ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మంచి చూడు!(గేయకథ) రచన:బి.వి.పట్నాయక్,పార్వతీపురం 9441349275
October 28, 2020 • T. VEDANTA SURY • Poem

రైతు ఇంట పుట్టినాడు
పనిపాటులు విడిచినాడు
బద్ధకముకు బానిసయ్యి
బతుకుచుండె సుబ్బరాజు!

పనిదొంగగ పెరుగుచున్న
సుబ్బరాజు తీరు చూసి
భీతి చెంది తండ్రి కాస్త
మందలించె గట్టిగాను!

మాటపడని సుబ్బరాజు
మూతి ముడిచి వీపు తిప్పి
కోపంతో అడుగులేస్తు
అలిగిమరీ అటుకు ఎక్కె!

తల్లడిల్లె తల్లి అంత
కొడుకు అలక తీర్చుటకై
అటక కింద చేరి మరీ
రారమ్మని బతిమాలెను!

పనీ పనీ సతాయించె
నాన్న నన్ను ఓదార్చిన
అటుకు నుండి దిగుదుననీ
షరతు పెట్టె సుబ్బరాజు

ఏమి బాధ వచ్చి పడెను
కక్కలేక మింగలేక
నలుగు చుంటి మధ్యలోన
బాధ పడెను తల్లి అంత!

ఇంతలోన సుబ్బరాజు
కేక పెట్టి కింద దిగెను
దొంగ చీమ కుట్టిందని
చిందులేసి గోల పెట్టె!

సుబ్బరాజు చెంత చేరి
తల్లి అంత బుజ్జగించె
దొంగ చీమ అది కాదని
ఓదార్పుగా మాట కలిపె!

చీమ తరుపు మాట్లాడే
నీ తీరుకు నవ్వు వచ్చె
చీమ ఎపుడు చుట్టమయ్యె?
వెక్కిరించె సుబ్బరాజు

చీమ పనికి అడ్డు వచ్చె
నిన్ను కరచి దారి నడిగె
మంచిచీమ నాచుట్టము
సమర్ధించి తల్లి చెప్పె

కరుచుటయే చీమ గుణం
శిక్షించుట నా ధర్మం
దాని అంతు నే చూచెద
ఊగెనంత సుబ్బరాజు!

విలువలున్న సంఘజీవి
శ్రమను నమ్ము కష్టజీవి
ప్రతి చీమా ధన్యజీవి
వివరించెను తల్లి అంత!

వర్ణించకు చీమగొప్ప
తీపి పట్ల దాని తీరు
దొంగతనపు రుజువు గదా
వాదించెను సుబ్బరాజు!

కోపమంత విడిచి పెట్టి
చీమ నందు మంచి చూడు
బతుకుదారి కనిపించును
హితవు పలికె తల్లి అపుడు!

సుబ్బరాజు ఆలోచన
మబ్బు వీడి వెలుగు చూసె
అబ్బురముగ మనసు మారి
పనిపాటులు చేయతలచె!

భవితవ్యపు బాగు కొరకు
కష్టపడే చీమ నైజం
ఆచరించు మానవులకు
మేలు కలుగు నిజం నిజం!