ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము* - పద్యం (౧౬-16)
September 21, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల :
*ఉరుబలశాలినంచుఁ దను | నొల్లని అన్య పతివ్రతాంగనా*
*సురతము గోరెనేని కడ | సుమ్మది భూతికిఁ బ్రాణహానియౌ;*
*శిరములు గూల రాఘవుని | చే దశ కంఠుడు ద్రుంగిపోవఁడే*
*యెరుఁగక సీత కాసపడి | యిష్టుల భృత్యులఁగూడి భాస్కరా!*
*సురతము = సంగమము, కలయిక*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
ఎంతటి బలవంతుడు, ధనము, సంపదలు కలిగిన పురుషుడు అయినా, తనను ఇష్టపడని, ఒప్పుకోని స్త్రీ తో, తనకున్న బల దర్పాలను ప్రదర్శించి ఆమె సాంగత్యము కోరుకుని, దగ్గరగా వుండాలి అనుకుంటే, ఆ పురుషుడు అన్నివిధాలా నష్టపోతాడు.  రావణ బ్రహ్మ - చాలా శక్తి సంపన్నుడు, విశేషమైన సంపదలు కలవాడు, దశ కంఠుడు. శివుని ఆత్మ లింగమునే పొందినవాడు. అంతటి వాడు, పంతానికి పోయి, శ్రీ రాముని భార్య ఐన సీతాసాధ్విని చెరబట్టి, దాశరథి తో జరిగిన యుద్ధంలో తన సైన్యాన్ని, ఆత్మీయులను, పోగొట్టుకుని, చివరకు తాను కూడా ఆహుతి అయ్యాడు కదా ...... అని భాస్కర శతకకారుని వాక్కు.
*పురాణాల లో గానీ, చరిత్ర లో గానీ పరస్త్రీ వ్యామోహం లో వుండి, నాశనమైనవారే తప్ప వృద్ధి లోకి వచ్చినవాళ్ళు లేరు. పరమేశ్వర కృపతో మనకు దక్కనిది ఎదీ మనది అవదు. మన వద్ద వుండదు. అలా మనది కాని దాని గురించి పాకులాడటం వల్ల బాధ, నష్టం తప్ప సంతోషం కలగదు. అందుకే, నిత్యము, సహేతుకము, సనాతనము అయిన "నేను" ను పలుకరించి, తెలుసుకుని, ఆ "నేను" లో కలసిపోయే ప్రయత్నం భగవత్ కృపతో జరగాలని* భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss