ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -8- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 12, 2020 • T. VEDANTA SURY • Memories

జంథ్యాల పాపయ్యశాస్త్రిగారి బాలసాహితీ --1లో విశ్వ సందేశ లహరి ఏడవ శీర్షికన ఉన్నది.ఇందులో 108 పద్యాలున్నాయి.ఒక్కొక్క పద్యానికి నాలుగు లైన్లు చొప్పున ఉంటాయి. ఈ పద్యాలు జంథ్యాలవారి సృష్టి. భాషలోపరిమళత్వము‌,.మృదుమధురమైన , భావగర్భితమైన పదప్రయోగము, వాక్య నిర్మాణమును మనం చూడవచ్చు.ఉదాహరణకు కొన్ని--- " విశ్వమానవ దీక్ష విశ్వమానవ రక్ష/
విశ్వయోగి దృష్టి విజయ వృష్టి/విశ్వయోగి బోధ విజ్ఞాన మయ గాథ/విశ్వయోగి మాట వెలుగుబాట.//నిండు చందమామ వెండివెన్నెల తేట/పొంగి పులకరించు పూలతోట/ముద్దులొలుకు మంచి ముత్తియమ్ముల మూట//విశ్వయోగి మాట వెలుగు బాట. వేమన పద్యాలు అన్నింటికీ  నాల్గవ లైన్ ---"విశ్వదాభిరామ వినురవేమ ! " అని ఎలా ఉంటుందో
"విశ్వ సందేశ లహరి ''లో గల 108 పద్యాల చివరి లైన్ 
'' విశ్వయోగి మాట వెలుగుబాట " అని ఉంటుంది. " విశ్వ 
సందేశ లహరి"లో మరికొన్ని పద్యాలను చూద్దాం. " అన్న
దమ్ములట్లు అక్కచెల్లెండ్రట్లు/కలిసి మెలసి జనులు మెలగ
వలయు/మనుజులెల్ల విశ్వమందిర సభ్యులే//గొప్పతనము
రాదు కులగోత్రముల వల్ల/మమత సమత వలయు మానవులకు/జీవులెల్ల దేవుని బిడ్డలే//పరిహసింపబోకు 
నిరుపేదలను గాంచి/పరితపించబోకు పరుల సిరికి/పరిగణింపబోకు ఒరుల దోషమ్ములు//కోరబోకు మెపుడు మేర 
మీరిన కోర్కె/మీరబోకు గురువుగారి ఆజ్ఞ/దూరబోకు మెపుడు ధూర్తవర్తనులలో//తల్లి దండ్రి గురువు దైవస్వరూ
పులు//అతిథి గూడ దైవమని వచించె/భారతీయ ధర్మపథమెంత గొప్పదో//పూలతీగ కంటె పువ్వు మిక్కిలి ముద్దు/
పువ్వు కంటె పాప నవ్వు ముద్దు/పాప నవ్వు కంటె పరమాత్మ ముద్దురా!//కలడు చర్చిలోన! కలడు మసీదులో/
కలడు గుడిని! చూడ కన్నులున్న/కణకణమ్మునందు కలడురా పరమాత్మ//--- అన్నింటికన్నా పరమాత్ముడే మిన్న
అని చెబుతూ ఇంకా కరుణశ్రీ ఇలా అంటాడు. " సకల జీవులందు జగదీశు దర్శించు/నతడె క్రైస్తవుండు; అతడె శిక్కు/అతడె హిందు; వతడె అసలైన ముస్లిము//...అని.వేదములు పఠించు, వీక్షించు బైబిల్, అరయుమా ఖురాను,అన్ని కూడ//నొక్కి నొక్కి దేవుడొక్కడేయని పల్కు//అన్నింటికన్నా పరమాత్ముడొక్కడేయనీ, పరమాత్ముడే మిన్నయని చెబుతూ సర్వమత సమానత్వాన్ని కరుణశ్రీ తన
రచనల్లో చాటి చెబుతాడు.ఐకమత్యమే మహాబలమని చెప్పేందుకు మన కవి ఇలా అంటాడు. " ఐదు వ్రేళ్ళు ముడువ-- అది గట్టి పిడికిలి/వ్రేళ్ళుతెరచి చూడ వేరు వేరు;/వేరు పడుట కన్న చేరియుండుట మిన్న//" పరమ గురుడు లేని బడియు, దేవుడు లేని/గుడియు, పాపలేని పడతి ఒడియు/భక్తిలేని మ్రొక్కుబడియు వృథా వృథా//బుద్ధిమంతుడైన పుత్రుడొక్కడు మేలు  మందమతులు వందమంది కంటే/చాలు చంద్రుడొకడు, వేలచుక్క లవేల ?// ఇక్కడ పంచతంత్రంలోని " గంపెడు గులకరాళ్ళ కన్నా ఓ రత్నం  మేలన్న విషయం మనకు జ్ఞప్తికి వస్తుంది. మరికొన్ని చూద్దాం. " శీలవృద్ధిలేని చిలిపి విద్యలవేల?/ధర్మబుద్ధి లేని దానమేల ? చిత్తశుద్ధి లేని శివపూజ లవి యేల ? // అని ప్రశ్నిస్తాడు. ఇక పక్షుల్లోనున్న ఐకమత్యం మనుషుల్లో లేదనిచెప్పేటందుకు ఒక మంచి పద్యాన్ని వ్రాసారు. చదవండి.      " కాకి క్రింద పడిన " కావు కావు " మటంచు/వంద కాకు లచట వచ్చి వ్రాలు/నరుడు క్రింద పడిన పొరుగు వాడే రాడు//ఇక మంచిపనులు చేసేవారి గురించి "మంచిపనులు చేయ మర్యాద ప్రాప్తించు చెడ్డపనులు చేయ చేటు వచ్చు/మంచిచెడ్డ తెలిసి మనుగడ సాగించు// అని వ్రాస్తారు జంథ్యాలవారు. విశ్వసందేశ లహరిలోనున్న108 పద్యాలను108 ఆణిముత్యాలుగా మనం భావించాలి. కరుణశ్రీ వ్రాసిన
 బాలసాహిత్యంలో  "తెలుగుబాల " నుండి విశ్వ సందేశ లహరి" వరకూ నేను చదివిన పద్యాలన్నింటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ పొందుపరిచాను. ఇవిగాక బాలలకు ఉపయోగపడే అనేక   చిన్న కథలు, పెద్ద కథలు, నవలలు, నాటికలు, నాటకాలు, వ్యాసాలు,  వందల కొలది పద్యాలు, కరుణశ్రీగారిచే వ్రాయబడ్డవి. కరుణశ్రీ గారి రచనలలో గొప్పతనం ఏమంటే తను కథలు వ్రాసేటప్పుడు ఆ కథల్లో ముఖ్య
మైన విషయాలను బాలలకు తెలియజెప్పడానికి కథలోనే చిన్న చిన్న డైలాగ్స్ నాటిక రూపంలో ప్రవేశ పెడతారు. కరుణశ్రీ గారి కథ " మహారాజు -- మామిడి చెట్టు" ; "అలెగ్జాండరు --దొంగ '' అనే రెండు కథలలో ఈ ప్రయోగాన్నిచేసి పెట్టారు. ఇక నాటికల విషయానికొస్తే " బంగారు పద్మం, బొమ్మ పొత్తికలు, పారిజాతం, యజ్ఞ తురంగం నాటికలుకరుణశ్రీ గారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి.  కేంద్రసాహిత్య అకాడమీవారు విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో బాలసాహి త్యం పై ఒక సెమినార్ ను ఏర్పాటు చేసారు. ఆ సెమినార్ లో పాల్గొన్న నేను " నాటికలు ద్వారా బాలలకు బాలసాహిత్యా న్ని  బోధపరచడం ఎలా ?" అన్న అంశంపై  పేపర్స్ సబ్మిట్ చేసాను. ఆ సభకు నాతోపాటుగా నారంశెట్టి ఉమామహేశ్వ రరావుగారు, బెలగాం భీమేశ్వరరావుగారు, రావి రంగా రావుగారు ఇంకొందరిని వేదికపైకి  ఆహ్వానించి చర్చలు జరిపారు. వారంతా వారికిచ్చిన  టాపిక్స్ పై  మాట్లాడి పేపర్స్  సబ్మిట్ చేసారు. ( సశేషం )