ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బోర్డులు- పేర్లు--వసుధారాణి.--ఇప్పటి పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి.మేము అలా లేము.మాకు చాలా విషయాలు చాలా నెమ్మదిగా అవగతం అయ్యాయి.ఇలా అర్ధం కాకుండా ఉన్నవి ,నవ్వించినవి ,ఆలోచింపచేసినవి అయిన పేర్లు,షాపుల పేర్లు, కొన్ని స్లోగన్లు గుర్తు చేసుకుందాం.మున్సిపల్ స్కూల్ దగ్గర ఉన్న చిన్న మార్కెట్ కాకుండా మూడో రైల్ గేటు దగ్గర పెద్ద మార్కెట్ ఉంది మాఊళ్ళో.చిన్న మార్కెట్ లోనే ఎక్కువగా కూరలు తెచ్చేదాన్ని.ఒక్కోసారి పెద్ద మార్కెట్ కు ఉదయాన్నే వెళ్ళి కూరగాయలు తేవటం కూడా జరుగుతుండేది.మున్సిపల్ ఆఫీసు ముందు నుండి పెద్ద మార్కెట్ కి వెళ్ళే రోడ్డులో కలప దుకాణాలు,ఐరెన్ హార్డ్ వేర్ షాపులు, ఎలెట్రిక్ వస్తువులు అమ్మేషాపులు ఉండేవి.కలప దుకాణాల దగ్గర ఓ ఇంటి ముందు నేమ్ ప్లేట్ కన్నా కాస్త పెద్ద బోర్డ్ నన్ను ఎప్పుడూ ఆకర్షించేది.అది "జాన్ సైదా వంట మాస్టర్". ఆ చోటుకు వెళ్ళగానే నా కళ్ళు వాటంతట అవే ఆ బోర్డ్ పైకి వెళ్ళేవి.ఆయన ఎవరో నేను ఎప్పుడూ చూడలేదు.కానీ ఇప్పటికీ అక్కడికి వెళితే ఆ బోర్డ్ కోసం వెతుక్కుంటాయి కళ్ళు.పద్మావతమ్మ హాస్పటల్ రోడ్డులో బాగా మాసిపోయిన బోర్డ్ ఒకటి ఉండేది. "నాగరాజు,డిస్కో రాజకుమారి".వాళ్ళు ఎవరో! ఏమిచేస్తారో తెలియటానికి చాలా కాలం పట్టింది.ఆ సన్న సన్న వీధుల్లో అలాంటి బోర్డులు చాలానే ఉండేవి లైటింగ్,ఆర్కెస్త్రా తో పాటు,డిస్కో నళిని,జూనియర్ చిరంజీవి ఇలాంటి పేర్లు. అలాగే "ముళ్ల ఆసుపత్రి" డాక్టర్ ..... "అరటిపళ్ళ వ్యాపారం" "బండి అద్దెకు" అని కొన్ని అమ్ముడు బండ్లకి రాసివుండేది. ఇక మా గూడురిక్షాల మీద పేర్లు, లోపల అభిమాన తారల బొమ్మలు నయనానందకరంగా ఉండేవి. "తల్లిదీవెన", "డ్రైవర్ రాముడు", "కిలాడి కృష్ణుడు" ఇలా. రిక్షా ఎక్కే కాలిచెక్క మీద సోమవారం,గురువారం అలా రాసి వుండేవి.ఇక్కడ వారం పేరు ఎందుకా అర్ధం అయ్యేది కాదు.తర్వాత తెలిసింది రిక్షా అద్దెకు తీసుకుని తొక్కుకునే వాళ్ళు బాడుగ చెల్లించాల్సిన రోజు గుర్తుగా రాస్తారుట. రిక్షాలు అద్దెకు ఇచ్చే యజమానులు వుండే చోట్లు రౌడీ అడ్డాలుగా అనిపించేవి నాకు. "నాగమణి పూల వ్యాపారం" "ధర్మకాటా" "తాళ్ల కొట్టు" "పంచదార చిలుకలు మా ప్రత్యేకత" "కుదువ పెట్టుకొనబడును" చాలా రోజులు పట్టింది తెలుసుకోవటానికి. "సైకిల్ పంచర్ వేయబడును" "హోల్సేల్ తిలకాలు,గాజులు" " మంగమ్మ వెదురు వ్యాపారం" "మొలల ఆసుపత్రి" మరియు "యునానీ వైద్యం". "జీళ్ళ కొట్టు" బ్రమ్మయ్య గారి మొదటి కొట్టు.రెండో కొట్టు ఎక్కడా కనపడలేదు నాకు ఎంత వెతికినా...ఈ పేర్ల వెనుక ఎంత సమాజం ఉందో తెలియటానికి బోలెడు సమయం పట్టింది .రాస్తూ పోతే ఎన్ని ఉన్నాయో ఇలా .ఇవన్నీ మా నరసరావుపేట లోని పేర్లే సుమండీ. PS:ఫొటోలో ఇచ్చిన బోర్డ్ మాత్రం మా ఊరిలోది కాదు.
August 12, 2020 • T. VEDANTA SURY • Memories