ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -4-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 7, 2020 • T. VEDANTA SURY • Memories

గతంలో 0--3 సంవత్సరాల మధ్య వయస్కులవారుశ్రావ్య, దృశ్యపరిశీలనతో గ్రహణశక్తి ద్వారా వివిధ విషయాల ను  బాలలు గ్రహించగలరని చెప్పుకున్నాం. ఇక 4, 5, 6 సంవత్సరాల వయసు గల (అంటే  ఎల్.కె.జి, యు.కె.జి,  ఒకటవతరగతి) చదువుతున్న పిల్లలకు ఎటువంటి అభినవ బాలగేయాలు పాఠశాలల్లో నేర్పుతున్నారో తెల్సుకున్నాం.  ఇప్పుడు7,8,9 సంవత్సరాల వయసుగల(2,3,4 తరగతులుచదువుతున్న బాలలకు ఏ స్టాండర్డ్స్ తో కూడుకున్న బాల గేయాలను నేర్పుతున్నారో తెలుసుకుందాం. రెండవ తరగతి
పిల్లలకు నేర్పుతున్న ఈ అభినవ గేయం చూడండి. "వంకాయ పెండ్లి కుదిరింది/కూ‌రగాయల సందడి చూడండి
/ఆనపకాయ రంగులు వేసింది/మునగకాయ ముగ్గులు పెట్టింది/పాలకూర పందిరి వేసింది/అరటికాయ అన్నం పెట్టింది/బంగాళదుంప బజ్జీలు చేసింది/తమలపాకు తాంబూలమిచ్చింది/
జామకాయ జడలు వేసింది/పనస
పండు పూలు పెట్టింది/బత్తాయి బట్టలు పెట్టింది/
బెండకాయ బ్యాండు కొట్టింది/టమాటా తాళి కట్టింది/
ఉల్లిపాయ ఊరేగించింది/నన్నూ పిలిచారనీ/గుమ్మడికాయ
గంతులు వేసింది/గుమ్మడికాయ గంతులు వేసింది/
వంకాయ పెండ్లి కుదిరింది/కూరగాయలు సందడి చూడండి    #"అలానే రెండవ తరగతిలో 'దీపావళి' పై గల రైమింగ్ ను  మరొకటి చూద్దాం. " దీపావళి వచ్చెరా/సందడినే
తెచ్చెరా/పిల్లలు భలే మెచ్చెరా/పెద్దలకిది నచ్చెరా/సీత 
ప్రమిద తెచ్చెరా/దీపం వెలిగించెరా/దీపాలను చూడరా/
వెలుగులనే నింపెరా/చిలిపి శీను వచ్చెరా/
చిచ్చుబుడ్డి కాల్చెరా/టపాకాయ చూడరా/ఢాం ఢాం మని పేలెరా/చంటి పాప చేతితో/కాకరొత్తి పట్టెరా/చురచురమని వెలిగెరా/
చిన్నిపాప నవ్వెరా/అమ్మ వచ్చి అందరికీ/లడ్డూ మిఠాయి
పంచెరా # దీపావళి వచ్చెరా#. పై రెండు గేయాలలోనూ 
18 లైన్ లు ఉన్నాయి. ఎల్ కె జి, యు కె జి, ఒకటవ తరగతి
లో గల గేయాలను పరిశీలించినట్టయితే 8నుండి12లైన్లు గేయాలను ప్రవేశపెట్టడం జరిగింది. పెద్దల సాహిత్యం (ప్రౌఢసాహిత్యం) వ్రాస్తున్న రచయితలు బాలగేయాలను వ్రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. డాక్టర్. దాశరథి
కృష్ణమాచార్యగారు వ్రాసిన బాలగేయాలను ఎల్ కె జి, 
యు కె జి,  ఒకటవ తరగతికి సరిపడ్డ బాలగేయాలను పరిశీలిద్దాం. దాశరథిగారి గారు " దసరా" గురించి ఒక బాలగేయం వ్రాసారు చూడండి." పంతులు గారికి కట్నాలు/
బడిపిల్లలకూ పుట్నాలు//ఆకాశంలో వెన్నెలలు/అడవులలో
ఏల క్రొన్ననలు/రంగురంగులా జండాలు/ఒకరి కొక్కరు దండాలు//జమ్మి చెట్టుకూ పోదాము/జమ్మి పూజలు చేదాము//పిండి వంటలు తిందాము/ఎన్నో కథలు విందాము//కొత్త బట్టలు కడదాము/గురువుకు జేజేల్ కొడదాము//దసరా పండుగ చేతాము/కోలాటాలు వేతాము.
ఇక్కడ ' పుట్నాలు' ;  ' క్రొన్ననలు' అనేపదాలు ఒకటవ తరగతి లోపు పిల్లలకు అర్థం కానివి. మొదటి బాలగేయం    7,8,9 వయసు గల పిల్లలకు అభినవ బాలగేయంగా సిలబస్ లో కేటాయించారు. ఈ " దసరా" బాలగేయం         బాలలకు అర్ధమయ్యే సులభ శైలిలో ఉంటూ,  అందంగా పాడుకొనేందుకు వీలుగా ఉంది. ఇక  దాశరథి గారు వ్రాసిన   ' దసరా ' ను మొదటిసారిగా నేను పేర్కొన్న ' దసరా' తో  పోల్చి చూస్తే దానిలో గల లైన్ లను బట్టి  4, 5, 6 వయసు గల  పిల్లలకు  మాత్రమే కేటాయించాలి. కానీ  ఎల్ కె జి , యు కే జి , ఒకటవ తరగతి పిల్లలకు నోరు తిరిగి అర్థం చేసుకొని పాడుకోడానికి వీలుగా లేదు. అతి సుకుమారమైన, మధురమైన  పదాలు ఇందులో లేవు.  ఈ గేయం బాల గేయంగా  దాశరథి పేర్కొన్నా  ఆ  లక్షణాలు ఇందులో కనిపించలేదు. ఒక  సులభ పద్ధతిలో పాడుకోడానికి వీలు  కానిది. ఇక దాశ‌రథిగారి  ' అక్కా--బావ' గేయాన్ని చూడండి. " అన్నాలూ  కూరలూ అక్కయ్యకీ/  పళ్ళాలు గ్లాసులు బావయ్యకీ//అందలాలు నందనాలు అక్కయ్యకీ/బాజార్లు బేజార్లు బావయ్యకీ//అంబరాలు సంబరాలు అక్కయ్యకీ/కంబళ్ళు అంబళ్ళు బావయ్యకీ//పాటలూ పద్యాలు అక్కయ్యకీ//వెక్కిరింత కొక్కిరింత బావయ్యకీ//" అని  వ్రాస్తారు. ఇక శ్రీశ్రీ గారి  విషయానికొస్తే ' శైశవ గీతి' అనే
గేయంలో ఐదారేడుల పసిపాపలను గురించి ఇలా అన్నారు. "పాపం పుణ్యం -- ప్రపంచ మార్గం/కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలు/ఏవీఎరుగని పూవుల్లారా/ఐదారేడుల పాపల్లారా" అంటూ--చెప్తారు. అలానే  ప్రకృతిలో సహజంగా జరిగే మార్పులు తమకోసమే జరుగుతున్నాయని అమాయకంగా ఊహించే  పాపలను గురించి " మెరుపు మెరిస్తే--వాన కురిస్తే/ఆకసమున హరివిల్లు విరిస్తే/"అవి మాకే" అని ఆనందించే-- కూనల్లారా " అంటూ అమాయక హృదయాలను చూసి జాలిపడతారు శ్రీ శ్రీ.  భావము, సమయము, సందర్భమూ తెలుసుకొని శ్రీ శ్రీ ఐదారేడుల పసిపిల్లలనుద్దేశించి వ్రాయడం బాగానే ఉంది. కానీ ఐదారేడుల  బాలలు పాడుకొనేందుకు పనికొచ్చే పాటగా వ్రాయలేదు. ఇక్కడ బాలల మనస్థత్వాన్ని తెలియజేస్తూ శ్రీ శ్రీ గారు గేయ రూపంలో తన భావాన్నిమనకు తెలియజేసారు.  సశేషం )