ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -22-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.
September 28, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రముఖ బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దాసరి వెంకటరమణ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. దాసరి గారు బాల సాహిత్యం పుట్టు పూర్వోత్తరాల గురించి చెబుతూ సాహిత్యం పుట్టుక ముందుగానే బాల సాహిత్యం పుట్టిందని చెబుతారు. ఎందుకంటే సాహిత్యంకన్నా మనిషి పుట్టుకే ముందు.ప్రతి జీవిలోను బాల్యం ముందుగా వస్తుంది. బిడ్డ ఏడుపు తోనే పుడుతుంది. ఆకలి వేస్తే ఏడుస్తుంది.  శరీరంలో నలతగా ఉంటే ఏడుస్తుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే బిడ్డ నవ్వుతుంది. తల్లితో దోబూచులాడుతుంది. వీటన్నిటికీ తల్లి సందర్భానుసారం రకరకాల స్వరాలతో చిన్న చిన్న లాలి పాటలు పాడుతుంది. పిల్లల క్షేమాన్ని కోరి దేవుని ఆశీర్వదం
కోసం పాటలు పాడుతుంది. పిల్లలు పెరిగి పెద్దవుతున్నకొద్దీ వారివారి చేష్టలలో మార్పు వస్తుంది. తోటి పిల్లలతో ఆటలు ఆడడం,సరదా పడటం, చిలిపి కయ్యాలు తెచ్చుకోవడం,
తోటి పిల్లలను కొట్టడం, కొన్ని సమయాలందు వారిచే దెబ్బలు తినడం, నిత్యజీవితంలో క్రమశిక్షణ జీవితానికి అలవాటు పడేటందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిగిలిన పెద్దలు పాటల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగు తుంది. అలానే జాతీయ పండుగలు, దేశభక్తి గీతాలుపాడటం నేర్పుతారు. ఇక పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత కొంత జ్ఞానం వస్తుంది. ఎగతాళి పాటలు, పొడుపు గేయాలు లాంటివి పెద్దలనుండి నేర్చుకొని బాలలు కూడా పాడుతారు.పిల్లలు పెద్దవారై 16 సంవత్సరములు దాటిన తరువాత బాలల పరిధి నుండి దాటి పోతారు. అక్కడ నుండి వారు యవ్వనులై సంఘ జీవనంలో పాలుపంచుకుంటారు. అప్పటినుండి బాలసాహిత్యం పరిథి దాటి  ప్రౌఢ సాహిత్య పరిధిలోకి వస్తుంది. బాలలు పెరిగి పెద్దవారైనరోజునుండి వారి జీవన విధానంలో  మార్పు వస్తుంది. పెద్దవారు అయిన తర్వాత చదువులు చదవడం, వివిధ వృత్తులను చేపట్టడం, వివాహాలు చేసుకో వడం, దేశ రక్షణ, సామాజిక సమస్యలలో పాలుపంచుకోవడం ఇవన్నీ కూడా ప్రౌఢ సాహిత్యానికి సంబంధించినవే ! అంటే ఈ పరిస్థితు లను అవగాహన చేసుకుంటే ముందుగా బాల సాహిత్యమే పుట్టిందని మనం భావించాలి. బాలలకు బాల సాహిత్యం ద్వారా కుటుంబంలో ఉన్న తన కుటుంబ సభ్యుల పైన, ఇరుగుపొరుగు వారి పైన, సాటి మనిషి పైన ప్రేమాభి మానాలు  పెంపొందించ వలసిన బాధ్యత పెద్దలపై ఉంది. 
ప్రాంతీయాభిమానం,దేశాభిమానం కలిగి ఉండడం  విశ్వమానవ సౌభ్రాతృత్వానికి బాలలు కృషి చేసేటందుకు పెద్దలు బాల సాహిత్యం ద్వారా తర్ఫీదునిచ్చి మంచి దేశ పౌరులుగా  తీర్చిదిద్దాలి. అందుకే దాసరి వెంకటరమణ గారు ఆధునిక భాష సాహిత్యాల యుగ కర్త మహాకవి గురజాడ అప్పారావు దేశభక్తి గీతాలను తన రచన " ప్రపంచీకరణ నేపథ్యంలో బాలసాహిత్యం" లో ఈ క్రింది విధముగా  పేర్కొన్నారు......!
" యెల్ల లోకం ఒక్క ఇల్లై/ వర్ణ బేధము లెల్ల కల్లై/
వేలనెరుగని ప్రేమ బంధం/ వేడుకలు కురియ/ మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటే 
నిలిచి వెలుగును/ అంత స్వర్గ సుఖంబులన్నవి/
యవని విలసిల్లున్//అని. గురజాడ వారి " దేశ భక్తి " గేయాలు వ్రాసి 100 సంవత్సరములు పైబడినా వాటి విలువ తగ్గలేదు. ప్రతీ పౌరుని నోటి వెంబడి ఆనాటినుండి ఈనాటి వరకు ఆ గీతాలు చర్విత చరణంగా పాడ బడుతూనే ఉన్నాయి."బాల సాహిత్యం అత్యంత శక్తివంత 
 మైంది. అది రేపటి తరం తీరును శాసిస్తుంది " అని చెబుతారు దాసరి."ప్రపంచీకరణ -బాల సాహిత్యం" గురించి చెబుతూ ప్రస్తుతం పిల్లల్లో చదివే అలవాటు తగ్గింది అని చెబుతున్నారు. అది నూటికి నూరుపాళ్ళు నిజం. ఈనాడు కార్పొరేట్ స్కూలల్లో చదివే పిల్లలకు, వారి తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ పిల్లలకు వచ్చే మార్కులు, ర్యాంకులు మీద దృష్టి తప్పితే బాల సాహిత్యం గురించి తెలుసుకుందా మనే ఆసక్తి ఏమాత్రం లేదు. ఖాళీ సమయం దొరికితే  ఆ సమయములో టీవీలో కార్టూన్ సినిమాలు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, గంటలకొద్దీ ఇంటర్నెట్లో కాలాన్ని వెల్ల బుచ్చడం చేస్తున్నారు. ఈ విషయాలను దాసరి వారు మరీ మరీ పరిశీలించి చెప్పినట్టున్నారు. పూర్వం బాల సాహిత్యానికి సంబంధించిన అనేక పత్రికలు మార్కెట్ లోకి  వచ్చేవి. కానీ ఈనాడు వేళ్లపైన లెక్క పెట్టే విధంగా కొన్ని పత్రికలు మాత్రమే బాల సాహిత్యం ప్రచురిస్తున్నాయి. నేటి విద్యావిధానంలో వచ్చిన మార్పుల వలన  బాలల పత్రికలు చదివే ఓపిక విద్యార్థులలో లేకుండా పోయింది.   బాల సాహిత్యం అభివృద్ధికి దాసరి గారు 22 సూచనలు చేశారు. అందులో కొన్నింటిని మాత్రమే ఇక్కడ పేర్కొంటున్నాను. 1. మారుతున్న పిల్లల అభిరుచులకు అనుగుణంగా వారికి బాల సాహిత్యం అందాలి. 2. బాల సాహిత్యం  అందరికీ అందుబాటులో ఉండాలి.  3. ప్రజా జీవనం లోని వర్తమాన అంశాలను బాల సాహిత్యంగా మలచి అందించాలి. 4. పిల్లల అనుభవాల్లోనుంచే కథలను వెలికి తీసే ప్రక్రియతో బాల సాహిత్యం రావాలి. 5. మూఢనమ్మకాలను, దురాచారాలను, నిరసిస్తూ పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవరిచే కథలు రావాలి.  6. ప్రాణం విలువ, సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవరిచే కథలు రావాలి. 7. కథలు సంస్కృతి సాంప్రదాయం పట్ల గౌరవం కలిగిస్తూనే దేశభక్తిని, విశ్వప్రేమను ప్రకటించాలి.8. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల సాహిత్యం సేకరించి బాలలకు మాతృ భాషలో అందివ్వాలి. దానివలన పిల్లలు విశ్వ జనీన ప్రేమతో ప్రపంచ పౌరులుగా ఎదుగుతారు. 9.పిల్లలలో నుంచి మంచి రచయితలను తయారు చేయాలి. సృజనాత్మకతను, కల్పనా శక్తిని పెంచి పిల్లల్లో రచనా శక్తిని అందించే అంశాలు పాఠశాల సిలబస్ లో ఒక భాగంగా చేయాలి. 10. బాలల కోసం తల్లిదండ్రులు బాల సాహిత్యానికి  సంబంధించిన పుస్తకాలను కొనే అలవాటు చేయాలి. దాసరి గారు చెప్పిన పై విషయాలను మనం అమలు జరిగినట్లయితే బాల సాహిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లు తుంది. అంతేగానీ " నేను 1000 కథలు రాశాను, రెండు వేల కథలు రాశాను, నేనో పెద్ద బాలసాహిత్య వేత్తను, నా గురించి మీకు తెలియదా " అని డబ్బా కొట్టుకుంటే బాలలకు ఒరిగేదేమీ లేదు.డబ్బు సంపాదన కోసం సాహిత్యం కాదు. సాహిత్యం సమాజాభివృద్ధి కోసం మాత్రమే! అన్న విషయాన్ని మనం గ్రహించాలి.  ( సశేషం )