ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
భాస్కర శతకము - పద్యం (౦౨-02)
September 5, 2020 • T. VEDANTA SURY • Poem

*ఉత్పలమాల :*
అంగన నమ్మరాదు తన | యంకెకురాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెరు | పం దలపెట్టు, వివేకియైన సా
రంగధరుం బదంబులు క | రంబులు గోయఁగజేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువ | రాని కుయుక్తులు పన్ని భాస్కరా !
*తన యంకెకురాని = తనకు స్వాధీనము కాని*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా ...
ఎంతటి తెలివి గలవాడు, శారీరక బలం కలిగిన వాడు అయిన మగవాడు అయినా, ఒక స్త్రీ తనని వలచి వచ్చినప్పుడు అంగీకారము తెలుపక పోతే, నొచ్చుకున్న ఆ స్త్రీ, తాను మరులుగొన్న ఆ పురుషునికి ఎంతటి దారుణమైన దుర్గతి అయినా వచ్చే టట్టు చేయగలదు. ఎలా అంటే, పూర్వము రాజరాజ నరేంద్రుని రెండవ భార్య చిత్రాంగి.  ఈమె తమ రాజ్యంలోని సారంగధరుని ప్రేమిస్తుంది. కానీ సారంగధరుడు, మీరు రాజు గారి భార్య, ఇలా నాపై మనసుపడటం సరికాదు అని చెప్తాడు. దానికి నొచ్చుకున్న చిత్రాంగి, రాజుగారికి సారంగధరుని మీద చాడీలు చెప్పి అతని కాలు, చేతులు నరికించి వేస్తుంది ..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*మన ఎదుటి వారు స్త్రీ/పురుషుడు ఎవరైనా వారు మనపై చూపించే ప్రేమ/అభిమానం/ఆత్మీయత ఎంత స్వచ్ఛమైన వో తెలుసుకుని మనం మసలుకోవాలి. కపట ప్రేమ చూపేవారు మన చుట్టుపక్కల చాలా మందే వుంటారు. అటువంటి వారిని గుర్తించి, వారికి దూరంగా, "నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అన్నట్లు నడచుకోవాలి*
 అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss