ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౪౩ - 43)
November 4, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల : 
*చాలఁ బవిత్రవంశమున | సంజనితుండగు నేని యెట్టి దు*
*శ్శీలునినైనఁదత్కుల వి | శేషముచే నొకపుణ్యు డెంతయుం*
*దాలిమి నుద్ధరించును ; సు | ధానిధిఁ బుట్టఁగగాదె శంభుఁడా*
*హాలహలానలంబు గళ | మందు ధరించుట పూని భాస్కరా!*

తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!

 విష్ణుమూర్తి శేషతల్పానికి ఆధారమైన సముద్రము గొప్పది కదా. అలాంటి సముద్రంలో జగత్తును దహించివేయగల విషం జన్మింది. అంతటి కాలకూట విషానికి కూడా మహాశివుని కంఠంలో నిలవడంతో మంచి పేరే వచ్చింది.  అలాగే, మంచి పేరుగల వంశంలో ఒక దుర్మార్గుడు, మందబుద్ధి పుట్టినా కూడా వేరొక మహాత్ముని చేత ఉద్ధరించబడి, ఆ దుర్మార్గుడు, అతని వంశం కూడా గౌరవింప పడతాయి ...... అని భాస్కర శతకకారుని వాక్కు.

*మనకు జన్మతః వచ్చిన చెడు లక్షణాల నుంచి మనలను కాపాడే వాడు, మనలను మంచి దారిలోకి మళ్ళించేవాడు సద్గురువు ఒక్కరే. విషం విషయంలో మహాశివుని లాగా. కాకపోతే, అంతటి మహాగురువుని గుర్తించే శక్తి/స్పృహ మనకు వుండదు. ఆ నడిచే గురువు పరమశివుడు తానే మనల్ని తన దగ్గరకు రప్పించుకుని, మనల్ని, మన వంశాన్ని ఉద్ధరిస్తారు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss