ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాషా దినోత్సవం.--వసుధారాణి.
August 29, 2020 • T. VEDANTA SURY • Memories

విజయవాడకు వచ్చాక కొన్ని మాటలు ముఖ్యంగా అమ్మ భాషకు చెందిన అచ్చ తెనుగు మాటలు వింటున్నాను.కరోనా పుణ్యమా అని కాలు బయటపెట్టటం లేదు.సూపర్ మార్కెట్లు,ఫ్రూట్ కాంబోలూ లేవు.
మా వీధిలోకి ఉదయాన్నే వచ్చే ఆకుకూరలు అమ్మే అబ్బాయి కేకలతో తెలుగు రోజు మొదలు.తోటకూర కాడల నుంచి పొన్నగంటి ఆకు దాకా కొని వండుకుని తిన్నాక రుచి అన్నది మన చేతిలో రావాలి కానీ. అతని కేకలు వీనుల విందుగా ఉంటాయి.
కూరగాయల పిలుపులు రకరకాల గొంతుకలలో పది గంటల వరకు.నేను అస్సలు కొనని కూరల బండి మైక్ లో 'నీలి నీలి ఆకాశంఇద్దామనుకున్నా'అనే పాటని పదే పదే వినిపిస్తూ మధ్యలో వంకాయలు,కాకరకాయలు అని అరుచుకునే బండి.ఆకాశం ఇస్తానని కాకరకాయలు ఇవ్వటం మహా మోసంగా అనిపిస్తుంది.
కూరలు, ఆకుకూరల బండ్లు అయిపోయాక కోడి గుడ్లు,ఉల్లిపాయలు కూడా వచ్చేస్తాయి.ఆ తరువాత పది గంటలప్పుడు లూనా చుట్టూ నాలుగు గోనె సంచులు తగిలించుకుని లోపల పండ్లతో పైన కప్పిన తాజా ఆకులతో జామ పండ్లు అమ్మే తాత వస్తాడు.'నాన్నా తోటనుంచి ఇపుడే తెచ్చారా చెట్టుకి కాసిన కాయలు' అంటాడు.కాయలన్నీ చెట్లకేగా కాస్తాయి.కానీ ఆయన అలా చెప్పగానే మన పెరటి చెట్టుకే ఆ కాయలు కాసిన భావన.అదీ అమ్మ భాష కమ్మదనం.
మా అక్కయ్య వాళ్ళ అత్తగారు వేడి వేడి నెయ్యి అన్నంలో వడ్డిస్తూ 'వెన్నకాచిన నెయ్యి మా ఇంట్లో 'అనేది.ఒకటో క్లాసులో నా చిన్న నాటి చెలి మాదిరెడ్డి పద్మ 'అబ్బా రాణీ అన్నం ఆకలవుతుంది ' అన్నట్లు.
సాయంసందె వేళ, వెన్నెల వేళ పువ్వులు అమ్మేవాళ్ళు వస్తుంటారు .చామంతులు, బంతులు ....ఇలా పువ్వుల ప్రవర అంతా చదివినాక తాజా జాజులమ్మా ! అన్న పిలుపుకి మాత్రం బయటకు వెళ్ళి కొనుకుండా ఉండలేం అనిపిస్తుంది.ఈ పిలుపులు మన మనసుని తాకటానికి కారణం వస్తువు కంటే అమ్మ భాష పట్ల వుండే మనకే తెలియని ఓ దగ్గరితనం ,ప్రేమేనేమో అనిపిస్తుంది.
వాన వేళ వేడి వేడి వేరుశెనగ పప్పులు, నడి ఎండన చల్లని మజ్జిగ,ఈ పిలుపుల వెనుక వారి వ్యాపార సూత్రం ఎలా వున్నా భాష చేసే కనికట్టు కూడా తక్కువేమీ కాదు అనిపిస్తుంది. భావాన్ని శబ్దం ద్వారా ఇతరులకు చేరవేసే భాష గొప్పది,అలాటి భాషను చిన్నచూపు చూడటం తగని పని.