ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -20-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్: 7013660252.
September 26, 2020 • T. VEDANTA SURY • Memories

1850 తరువాత బాల సాహిత్యం చాలా వరకు అభివృద్ధి  చెందింది. బాల సాహిత్య రచయితలు అనేకమంది పుట్టు కొచ్చారు. బాల గేయాలను అనేకం వ్రాశారు. అందులో ఆట పాటలు, బడి పాటలు, పండుగ పాటలు, వేడుక పాటలు, గేయ కథలు అనేకం ఉన్నాయి. బాల సాహిత్యం ద్వారా మన ప్రాచీన గ్రంథాలైన రామాయణ, భారత భాగవతాల లోని అనేక కథలను గేయరూపం లోనూ, గేయకథా రూపంలోనూ, బుర్రకథల రూపంలోనూ బాలలకు హాస్య పూరితంగా కథలను తెలియ చెప్పవచ్చు. అటువటివాటిలో కచదేవయాని, ఉదంకోపాఖ్యానము, గజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర, భోజరాజు కథ--- ఇలా ఎన్నెన్నో కథలను బాలలకు తెలియచెప్పినవి ఉన్నాయి. బాలలకు అర్థమయ్యే రీతిలో అతి సులభమైన, మధురమైన శ్రావ్య పదాలతో రచనలు చేసిన  మనకు ముందు తరాల రచయితల ప్రయత్నం ఎంతగానో హర్షించదగ్గది. అందుకే అంటారు మహా రచయిత చలం---" పిల్లల పాటలు రాయడం కష్టం. దానికంటే మహా కవి కావడం సులభం" అని.  మన ముందుతరాల బాల సాహిత్యవేత్త ఎవరో కానీ " ఆవు--పులి కథ" ను చాలా చక్కగా, నీతివంతంగా వ్రాసి బాలలకు అందజేశారు.  ఆ కథ వ్రాయబడి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ  ఆ కథ నేటికి సజీవంగానే ఉంది. ఈ కథ  గురించి మనలో తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటాను. అయినా ఒకసారి దాని గురించి చెప్పుకుందాం. " ఒక అడవిలో ఆవు మేతకు వెళుతుంది. మేత మేస్తుండగా పులి దానిని  పట్టుకొని ఆహారంగా తినేయాలని చూస్తుంది. ఇంతలో ఆవుకు తన చిట్టి లేగదూడ జ్ఞాపకం వచ్చి పులితో " నాకు ఇంటిదగ్గర ఒక లేదూడ ఉంది. దానికి పాలు ఇచ్చి కడసారిగా చూసి వచ్చి నీకు సంతోషంగా ఆహారం అవుతాను" అని ప్రాధేయ పడుతుంది. పులి ఆవు మాటలకు మొదటిలో కొంత సంశయిస్తుంది. అయినా పులి చివరకు అంగీకరిస్తుంది. ఆవు బిడ్డకు పాలిచ్చి తను పులికి ఆహారంగా వెళుతున్నా నని చెబుతూ బిడ్డకు ఈ క్రింది విధంగా జాగ్రత్తలు చెబుతుంది." ఆడకు మసత్య భాషలు/ కూడకు కొఱగాని వాని, గొంగగ యొరులె/గ్గాడిన నెదురుత్తరమీ,జూడకు, విని వినని వాని చొప్పున చనుమా/ అంటి చరింపకు పొలమున్/ నింటికి కడు ప్రొద్దుగలుగ నేతెంచుచురా/వెంటబడి పొడుచు గోవుల/ చంటి జనకు, క్రయ్యబడకుసందడి యగుచోన్ / చలుకన జలరుహ తంతువు/ చులకన తృణ కంకణము, దూది చుల్కన సుమ్మా/యిల నెలయు ధూళి చుల్కన/ చులకన తల్లిలేని సుతుడు కుమారా--" అని బుద్ధులు చెప్పి బిడ్డ భవిష్యత్తులో ఏ విధముగా నడుచుకోవాలో తెలియ చెప్తుంది. ఇక్కడ ఆవు బిడ్డయందు తల్లికి గల బాధ్యతను మర్చిపోలేదు. అలానే సత్యవాక్పరిపాలననుసరించి ఇచ్చిన మాట ప్రకారము ఆవు పులికి ఆహారంగా వెళుతుంది. పులి ఎంతో సంతోషించి ఆవును విడిచిపెట్టి తన బిడ్డ దగ్గరకు పొమ్మంటుంది. ఈ కథలో సత్యం, ధర్మం, నీతి , నిజాయితీ బాలలు  గ్రహిస్తారు. ఉత్పల సూర్య నారాయణాచార్య శమంతకమణి , కుమార సంభవం, గంగావతరణం, పార్వతి కళ్యాణం క్షీరసాగర మధనం ఇలాంటివి ఎన్నో రాశారు. నవ్వునుు తెప్పించే గేయాలు విచిత్రంగా ఉంటాయి. అలపర్తి వెంకట సుబ్బారావుగారి గేయాలను కొన్నింటిని చూడండి.
" ముఖ్యులు వీరు, మునసబుగారు!/ తగవులు పెంచు, తలలు త్రుంచు !!/ సర్పంచ్ గారు, దర్పం గలారు!!!// ఓట్లపుడే వీరు, మాట్లాడుతారు!!/ గుళ్ళో పూజారి గోవిందాచారి/పిక్కి ముప్పాలు,పెట్టు ఆపాలు!// అంటారు. ఇక కవిరావుగారి విషయానికి వద్దాం. ఇతను  గేయకథా రచనలో విశేషమైన కృషి జరిపి వందలాది గేయకథలు రాశారు. "చెలియ" అనే గేయ కథలో  " నిన్ను మించినట్టి  వారి నేస్తమెపుడు/ చేయరాదు, చేతులేసి చేటు గల్గును//అని అంటారు. వియ్యానికైనా, కయ్యాని కైనా సరిసమాన త్వం ఉండాలి. ఈ విషయాన్ని బాలలు కూడా తెలుసుకొని మెలగాలి అంటారు. ఎద్దుల పోరు అనే కథలో  " ఎప్పుడైనా గొప్ప గొప్ప వారల పోరు/ తప్పకను మన బోంట్ల తిప్పలకై ప్రాప్తించు"// అంటారు. గొప్ప వారి జోలికి చిన్నవారు పోతే కష్టాలపాలవుతారని దీని సారాంశం. కవిరావుగారు రాసిన గేయ కథలన్నీ బహుళ ప్రచారంలో ఉన్న కథలే ! ఇటువంటి కథలను కవిరావుగారే కాకుండా గిడుగు వెంకట సీతాపతి, నార్ల చిరంజీవి, నండూరి రామ్మోహన్ రావు, సమతారావు, మొదలగువారు ఎన్నో గేయ కథలు రాశారు." సాహిత్యానికి కథ ఆధార శిల్పం. సర్వకళా సంపన్నమైన సాహిత్య మందిరం ఈ ఆధార శిలపై నిర్మితమైనది." అని అంటారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారు. నవలలు వ్రాసే బాలసాహిత్య రచయితలు కొన్ని నియమ నిబంధలను పాటించాలి. నవలలను బాలలు చదివేటప్పుడు, లేక  వినేటప్పుడు హృద్యంగా ఉండాలి. ఆ నవలను చదువుతున్న  పిల్లలకు జరగబోయే కథ ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది అనే భావం వారిలో రావాలి. ఆ విధంగా  బాల సాహిత్య రచయితలు రచనలు చేపట్టాలి. అలా రాసిన వారిలో ప్రముఖులు ముద్దంశెట్టి హనుమంతరావు గారి " వాసు చదువు",   రావికొండలరావుగారి " దాసు", కనకమేడల వెంకటే శ్వరరావుగారి  " అన్నదమ్ము లు"  యుగంధర్ రచన "టింకూ సాహసాలు"  కొమ్మూరి వేణుగోపాలరావు గారి "పిల్ల దొంగ", మల్లాది అవధానిగారి "పారిపోయిన పిల్లవాడు"  అన్నవి చదువ వలసిన బాలల నవలలే  అని డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారు తను రాసిన తెలుగు బాలసాహిత్యం అనే గ్రంథంలో చెబుతారు. పిల్లల కోసం నాటికలు, నాటకాలు వ్రాసేటప్పుడు అవి పసందైన మధుర ఫలాలలా ఉండాలి. పాత్రల మధ్య సంభాషణలు అత్యంత ఆసక్తికరంగా, హాస్యపూరితంగా ఉండాలి. పిల్లల కోసం నాటికలు రాసే వాళ్లలో న్యాయపతి రాఘవరావు, ఏడిద కామేశ్వరరావు, నండూరి సుబ్బారావు, ఉన్నవసేతు మాధవరావు,. యామర్తి గోపాలరావు మొదలగువారు ఉన్నారు. నండూరి సుబ్బారావు గారు అయిదు అరిసెలపై హాస్య పూరితమైన కథ రాసారు. న్యాయపతి రాఘవరావు, కామేశ్వరిగారలు  " శ్రావణ, భాద్రపద" మాసాలపై వ్రాసిన హాస్యపూరిత నాటిక చాలా బాగుంటుంది. బాలలను ఈ నాటిక ఇట్టే ఆకట్టుకుంటుంది. బాల సాహిత్యంలో నృత్య నాటికలకు కూడా  మిక్కిలి ప్రాధాన్యత ఉంది. ఈనాటికలను వ్రాసిన వాళ్లలో అతి ముఖ్యులు ఏడిద కామేశ్వరరావు,  సి. నారాయణ రెడ్డి, దాశరథి బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్ మొదలగు వారున్నారు. జానపద ప్రక్రియలలో "బుర్రకథ" అత్యంత ప్రాచుర్యం పొందినది. బుర్రకథలు వేలాది మంది శ్రోతలను ఆకట్టుకుంటాయి. అయితే బాల సాహిత్యములో బుర్రకథలు రూపేణా వచ్చిన సాహిత్యం చాలా తక్కువ. కవుల ఆంజనేయశర్మ గారు బాలానంద సంఘాలను నిర్వహించ వలసిన  అవసరాన్ని బాలానందం బుర్రకథగా చెప్పి కథాంతంలో బుర్రకథ రూపంలో ఈ విషయాన్ని ఎలా తెలియజెప్పారో చూడండి. "నేటి బాలలే రేపటి పౌరులు/ మేటి సూక్తి ఇది వినరండి/ బాలలను సత్పౌరులుగా చేయగ/ బాల సంఘముల నడపండి/ పెద్దలందరూ నడుము బిగించి/ పిన్నల వృద్ధిని కోరండి/ఒజ్జలు అండగ నిలబడి వీటిని/ ఓర్పుగా చక్కగ నడవండి!!// ఈ సందేశం పెద్దవాళ్ల కళ్ళును తెరిపించేదిగా ఉంది. బుర్రకథలే కాకుండా   ప్రముఖుల జీవిత చరిత్రలు, దేశ చరిత్రలు, విజ్ఞాన సర్వస్వాలు బాలల మనోవికాసానికి ఎంతో అవసరం. వసంతరావు వెంకటరావుగారు చంద్రుని కథను గేయ రూపంలో వ్రాశారని తెలుస్తుంది. రెడ్డి రాఘవయ్యగారు విజ్ఞానోదయం బాలలకు ఉపయోగపడే విధంగా రాశారు.
ఇప్పటికీ బాలలకు పనికి వచ్చే సైన్స్ కు సంబంధించిన విషయాలు" బాలబాట" అనే మాస పత్రికలో వ్రాస్తూనే ఉన్నారు.  సహజంగా సాహిత్యానికి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. అలానే బాలసాహిత్యానికి కూడా సంగీతం తో సంబంధం ఉంది. సంగీత స్వరాలతో బాలలకు  బాల గేయాలను నేర్పినట్టయితే ఆహ్లాదకరంగా. నేర్చుకుంటారు. కొన్ని గేయాలను పరిశీలించండి." చేత వెన్న ముద్ద-- చెంగల్వ పూదండ/ బంగారు మొలతాడు-పట్టుదట్టి//--ఈ గేయాలను చూద్దాం." చెమ్మ చెక్క చారడేసి మొగ్గ/ అట్లు పొయ్యంగా ఆరగింపంగ// వాన వాన వల్లప్ప/ వాకిలి తిరుగు
చెల్లప్ప//-- వంటి గేయాలు చాలా ఉన్నాయి. బాలలు భక్తిప్రపత్తులను ఎవరెవరియెడల చూపించాలో  ఈ గేయం తెలియజేస్తుంది. " లాలను పోసి, పాలను తావి/ జోలను పాడే,అమ్మకు జే జే/ నడవగ చూచీ అడిగినవన్నీ/ తడియక ఇచ్చే నాన్నకి జేజే/మాటలు నేర్పే, పాటలు నేర్పే/ఆటలు నేర్పే,గురువుకు జే జే// ఇక తెలుగువారి సంస్కృతిని తెలిపే ఒక సంక్రాంతి పాటను చూద్దాం.... '' బాబు గారికి దణ్ణం పెట్టు/ పత్తి గింజలు పెడతారంట/ కాసులు మువ్వలు కడతారంట/ పట్టు శాలువలు కప్పెదరంట / డూ డూ డూ బసవన్న// ఇక వదినా, మరదళ్ళు, బావగారికి ఒకరినొకరు ఆట పట్టించే పాటను చూడండి. " వదిన గారూ మీరూ వాసి గలవారు/ వండ బోయిన చోట కుండ నాకేరు/ బావగారూ మీరు  ప్రతిభ గలవారు/ నిండైన సభలోను పిండి బొక్కేరు// మరో గేయం చూడండి." అబ్బాయి తలమీద గోరింక/ చెప్పకు చెప్పకు చెడుపాప/ అత్తవారింటికి కొత్తల్లుడొస్తేను/ కొత్త సున్నము దెచ్చి  మెత్త రమ్మ"//లాంటి గీతాలు బాలలు నేర్చుకుంటే తెలుగు సంస్కృతిని, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తారు.  బాలల అభివృద్ధికి దోహదపడే గీతాలను బాల్యం  నుంచే పఠింపజేసి అభివృద్ధిపథంలోకి తీసుకు రావాలి.( సశేషం )