ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -5- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 9, 2020 • T. VEDANTA SURY • Memories

దాశరథి కృష్ణమాచార్యగారు వ్రాసిన బాలగేయాలను వివిధ తరగతులకు కేేటాయించిన బాలగేయాలతోసరిపోల్చి చూడడం జరిగింది. ఆధునిక తెలుగు భాషా సాహిత్య రంగాలకు ఎనలేని సేవ చేసిన జంథ్యాల పాపయ్యశాస్త్రిగారు ఆధునిక బమ్మెరపోతనగా మనం పరిగణించవచ్చు. డాక్టర్. నండూరి రామకృష్ణమాచార్య జంథ్యాల పాపయ్యశాస్త్రిగారి గొప్పతనం గురించి చెబుతూ " కవిత ఒక కఠోర తపస్సు. అద్యతనాంధ్ర కవి ప్రపంచంలో జంథ్యాల పాపయ్యశాస్త్రిగారు సాహితీ పరబ్రహ్మసాక్షాత్కారం పొందిన తపస్సి
ద్ధులు. జంథ్యాలవారికి ఆంధ్రవాజ్ఞయ ప్రపంచంలో చిరస్మర ణీయమైన స్థానమును కల్పించునది ఆయన కవితాశైలి.వాగర్ధముల సాహితీ సాయుజ్యమునకు శ్రీ జంధ్యాలపాపయ్య శాస్త్రిగారి కవిత  తెలుగు భాషలో ఉజ్వలోదాహరణము. సంస్కృతములో, తెలుగులో ఆదికవులు ఆరంభించిన  " ప్రసన్నత"  "అక్షర రమ్యత" ఉద్యమాలు శ్రీ పాపయ్యశాస్త్రి గారి కవితలో పరాకాష్ట నందినవి. 1986 నాటి మన
ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారు జంథ్యాలవారి గురించి ప్రస్దుతిస్తూ " అధ్యాపకుడిగా, వక్తగా, సాహితీవేత్తగా,కవిగా ప్రజల గౌరవాన్ని, అభిమానాన్ని, అనురాగాన్ని,అపారంగా చూరగొన్న ధన్యజీవి శ్రీ జంథ్యాల పాపయ్య శాస్త్రిగారు" అంటూ " ఉదయశ్రీ "లో  వారి భావ సౌకుమార్యం, పదలాలిత్యం, ఆర్ద్రీభూతమైన హృదయస్పందన, ప్రస్తుటంగా కనిపించే విశిష్టలక్షణాలు ఉంటాయి"అంటారు. జంథ్యాలవారి ప్రథమ కృతి -- ఉదయశ్రీ,   ద్వితీయకృతి-- విజయశ్రీ;తృతీయకృతి --- కరుణశ్రీ;  కాలానుక్రమణిలో  ఉదయశ్రీ
రెండు, మూడు, నాలుగు, ఐదు భాగములు  వ్రాయడంజరిగింది. తన తృతీయ కృతి అయినటువంటి  ''కరుణశ్రీ" అంటే జంథ్యాల పాపయ్యశాస్త్రిగారికి ఎంతో ఇష్టం.  ఆ కారణంగానే తన పేరుకు బదులుగా " కరుణశ్రీ " అని కలంపేరు పెట్టుకున్నారు. ఆ పేరుతోనే చాలామంది పిలుస్తూ ఉంటారు.ప్రౌఢసాహిత్యాన్ని వ్రాసి ఎంతటి పేరు ప్రఖ్యాతులుపొందారో బాలసాహిత్యం వ్రాసి అంతటి విశేష ఖ్యాతిని గడించారు. కరుణశ్రీగారి " ఉదయశ్రీ " 50 ముద్రణలకు నోచుకుంది. కరుణశ్రీ బాలసాహిత్యం గురించి చెప్పుకొనే
ముందు తన ఇతర రచనల గురించి కూడా తెలుసుకోవడంమంచిది. ఎందుకంటే బాలసాహితీవేత్తలు బాలగేయాలు
వ్రాసేటప్పుడు లయాత్మకమైన మధురమైన భాష, సున్నిత మైన పదప్రయోగం, వాక్యనిర్మాణంలో కూడా రైమింగ్ ఉండాలి. బాలసాహిత్యం వ్రాయాలంటే కరుణశ్రీ గారి  ప్రౌఢసాహిత్యాన్ని కూడా తప్పనిసరిగా చదవాలి. కరుణశ్రీ గారిరచనలు అంత అత్యున్నతమైనవి,ఆకర్షణీయమైనవి కూడా. అందులో ముఖ్యంగా ఉదయశ్రీ మొదటి భాగం మరీమరీ  చదవాలి. ఎన్నిసార్లు చదివినా తనివితీరనిదీ ! అందుకే డాక్టర్. సి నా రే గారు కరుణశ్రీ గురించి చెబుతూ " పద్యాన్నిమాటగా, పాటగా , సూక్తిగా, స్పూర్తిగా మలచిన చతుర--చతురాననుడు కరుణశ్రీ . కళ్ల నిండా దయ. కవిత నిండా లయ  వున్న స్వాధువర్తనుడాయన. ఇంకా కరుణశ్రీ కవిత్వం గురించి చెప్పుకొస్తూ  " కరుణశ్రీ" గారి కవిత్వం ఉదాత్తభావం ఉజ్వలపదం అద్వితీయంగా సాగిపోయేపద్యశైలి"అంటారు. ఇక  ఆచార్య దివాకర్ల వేంకటావధాని  మాటల్లో  '' కరుణశ్రీ రచనలలో--- లలిత పదప్రయోగమును, గాంభీర్యమును, సర్వతోముఖ ప్రసాద గుణమును  నియతోపస్థితికములై దానికపారమైన ప్రచారము కలిగించినవి"అంటారు. ఇక ఎస్వీ జోగారావుగారి మాటల్లో  " కరుణశ్రీగారు   కవితా ప్రపంచానికెంత ప్రాచీనులో,  అంత నవీనులు కూడా అంటారు. ఇలా ఎందరో ప్రముఖులు కరుణశ్రీ రచనల గురించి, వారి పాండిత్యం గురించి ప్రస్తుతించారు. సాధార ణంగా బాలసాహిత్యమే ప్రౌఢసాహిత్యానికి మార్గం చూపి స్తుంది. కానీ ఇక్కడ   కరుణశ్రీ సాహిత్యానికొస్తే ప్రౌఢసాహి త్యమే బాలసాహిత్యానికి మార్గదర్శకమనిపిస్తుంది. ఉదయశ్రీని ఎన్నిసార్లు చదివినా మంచిదే ! లయాత్మకమైన భాషాభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల నుండీ జంథ్యాల వారి రచనలు చాలా వరకూ చదివాను. అయితే  ఎన్నో సార్లు  " ఉదయశ్రీ " మొదటి భాగాన్ని చదవడం జరిగింది. ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా కొత్తదనం కనిపిస్తుంది.   సశేషం