ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -33(2)- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.
October 13, 2020 • T. VEDANTA SURY • Memories


వేజెండ్ల సాంబశివరావు గారు అలతి అలతి పదాలతో గేయాలు, గేయకథలు పద్యాలు పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాసేవారు. అటువంటివాటిలో  "రాజుగారి విచారం",  "వ్యాపారి సంచారం" ఉన్నాయి. " గోరుముద్దలు" అనే అభినయ గేయం సంపుటిని పిల్లల కోసం తీసుకువచ్చారు. అందులో బాలల కోసమే అన్నట్టు చిన్న చిన్న గేయాలున్నాయి. 1979లో అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భముగా వెలగా వెంకటప్పయ్య గారు ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ సంచాలకులుగా నాగార్జున సాగర్ లో నిర్వహించిన బాలల సాహిత్య రచయితల శిక్షణా శిబిరంలో వేజెండ్ల వారు పాల్గొన్నారు. అఖిల భారత బాలల రచయితల సమ్మేళనాలలో తెలుగు బాలల రచయితల సంఘం తరఫున పాల్గొన్నారు. అనేకమంది బాల సాహిత్య రచయితలతో పాలుపంచుకునిబాలసాహిత్యం లోతుపాతుల గురించి చర్చించేవారు. వేజెండ్ల వారికి అభినయ గేయాలు అంటే చాలా ఇష్టం. అందుకే బాలల అకాడమీ ప్రచురించ తలపెట్టిన బాల సాహిత్యంలో తనకు ఇష్టమైన అభినయ కథా గేయాల సంకలనం తయారుచేసి పెట్ట  మన్నారు.1980లో “ బడాయి మేక”  అభినయ గేయ సంకలనం విడుదల చేశారు. ఇది సాంబ  శివరావు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి  పెట్టింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ “ చిలకపలుకులు”  పేరుతో పిల్లలకు ఆడియో  క్యాసెట్లు రూపొందిస్తూ అందులో వేజెండ్ల వారు రాసిన పిల్లల కథలకు స్థానం కల్పించారు. వేజెండ్ల వారు కథలను వ్రాసేటప్పుడు పిల్లలకువినసొంపైన పాటలను కూడా ఆ కథల మధ్యస్థంలో  వ్రాసి పెట్టేవారు. ఆ కారణంగా కథ పిల్లలు వినేటందుకు ఎంతో రక్తి కట్టేవి. ఆ కారణంగా ఆ కథల పుస్తకానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.   "రుషీ వేలి' పాఠశాల వారు వేజెండ్ల వారిని తమ పాఠశాలకు ఆహ్వానించి తమ పిల్లలకుబొమ్మలాట  ద్వారా  కథలను చెప్పేందుకు రాగయుక్తంగా ఉండేలా రాసి ఇమ్మని కోరగా వ్రాసి ఇచ్చారు. ఆ పుస్తకానికి 2000 సంవత్సరములో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి బాల సాహిత్య పురస్కారం పొందారు. బాలలకు ఇంపైన కథారచనలు, గేయ రచనలు చేసి పిల్లలకు అర్ధమయ్యే రీతిలో బోధపరచిన కారణంగా మంచి రచయితగాను, మంచి ఉపాధ్యాయుని గాను ఖ్యాతి గడించారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వారిచే అనేక బహుమతులు  పొందారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు వెజెండ్ల  వారిని " బాలబంధు” బిరుదుతో సత్కరించారు. అంతేకాదు ఏడిద కామేశ్వరరావు స్మారక “ బాల సాహితీ సామ్రాట్ పురస్కారం” అందుకున్నారు. బాలల కోసం అనేక గేయాలు పాటలు, కథలు, అభినయ గేయ కథలు రాసిన వేజెండ్ల వారికి సంగీతంలో కూడా  గొప్ప ప్రవేశం ఉంది. ఆ కారణంగానే వీరు  పాడిన పాటలు పిల్లలకు ఎంతగానో నచ్చేవి. వేజెండ్ల వారు 2005 మార్చి  18వ తేదీన స్వర్గస్తు లయ్యారు.భౌతికంగా వీరు మనకు దూరమైనా ప్రముఖ బాలసాహిత్య వేత్తగా మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. (సశేషం)