ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౦౧-01)
September 4, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
శ్రీ గల భాగ్యశాలి కడఁ | జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున | కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి ; రత్ననిల | యుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని | సన్నుత మద్గురుమూర్తి భాస్కరా !
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా ...
సముద్ర గర్భంలో వివిధ రకాలైన రత్నాలు, మాణిక్యాలు వుంటాయి, దొరుకుతాయి అని భావించి కదా నదులన్నీ సాగరాన్ని చేరుతున్నాయి. అలాగే, మనతో ఏవిధమైన బాంధవ్యం లేని వారు కూడా, మన దగ్గర ఎక్కవగా సంపద వుంటే, మనల్ని చేరడానికి దారిలో కలిగే కష్టాలను కూడా పట్టించుకోకుండా, మనకు దగ్గరగా వుండడానికి చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు..... అని భాస్కర శతకకారుని వాక్కు.
ఇదే భావాన్ని, సుమతీ శతక కారుడు ఇలా చెప్పారు -
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడెబంధువులు వత్తు | రది యెట్లన్నన్
దెప్పలుగఁ జెరువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁ | గదరా  సుమతీ
*కాలాలు మారాయి, పరిస్థితులు మారాయి, కానీ మనుషుల స్వభావాలు మారలేదు, మారట్లేదు. కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మానకూడదు*
 అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss