ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -19-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్: 7013660252.
September 24, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రముఖ బాలసాహిత్య రచయిత ఏడిద  కామేశ్వరరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి,వ్యాస రచయితగా పత్రికా రచయితగా,గీత రచయితగా, నాటక రచయితగా వివిధ ప్రక్రియలలో రచనలు చేసి మన్ననలు అందుకున్నారు. వీరికి ' హంస'  అనే కలం పేరు కూడా ఉన్నది. బాలబంధు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి మాటలలో చెప్పాలంటే  " ఏడిద వారు కవి, కథకులు, నాటక రచయిత గాయకుడు, నటుడు, నాటక ప్రయోక్త, విద్యాలయ నిర్వాహకులు, పత్రికా రచయిత, సంపాదకుడు భారత స్వాతంత్ర్య సమర సేనాని, అన్నింటినీ మించి గొప్ప సంస్కారి. బహు  సున్నితమైన మనిషి . ఇలా ఎన్నో సద్గుణాలు నిండి నిబిడీకృతమైన పూర్ణమైన మానవుడు." అంటారు. ఏడిద కామేశ్వరరావు గారు 1913లో సెప్టెంబర్ 12న తూర్పు గోదావరి జిల్లా  'ఏడిద'  గ్రామంలో జన్మించారు. ఇతని తండ్రి పెద్ద కొండల రావు. తల్లి వెంకట రాజ్యలక్ష్మిగారు. కామేశ్వరరావుగారు రచించిన సంగీత నాటికలలో మొదట చెప్పుకోదగ్గది-- " ఒక పిలుపులో--/ పిలిచితే పలుకుతావట! నా/ పలుకులో పలుకుతావట/ ఆపదమొక్కుల స్వామి/ నీ సన్నిధి నా పెన్నిధి"// వడ్డి కాసుల వాడావట!/ వడ్డి వడ్డి గుంజుదువట! /అసలు లేని వారమయ్య/ వెతలు బాపి కావవయ్య!-- పిలిచితే పలుకుతావట!!//అని వ్రాస్తారు.  వెలగావారు 1956లో  రేపల్లెలో పని చేసేటప్పుడు ఏడిద కామేశ్వరరావు గారి అబ్బాయి ద్వారా వెంకటప్పయ్యగారికి కామేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. ఆ పరిచయమే వీరిద్దరి స్నేహ
బంధానికి దారి తీసింది.  ఏడిద కామేశ్వరరావుగారు తన జీవిత కాలంలో వందల సంఖ్యలో గేయాలు, కథలు, నాటికలు రాశారు. వీరు  రాసిన పిలిచితే పలుకుతావట గేయం విశేష ప్రచారం పొందింది. పాలవెల్లి మొదలైన  గేయ సంపుటాలను రంగ బాల, బొమ్మరిల్లు నాటక సంపుటాలను హెచ్చరించారు. మీరు రేడియో అన్నయ్యగా అందరికీ సుపరిచితులు. ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ వీరిని " బాల బంధు" బిరుదుతో సన్మానించింది. ఏడిదగారి పిల్లల పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఒక పాటను చూడండి. " ఇంటికి పాపాయి అందం-- మింట దాయి దాయి చందము/ అందమా అన్నీ ఉండి  అవిలేక..." అనేపాట సర్వత్రా మెచ్చే పాట. ఇక్కడ నృత్య గేయ నాటిక " విశాల భారతి" లోని గీతాన్ని చూడండి " మతం వేరు-- మనుగడ ఒకటే; జాతులు వేరు-- నీతులు ఒకటే! మతములు, జాతులు వేరుగా ఉన్నా -- భారతీయ మది అందరిదీ// అన్నది. ఏడిది వారు బాలల కోసమే పుట్టారా , బాలసాహిత్యం వ్రాయడం కోసమే పుట్టారా అనిపిస్తుంది మనకు. అతను రాసిన మరికొన్ని గేయాలను చూద్దాం. " బాలప్రపంచం/ పాల ప్రపంచం/ పాల వలె  తియ్యనిది/ పాల వలె చిక్కనిది " అంటూ బాల ప్రపంచాన్ని మన ముందు నిలుపుతారు. ఏడిద వారి గురించి శ్రీమతి ఎం.రాజ్యలక్ష్మి హైదరాబాద్  వారు బాల సాహిత్యం మరియు ఏడిద వారి రచనల గురించి చెబుతూ " బాలల కోసం రచనలు చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే ! కానీ రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన  ఏడిద కామేశ్వరరావు పిల్లల కోసం అనేక సాహిత్య ప్రక్రియలు చేసి చూపారు. పిల్లల మనసుకు హత్తుకునేలా రాయడంలో అయనది అందవేసిన చెయ్యి. ఆయన రచనా వ్యాసాగం  విశిష్టంగా ఉంటుంది. కథైనా, పాటైనా, నాటిక అయినా అవి విజ్ఞానాన్ని ,వినోదాన్ని సంతరించి పిల్లలకు అర్థవంతమైనవిగా ఉంటాయి. "  అని ఆమె అంటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలల కార్యక్రమాల నిర్వాహకుడిగా పని చేశారు. తను పని చేసిన కాలంలో అనేకమైన పాటలు, నాటికలు, కథలు,  నృత్య నాటికలు, బుర్రకథలు, జముకుల కథలు, హరికథలు వంటివి ఎన్నో రాసి బాల ప్రపంచానికి కామేశ్వరరావుగారు కానుకగా అందజేశారు. ఈ పాటను చూడండి. " పిట్టవలే నెగురు దుము/ జట్టుగాను తిరుగుదము/ఒక్కొక్కరు అందరము/అందరమే యొక్కరమని// అనే  పాటను ఆయన  వ్రాసి పాడారు. ఆయన రచనలన్నీ బాలల  మనో, నైతిక, బుద్ధి, వికాసాలను పెంపొందించేలా సాగాయి. ఏడిదవారు రాసిన "అమ్మ మాట" అనే  పాటనుచూద్దాం.----   "అమ్మ మాట ఎంతో అందము-మా/ అమ్మ మనసు మంచి గంధము/
అమ్మ ముద్దు చల్లన, అమ్మ సుద్దు తెల్లన/ అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు/ అమ్మ మించి కానము వేరొక్కటి జగము/ అమ్మ మించి లేదు కానరాదు దైవము//   అలతి అలతి పదాలతో పాటను శ్రావ్యంగా సాగేటట్టు చూసారు. అమ్మ పాప ఆటలు సరదాలు మీద ఒక గేయం వ్రాసారు.
"అమ్మ చూడు ఈవింతలు పాపలాడు పంతాలు/నీటిలోన
 నే తొంగి చూడగా నన్ను చూసి  తా తొంగి చూసే/ కుచ్చుజడ ఆ పాప ఎవ్వరే అచ్చము నను బోలి యున్నది. ఏడిద వారు రాసిన జోల పాటలు చూద్దాం." సద్దు చెయ్యకండి, ఎవ్వరిటు రాకండి/ బుద్ధిగా మా పాప, నిద్దరో తుంది/ కాకమ్మ  అరవకే, మా ఊరు పోతే/ మామయ్య వచ్చేది కబురు కొన్ని తేవే/ పిచికమ్మా పలుకవే, మా పొలము పోవే/ పప్పు లెన్నో తెచ్చి,
మా పాపాయికీయవే/ చిట్టి పిల్లి పోవే, వంటిగొప్పదనండిచి/ ఉట్టి మీద పాలు, అన్నీ మా పాపలకే/కుక్క పిల్ల రావే, గుమ్మంలో కూర్చోవే/ ఎవరిటు రాకుండా, కాపలాకాయవే/ చిట్టి పాపల్లారా, అటెటో వెళ్లండి/ నిదుర లేచి పాప, అడగా వస్తుంది/ బజ్జుంది మా పాప, బంగారు చిలక/ బజ్జుంది హాయిగ, రతనాల మొలక// అని అంటారు. ఈ గేయంలో పిల్లలపై తల్లికి గల మితిమీరిన ప్రేమ, అనురాగాలను, ఆప్యాయతలను మనము చూడవచ్చు. అలాగే కాకి, పిచ్చుక, పిల్లి పిల్ల, కుక్క పిల్లను పరిచయం చేయడం జరిగింది. అదే ఏడిద వారి రచనలలో గల గొప్పదనం.  ( సశేషం )