ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం 28-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.
October 6, 2020 • T. VEDANTA SURY • Memories

న్యాయపతి రాఘవరావుగారు 13 ఏప్రిల్ 1905లో ఒరిస్సా  బరంపురంలో  జన్మించారు. ఇతని తండ్రి న్యాయపతి రామానుజస్వామి. ప్రముఖ లాయర్. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి. తల్లి ఒక సామాన్య గృహిణి. అతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉండేవారు. ముగ్గురు సోదరీమణులలో ఇద్దరు అక్కలు శాస్త్రీయ సంగీతం, పాటలు నేర్చుకునేవారు. వాటిని రాఘవరావుగారు కూడా విని సంగీత జ్ఞానం పెంపొందించుకోవడమే  కాకుండా పాటల పాడటంలో అధికమైన శ్రద్ధను చూపేవారు. బాల్యం నుండి రాఘవ రావుగారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా, క్రమశిక్షణతో చేసేవారు. ఏనాడు ఏ పని చేపట్టినా మొక్కుబడిగా చేసేవారు కాదు.అతను చేపట్టే పిల్లల కార్యక్రమాలు పిల్లలకు ఆనందాన్ని కలుగజేసేవిధంగా ఉండేవి. వారి కార్యక్రమాల వలన పిల్లలు లాభపడాలనే ఆశక్తి కలిగి ఉండేవారు.
రాఘవరావు గారు మాధ్యమిక స్థాయి చదువులలో ఉన్నప్పుడే  ఒక గ్రంథాలయాన్ని స్థాపించి అనేక పాత పుస్తకాలను సేకరించారు. రాఘవరావుగారు పిల్లలందరినీ రప్పించి చిన్న చిన్న నాటకాలు వేసేవారు. రాఘవరావుగారు ఏ పని చేసినా మనస్పూర్తిగా, క్రమశిక్షణతో చేసేవారు.  ఆ రోజుల్లో నాటక సమాజాలు అధికంగా ఉండేవి. వాటిని చూసి రాఘవరావుగారు "మిత్రమండలి" అనే నాటక సంస్థను నెలకొల్పారు.నాటకాలలో మధురవాణి, సీత లాంటి స్త్రీ పాత్రలను ధరించేవారు. ఇతని వేసే నాటకాలను చూడడానికి మహాత్మా గాంధీ లాంటివారు వచ్చేవారు. రాఘవరావుగారు పితృవాక్పాలకుడు. జాతి మతము కులము బేధములు లేని లౌకికవాది. పాఠశాలలో హరిజన విద్యార్థులను ఉపాధ్యాయులు ఓ మూలగా కూర్చోబెట్టడం రాఘవరావుగారికి నచ్చేదికాదు. హరిజన విద్యార్థులతో కలసి మెలసి ఆట పాట సాగించేవారు.1921లో మెట్రిక్యులేషన్ చదువుచున్న రాఘవరావు చదువుకు స్వస్తి చెప్పి స్వరాజ్య ఉద్యమంలో చేరి  వరుసగా ఆరు సంవత్స రాలు పాల్గొన్నారు. ఆ సమయములో రాఘవరావు అన్నగారు న్యాయపతి నారాయణమూర్తి "ఆంధ్ర వాణి"
అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రిక ప్రచురణలో
రాఘవరావుగారు అన్న గారికి సహాయం చేయడమే కాకుండా పిల్లలకు కథలు చెప్పడం, పాటలు పాడటం, నటించి చూపడం రాఘవరావు గారికి చాలా ఇష్టం. విజయనగరం మహారాజా కళాశాలలో బి. ఏ పాసయ్యారు. 1934లో  అతను కామేశ్వరి అనే ఆవిడను ప్రేమించి  పెండ్లి చేసుకున్నారు.1939లో న్యాయపతి రాఘవరావుగారు, న్యాయపతి కామేశ్వరిగారు మద్రాసు ఆకాశవాణిలో చేరారు. అందులో ఇరువురూ పిల్లల కార్యక్రమాలను విజయవంతం
గా  నిర్వహించేవారు.వీరిరువురు ప్రతి ఆదివారం ఆకాశ వాణి లో " ఆటవిడుపు" అనే పిల్లల కార్యక్రమాలు నిర్వహిం చేవారు. ఆటవిడుపు కార్యక్రమానికి  శ్రోతల సంఖ్య విపరీ తంగా పెరిగిపోయింది. ఆ కారణంగా 10 సంవత్సరాల లోపు పిల్లలకి శనివారం" బాలానందం" అనీ‌, పది సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు           " ఆటవిడుపు" కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వీరిరువురూ కృషి చేశారు. అగ్గిపెట్టెల ద్వారా శ్రావ్యమైన సంగీతాన్ని సృష్టించి పిన్నలను, పెద్దలను ఆనందపరచే వారు.న్యాయపతి రాఘవరావు గారి ఆశయం ఏమిటంటే బాలలలో నిద్రాణమైన కళలు బయటికి రావాలి. మంచి పద్ధతులు నేర్చుకోవాలి. భవిష్యత్తు సమాజములో మంచి పౌరులుగా మెలగాలి అన్నదే తన ఆశయంగా ఉండేది. పిల్లలచే పాటలు, పద్యాలు, నాటికలు, సంభాషణలు రాసి వాళ్లకు బాగా నేర్పించి రేడియోలో ప్రసారం చేసేవారు. దీనికోసం అనేక దినాలు కష్టపడి పిల్లలకు ప్రాక్టీస్ ఇచ్చేవారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి న్యాయపతి రాఘవరావుగారు బాలానంద సంఘం అనే సంస్థను 1940లో ఏర్పాటు చేశారు. పిల్లలకు ఆటలు పాటలలో పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు ఇచ్చేవారు. 1945లో “ బాల” అనే పత్రికను స్థాపించి  ఉత్సాహవంతు  లైన పిల్లల కోసం పత్రికను నడిపారు.1956లో మద్రాసు నుంచి హైదరాబాద్ ఆ తరువాత విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి భార్యాభర్తలు ఇరువురు తరలివచ్చారు.1976లో ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ స్థాపించడం జరిగింది. న్యాయపతి రాఘవరావుగారు రాసిన" బడిగంట" పాటలు సంపుటిని బాలల అకాడమీ ప్రచురించింది. రాఘవరావు గారికి “ బాలబంధు” అనే బిరుదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిసత్కరించింది. అలానే మొదటి ప్రపంచ తెలుగు మహా  సభలు 1978లో జరిగినప్పుడు న్యాయపతి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది.1980లో “ బాలానందం మ్యాజిక్ స్కూల్” స్థాపించి ప్రముఖ ఇంద్రజాలికుడు బి వి పట్టాభిరామ్ గారిని ఆ స్కూలుకు సంచాలకునిగా నియమిం చారు. చొక్కాపు వెంకటరమణ గారిని, ఎన్. వి. అశోక్ లను సహాయ సంచాలకులుగా నియమించి అనేక మంది బాలలకు ఇంద్రజాలంలో శిక్షణ ఇచ్చి మూఢనమ్మకాలను తొలగించడానికి కృషి చేశారు. బాలసాహిత్యంలో న్యాయ పతి రాఘవరావుగారు , వారి భార్య కామేశ్వరిగాారు చేసిన సేవలకు " రేడియో అన్నయ్య"  " రేడియో అక్కయ్య" గా పేరుపొందారు. రేడియో అన్నయ్యగా పేరుపొందిన రాఘవ రావు గారు 1884 ఫిబ్రవరి 24న హైదరాబాదులో స్వర్గస్తు లయ్యారు. ఈ  వ్యాసాన్ని వ్రాసేటందుకు చొక్కాపువారి, వెలగావారి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకు వారికి కృతజ్ఞతలు. ( సశేషం )