ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -6- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 10, 2020 • T. VEDANTA SURY • Memories

జంథ్యాల పాపయ్యశాస్త్రిగారిని ప్రశంసించని కవి పండితులు లేరు. కళాప్రపూ‌ర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు '' ఆధునికాంధ్ర కవులలో సుగృహీతనామధేయులైన కరుణశ్రీగారు కవికుల సార్వభౌములు. వారి రచన మంజులమై  వాణీపదమంజీరనిక్వాణములను తలపిస్తున్నది" అనిఅంటారు. డాక్టర్ చివుకుల సుందరరామశర్మగారి మాటల్లో
" కరుణశ్రీ కవితా శిల్పం ఆదికవి నన్నయ కవితలోని అక్షర
రమ్యతాలాలిత్యాన్ని , మహాకవి పోతన వాజ్ఞయంలోని 
శబ్దసంఘటనా సౌందర్యాన్ని, మధుర కవి తిమ్మన సాహితి
లోని ముద్దుపలుకుల  సోయగాన్ని, తనలో నిలుపుకొని
తరతరాల కవితా రసజ్ఞులకు ఆపాతమాధుర్యాన్ని ఆలోచ
నామృతాన్ని తనివితీర అందిస్తుంది. .................కరుణశ్రీ ప్రాతక్రొత్తల  కవితారీతులకు వారధి. మంచి, మమతల సాహితీరథానికి  సారథి"అంటారు. ఇక పొత్తూరి వెంకటేశ్వరరావుగారు కరుణశ్రీ గురించి " పోతన పద్యాల వలే, వేమన పద్యాల వలె, దాశరథి పద్యాలవలె,సుమతీ శతకం పద్యాల వలె పాపయ్య  శాస్త్రిగారి పద్యాలు తెలుగునాట చాలామంది నోట ఎప్పటికీ వినిపిస్తునే ఉంటాయి " అని చెబుతారు. నాగభైరవ కోటీశ్వరరావుగారు కరుణశ్రీ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ " వెన్నెలలోని చల్లదనం, పూల
ల్లోని పరిమళం, కరుణశ్రీ కవనం -- ఈ మూడింటిలో ఒకదానిని ఎన్నుకోమని ఏ తెలుగువాడినైనా అడిగితే కరుణశ్రీ కవనాన్నే ఎన్నుకుంటాడు" అంటారు. ఇంకా ఇలా చాలా మంది తమ విలువైన అభిప్రాయాలను జంథ్యాల పాపయ్య శాస్త్రిగారి రచనలపై వ్యక్తపరచడం పాఠకుల మనసును తన (కరుణశ్రీ )గ్రంథాలపై మళ్ళించి నట్టవుతుంది. ప్రతీ ఒక్కరూ పదే పదే చదవవలసిన గ్రంథాలే  కరుణశ్రీగారి రచనలు ! డాక్టర్. కరుణశ్రీగారి రచనలు చదివితే తన రచనలలో గల రమణీయత, రచనాశైలి, మృదుమధుర భావసంపత్తి, భాషాపటిమ, పదలాలిత్యం, కొత్తగా రచనలు చేసేవారుపొందవచ్చు. కరుణశ్రీగారు బాలసాహిత్యాన్ని రెండు భాగాలుగా వ్రాసారు. మొదటి భాగం యొక్క శీర్షిక '' తెలుగుబాల". ఇందులో నూరు పద్యాలు అక్కడక్కడ కొన్ని కఠినపదాలు ఉన్నా బాలలకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి. ఇందులో మొదటి పద్యం తెలుగు భాష, తెలుగు కవులు, తెలుగు తల్లి గొప్పతనం గురించి కరుణశ్రీ "తెలుగుబాల" కు చెబుతారు. తల్లిదండ్రుల యెడల ఏ విధంగా ప్రవర్తించాలో రెండో పద్యంలో తెలియజేస్తారు. మూడవ పద్యంలో " దేశ సేవకంటే దేవతార్చనలేదు/ స్వార్ధ పరతకంటే చావులేదు/సానుభూతికంటె స్వర్గంబు లేదురా// అని తెలుగుబాలకు ప్రభోదిస్తారు. మంచి విద్యార్థికి  ఉన్న లక్షణాలు, చవట విద్యార్థికున్న లక్షణాలు తెలుగుబాలకు విడమరిచి చెబుతా రు.  ప్రతీ  పద్యంలోను  బాలల భవితకు పనికి వచ్చే నీతి నియమాలను, జీవిత    సత్యాలను  నేర్పుతూ, సమాజాన్ని అర్థం చేసుకొనే రీతిలో బాలలకు ఉపదేశిస్తారు. చదువు విలువను తెలియజెప్పి , త్యాగం, దానం, ధర్మం ఎటువంటి సందర్భాలలో, ఎవరికి చేయాలో చెబుతారు. అలానే స్థానబలం గొప్పదనీ, మూర్ఖుడకు ముందు చూపు ఉండదనీ, సజ్జనులకు శాంతి సహజ ధర్మమనీ, కులమును బట్టి గుణము రాదనీ, మధుర  భాషణము వలన మర్యాద వస్తుందనీ, అల్పుడకు పదవినిస్తే హాస్యాస్పదంగా ఉంటుంద నీ, ఇతరుల మేలును గొప్పవారు ఎన్నడూ మరువరనీ, సాధుపుంగవులు జగమే తమ కుటుంబంగా భావిస్తారనీ, మానవ సేవయే మాధవ సేవయనీ తెలుగు బాలకు తెలియజెప్పడం జరిగింది. అంతేకాదు. ఆంధ్ర కవులైన నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, బమ్మెరపోతన, కృష్ణరాయలు, తెనాలి రామలింగడు వంటి మహా కవుల గొప్పతనాన్ని తెలుగుబాలకు చెబుతారు రచయిత.  సశేషం