ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -2- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 4, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్యానికి సంబంధించిన రచనలు చేయడానికి  ముందు నేను కొన్ని గ్రంథాలను చదవవలసి వచ్చింది. నేను చదివినవాటిలో అనేకమంది ప్రముఖ బాలసాహిత్యవేత్తల రచనలు ఉన్నా ప్రస్తుతానికి కొన్నింటిని మాత్రమే ఉటంకించ దలచుకున్నాను. వాటిలో ముఖ్యమైనవి1) రెడ్డి రాఘవయ్యగారి ' బాలసాహిత్య నిర్మాతలు' 2) డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారి ' తెలుగు బాల కథా సాహిత్యం' 3)చొక్కాపువెంకటరమణగారి ' బాలసాహితీ వైతాళికులు' 4) డాక్టర్రావెళ్ళ శ్రీనివాసరావుగారి ' బాల బంధు అలపర్తి వెంకటసుబ్బారావు  రచనలు--పరిశీలన' 5) డాక్టర్. వెలగావెంక టప్పయ్యగారి ' తెలుగు బాల సాహిత్యం' 6). ఆంధ్రప్రదేశ్బాలల మహా సభలు (1977 ఫిబ్రవరి 10 నుండి 13 వరకు)ప్రత్యేక సంచిక, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ, హైదరాబాద్వారు ప్రచురించినది. 7)  డాక్టర్. వెలగావెంకటప్పయ్య గారి' బాలసాహితీ వికాసం' చదవడమే గాక గురజాడ, శ్రీ శ్రీ, సి నారాయణరెడ్డి, గుడిపాటి వెంకటాచలం, ఆరుద్ర , దాశరథి, కృష్ణశాస్త్రి చెప్పుకుపోతే ఇలా చాలామంది బాలసాహిత్యానికి కృషి చేసినవారిలో  ఉన్నారు.  బాలలకోసం అనేకమంది రచయితలు గేయాలు (ఆటల పాటలు, చదువుల పాటలు, జోలపాటలు,లాలిపాటలు ఇంకా అనేకానేకం  వ్రాస్తున్నారు. జంతువులపైపాటలున్నాయి,కథలున్నాయి, గేయ కథలున్నాయి. నాటికలున్నాయి. నాటకాలుఉన్నాయి. చిన్న నవలలు ఉన్నాయి. ఇలా బాలసాహిత్యంలో వివిధ ప్రక్రియలున్నాయి.  పాత తరం రచయితలు వ్రాసినవి కొన్ని అయితే  కొత్త తరం అంటే ఆధునిక తరం రచయితలు వ్రాసిన రచనలు మరి కొన్ని ఉన్నాయి. మారిన కాలమాన పరిస్థితులను బట్టి, మారుతున్న బాలల మేథా సంపత్తు, మేథాశక్తిని బట్టి పిల్లలకు బాలసాహిత్యాన్ని ఏ ఏ వయసుల వారికి ఏ ఏ పరిధులలో  బాల సాహిత్యాన్ని‌‌ సృష్టించాలి అనే ఆలోచన రచయితలలో రావాలి. వారు ఏం నేర్చుకోవాలో, వారికి మనం ఏం నేర్పించాలో కూడా మనమే నిర్ణయించుకోవాలి. ఏ స్థాయి పిల్లలకు రచయితగా  మనం ఏం  వ్రాయదలచుకున్నామో ముందుగానే నిర్ణయించుకొని పరిమితమైన లైన్లు, వారి తరగతికి తగిన భాష ఉపయోగిం చాలి. ఆనాడే బాల సాహిత్యాభివృద్ధికి మన కృషిఫలిస్తుంది. అలా కాకుండా నేనూ బాలసాహిత్యంలో కథలు, గేయాలు, గేయకవితలు వ్రాయగలను  అనే ధీమాతో వ్రాస్తే మనం అనుకున్న లక్ష్యం నెరవేరదు. ఉదాహరణకు ఒక రచయిత గేయాన్ని ఇలా  వ్రాసాడనుకుందాం. " ఎలుకా వచ్చింది/ మార్జాలం చూసింది" అని వ్రాసాడనుకుందాం.  తనకు ' '   'మార్జాలం'  అనే పదం కొత్తగా ఉండొచ్చు. కొత్త పదాన్ని
బాలలకు నేర్పించాలనే ఉత్సుకత  తనలో ఉండొచ్చు. పిల్లలకు కొత్త పదాలను నేర్పడానికి సమయమూ సందర్భం  చూసుకోవాలి.  ఇక్కడ  పిల్లి  అనే పదాన్ని  ఉపయోగిస్తేనే బాగుంటుంది. కిండర్ గార్డెన్   చదువులు లేని రోజులలో విద్యార్థులు ఒకటి, రెండు తరగతులు చదువుతున్న రోజులలో  (6,7 సంవత్సరాల వయసులో) చిన్న  చిన్న గేయాలను పాటల రూపంలో నేర్చుకొనేవారు. గానీ ఈనాటి ఎల్.కె.జి;   యు.కె.జి  విద్యార్థులు .4,5 సంవత్సరాల వయసులోనే రైమ్స్ రూపంలో ఆ గేయాలను  నేర్చుకుంటు న్నారు. 1). భారత ప్రభుత్వం బాలసాహిత్యంలో జాతీయ స్థాయిలో 1952 నుండి నిర్వహించే పోటీలలో సాహిత్య పరంగా బాలల వయసును రెండేరెండు విధాలుగా విభజన
చేసింది.  అవేమిటంటే 3--6 సంవత్సరముల పిల్లలు ఒక గ్రూపుగానూ, 7--14 సంవత్సరముల పిల్లలను మరో గ్రూపుగానూ చేసింది.  2).   కేంద్ర ప్రభుత్వ  శాసనాల ప్రకారం భారత దేశంలో 16 ఏళ్ల వయసు లోపు బాలురు,
18 ఏళ్ళు నిండని బాలికలను పిల్లలుగా పరిగణింపబడ  తారు అన్న విషయాన్ని ,  3).  అలానే 1967లో ఢిల్లీలో 
జరిగిన అఖిల భారత బాలసాహిత్యవేత్తల మహాసభ  నిర్ణయాన్ని  0--6;  6--9;  9--12;  12--15 మధ్య వయసు
వారిని నాలుగు గ్రూపులుగా విడదీసారు. డాక్టర్. వెలగా వెంకటప్పయ్యగారు బాలలను రెండు గ్రూపులుగా విభజించారు. అవేమిటంటే 1.శైశవ దశ 0--5 సంవత్సరాల
మధ్య.  2.  బాల్య దశ 5--14 సంవత్సరాల మధ్య అని.
కానీ ఇవన్నీ ఈనాటి విద్యావిధానాన్ని బట్టి, బాలల మేథా శక్తిని బట్టి  సమంజసమైనవిగా పరిగణింపబడకూడదు. 
విద్యారంగంలో వివిధ పదవులలో ఉన్న అనుభవాన్ని బట్టి, 
పిల్లలతో నాకున్న అనుబంధాన్ని బట్టి బాలలను వారి వారి
వయసులను బట్టి, మేధాశక్తిని బట్టి  ఇలా వర్గీకరణ చేయడం జరిగింది--- 1). 0--3 దృశ్య,  శ్రావ్య పరిశీలనతో
గ్రహణశక్తి ద్వారా గ్రహించడం 2).4--6 (ఎల్.కె జీ, యు.కె.జి,  ఒకటవ తరగతి  3). 7--9  ( రెండు,. మూడు,  నాలుగు    తరగతులు );  4). 10--12 ( నాలుగు, అయిదు, ఆరు,  
తరగతులు )  5). 13---15 ( ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు ). ఈ విధమైన విభజన బాలసాహిత్యాభివృద్ధికి
అవసరంగా ఉంది.  (  సశేషం )