ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బోయి భీమన్న జయంతి నేడు--మాడిశెట్టి గోపాల్, కరీంనగర్
September 19, 2020 • T. VEDANTA SURY • News

ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాప్రపూర్ణుడు, పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత లాంటి విభిన్న సాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన బోయి భీమన్న జయంతి నేడు* ఆయనను స్మరించుకుందాం --బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు.
తన రచనలతో ఆనాటి అణగారిన సమాజాన్ని అభ్యుదయపథ పయనానికి ప్రేరేపించిన సిద్ధాంతకర్త బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో, తన మీద పడిన రాళ్లనే మెట్లుగా మలచుకుంటూ కీర్తిశిఖరాలను అధిరోహించిన నిరంతర చైతన్యశీలి ఆయన. అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన భీమన్న , సెప్టెంబరు 19, 1911న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. రెండో కుమారుడు ‘భీమన్న’.  
భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. భీమన్న కవిగా కళ్ళు తెరిచింది 1922లో తన పదకొండవ ఏట. అప్పటినుండి మరణించేవరకు ఆయన కవిత్వ సృజన వ్యాసంగం ఎనభై సంవత్సరాల సుదీర్ఘకాలం మీద కొనసాగింది. కావ్యాల పంట కొనసాగింది. 
బోయి భీమన్న ప్రముఖ రచయిత. ఈయన సుమారు 70 పుస్తకాలు రాశాడు. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశాడు. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది. ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశాడు. వీటన్నింటితో పాటు అంబేడ్కర్‌ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశాడు. వీరు వ్రాసిన ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది. ”ప్రతిరోజూ సుప్రభాతం పాడితేనేకాని
దేవుడికే మెలకువరాని ఈ దేశంలో
ఎంతటి ప్రసిద్ధ సత్యం కానీ – ఎవరో
అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండాలి మనిషికి”
అంటారు ‘గుడిసెలు కాలిపోతున్నాయ్‌’ గ్రంథంలో.
1937 నుండి ప్రముఖ హరిజన నాయకులు కుసుమ ధర్మన్న గారి పత్రిక ‘జయభేరి’లో సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1953లో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామ ప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు. 1955 నుండి రాష్ట్రప్రభుత్వంలో అనువాదకునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి నామినేట్‌ అయ్యారు. కేంద్రసాహిత్య అకాడమీ నుండి పురస్కారం అందుకొన్నారు. జాషువా ఫౌండేషన్‌ వారు ఇచ్చే జాషువా పురస్కారాన్ని అందుకొన్న ఏకైక ఆంధ్రుడు భీమన్న. 
ఆయన రచనలు... 
*కవిత్వం*..
అనాది కొసనుంచి అనంతతత్త్వంలోకి
రాగవైశాఖి
రాభీలు (కవితా సంకలనం).
గుడిసెలు కూలిపోతున్నై' కవితాసంపుటి 1975 (కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది).
భీమన్న ఉగాదులు
భీమన్న కావ్యకుసుమాలు
మోక్షం నా జన్మహక్కు
చివరిమెట్టుమీద శివుడు
కూలీ శతకం
రాగోదయం
అకాండతాండవం
గిల్లిచెబుతున్నా
మధుబాల
మధుగీత
దీపసభ
*నాటకాలు*
పాలేరు, నాటకం - 1938
కూలిరాజు
అసూయ
ప్రగతి
పడిపోతున్న గోడలు
రాగవాసిష్ఠం
ఆదికవి వాల్మీకి
వేదవ్యాసుడు
ధర్మవ్యాధుడు
బాలయోగి
చిత్రకళాప్రదర్శనం (నాటికల సంపుటి)
నవజీవన్ పత్రిక
చండాలిక (టాగూర్ రచించిన చండాలిక నాటికకు అనువాదము)
వచన రచనలుసవరించు
ఏకపద్యోపాఖ్యానం
ఇదిగో ఇదీ భగవద్గీత
జన్మాంతరవైరం
పురాణాలలో హరి-గిరిజన మనీషులు
ధర్మం కోసం పోరాటం
అంబేద్కరిజం
అంబేత్కరమతం
జానపదుని జాబులు*ఆయన పొందిన పురస్కారాలు*
👉ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారిచేత కళా ప్రపూర్ణ - 1971
👉పద్మశ్రీ పురస్కారం - 1973
👉కాశీవిద్యాపీఠం గౌరవ డాక్టరేట్ - 1976
👉పద్మ భూషణ్ పురస్కారం - 2001
👉కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
👉నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
👉పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ఠ పురస్కారం
👉తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు - 2004

*బోయి భీమన్న సాహిత్య పీఠం*
బోయి భీమన్న సాహిత్య పీఠం హైద్రాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది.
భీమన్న తన రచనల ద్వారా గొప్ప గొప్ప సందేశాలు ఇవ్వాలనుకోలేదు..కుల వ్యవస్థ మాసిపోతే చాలు  అందరు సమానమే అనే భావన వస్తే చాలు, మనుష్యులందరు సహజంగా గొప్పదనం సాధిస్తారు అనే సిద్దాంతం వీరిది. ఆ  ప్రయోజనం కోసమే వీరి రచనలు సాగినవి.
 2005 డిసెంబరు 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.ఆయనకు నివాళులు