ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -26(2)-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,, ఫోన్: 7013660252.
October 3, 2020 • T. VEDANTA SURY • Memories

వెలగా వెంకటప్పయ్యగారు బాలల కోసం అనేక విజ్ఞాన అంశాలపై అనేక గ్రంథాలను వ్రాశారు. వయోజనుల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు. ప్రజలను విజ్ఞానవంతులు గా చేయడానికి తన వంతు కృషి చేశారు. వెలగావారు ధన సముపార్జన కన్నా విజ్ఞాన సముపార్జనమే అధికంగా చేశారంటారు తెలిసిన వాళ్ళు. ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీలో పనిచేసిన" రేడియో అక్కయ్య" న్యాయపతి కామేశ్వరిగారు రచించిన రచనలను సంపుటిగా     తెచ్చినప్పుడు వెలగా వెంకటప్పయ్యగారు సంపాదకత్వం వహించారు. గ్రంథాలయాల నిర్వహణ చాలా చక్కగా చేసేవారు. బాల సాహిత్యం మీద, ప్రముఖుల జీవితాల మీద ఆయనకు విపరీతమైన పరిజ్ఞానం ఉంది. పుస్తకాలను  ప్రచురణకు పంపే ముందు తగు జాగ్రత్తలు తీసుకునేవారు. వెలగా వెంకటప్పయ్య గారంటే బాల సాహితీవేత్తలకు ఎంతో గౌరవం. ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవ మర్యాదలతో చూసే వారు. ఎదుటివారితో మాట్లాడే విధానంలో సంస్కారం ద్యోతకమయ్యేది. మాట్లాడే విధానంలోను ఎంతో నమ్రత కనిపించేది. ఎదుటివారు చెప్పింది వినడమే గాని వారు మాట్లాడేది తక్కువ.వెలగా వెంకటప్పయ్య గారికి వచ్చిన శాలువాలు, ఇతర బహుమతులు పదిమందికి పంచిపెట్టేసే వారనీ, తరువాత కాలములో మెమొంటోలు తన వద్ద  ఉంచుకోకుండా పంచిపెట్టేసే వారని అతని గురించి ఎవరో వ్రాయగా చదివాను. తను చేయవలసిన దినచర్యను ఠంచనుగా చేసేవారు. ప్రముఖ రచయిత, మొలక సంపాదకులు అయిన వేదాంత సూరి గారు వెలగా వెంకటప్పయ్యగారంటే ఎంతో గౌరవం." ఏదైనా ఒక పని అప్పగిస్తే అది పూర్తి చేసేవరకూ మన వెంటే ఉంటారు. మనలను వెంటాడుతుం టారు. అందుకే ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయనది. వెలగా వెంకటప్పయ్య గారు మంచి బాలుడు” అని  అంటారు వేదాంత సూరిగారు. దాసరి వెంకట రమణ గారికి, చొక్కాపు వెంకటరమణ గారికి వెలగా వెంకటప్పయ్య గారంటే చాలా అభిమానం, గౌరవం.  దాసరివారు వెలగా వారిని " నడిచే విజ్ఞాన సర్వస్వం -- వెలిగే పుస్తక భాండా గారం" అంటారు. ఇక చొక్కాపు వెంకటరమణగారు ఏమంటారో తెలుసా? “ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జీవితమే ఒక విశ్వవిద్యాలయం ” అంటారు. వెలగావారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వారి త్రిపురనేని గోపీచంద్ స్మారక పతకం,  సదరన్ లాంగ్వేజస్ బుక్ ట్రస్టు ప్రైజ్, ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, ఢిల్లీ మద్రాసు తెలుగు అకాడమీల పురస్కారాలు వీరు పొంది యున్నారు. అంతేకాదు.  శ్రీమతి మంచిపల్లి సత్యవతి  రాష్ట్రస్థాయి బాల సాహితీ ఉగాది పురస్కారాన్ని పొందారు.450  గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. వివిధ అంశాలపై100 గ్రంథాలకు పైగా రచించారు. ఇంతటి ప్రజ్ఞా, ప్రాభవాలు కలిగిన వెలగా వెంకటప్పయ్యగారి 
83వ జన్మదిన ప్రత్యేక సంచికలో నాచే ఈ క్రింది కవిత వ్రాయబడింది. “ భూమిపైన వెలిసారు ఎందరో మహానుభావులు/ అందులో మన చెంతనుండేది కొందరే కొందరు! / వారిలో ముఖ్యుడు... పేరులో ప్రముఖుడు/ మన  " బాలబంధు" వెలగా వెంకటప్పయ్య/ అతడే "గ్రంథాలయ గాంధీ తాతయ్య" !// ఐతానగర్ లో జన్మించాడు/ ఎన్నో విద్యలు నేర్చాడు/ బహు మేథావిగ నిలిచాడు/ బాల సాహితీ నందనవనములో /రచనల సువాసనలు వెదజల్లే/ సుందర కుసుమంగా వెలిసాడు!// పరిపూర్ణ స్వరూపం, కోమల మనస్తత్వం/ ఎనలేని జ్ఞాన సంపద, మృదుమధుర సంభాషణలు/ వెలకట్టలేని" వెల"గా వారి సిరి సంపదలు/ కథలు, కవితలు, వ్యాసాలే శ్రీవారి అక్షర హారాలు/ బాలల ప్రపంచమే తన ప్రపంచమనీ/ పాలబుగ్గల పసిడి బాలలకు ఆశాకిరణం/ తానేనని చాటిచెప్పిన మొనగాడతడు// బాల మేథావులను తీర్చిదిద్దిన ఘనాపాటిగా వెలసాడు!/ బాలల భవితకే ప్రాణదీపమై ఈ భువిపై నిలిచాడు/ బాల సాహితీ వికాసమే తన ధ్యేయమని గొప్పగ చాటాడు/గ్రంథాలయ ఉద్యమమే తన ఊపిరని నినదించాడు// భావిభారత నిర్మాతలకు మార్గదర్శకుడయ్యాడు/ బాలల రచయితల పాలిట గురుదేవునిగా నిలిచాడు/ దేశ నిర్మాణమే తన ధ్యేయమని ప్రగతిపథంలో నడిచాడు/ మన గురుదేవుడు మహనీయు డు   శ్రీ వెలగా!// ఆ మహనీయుని జన్మదినం మన ఆశల 
పర్వదినం తెలుగు బాలలసాహితీ దినోత్సవం!/ ఆ పవిత్ర దినానికి శతకోటి శుభాకాంక్షలు/ నిండు నూరేళ్లు ఆయువు ఇవ్వాలి--దేవుళ్ళు దేవతలు !!! "//ఇలా అందరి మన్ననలు పొందిన వెలగావారు 85 సంవత్సరముల అనంతరం అనారోగ్యంతో స్వర్గస్తులై చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ( సశేషం )