకు అలపర్తి వారికి ఉన్న పరిచయాలు నాకు అందజేసిన పుస్తకాలు, అలాగే  డాక్టర్ రావెళ్ల శ్రీనివాస రావుగారి సిద్ధాంత గ్రంథం నా రచనలకు ఎన్నో విధాలుగా ఉపక రించాయి.అందుకు నేను వారిరువురికీ కృతజ్ఞుడను. అలపర్తివారి గురించి వివరణాత్మకంగా విషయాన్ని తెలుసుకోవాలంటే రావెళ్ళ శ్రీనివాస రావుగారి సిద్ధాంత గ్రంథం చదువ వలసిందే ! ( సశేషం )