ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మద్రాసులోని మరికొన్ని ప్రాంతాల గురించి ఈరోజు చూద్దాం...తిరువాన్మ్యూర్--జ్ఞానసంబంధుడు, తిరునావుక్కరసర్, చేక్కియర్, అరుణగిరినాథుడు తదితరుల తిరువాన్మ్యూర్ స్థలపురాణం,.తిరుపుగళ్, పాంబన్ కుమరగురుదొన స్వామి, కవి సేతురామన్ పాటలు త చదివినా విన్నా ఈ ఊరు గురించి సమాచారాన్నిస్తాయి.వాల్మీకితో సంబంధం కలదనే కర్ణపరంపర కథ ఒకటికూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. అయితే తిరువాన్మ్యూర్ స్థలపురాణంగా చెప్పబడే కథలు నమ్మశక్యంగా లేవని చెప్పేవారూ ఉన్నరు.శైవగురువులు ఇక్కడి ఆలయం, చుట్టుపక్కల పరిస్థితులు తదితర విషయాలను ప్రముఖంగా పాడటం వల్ల ఇక్కడి స్థలపురాణం నమ్మాలన్నది ఆస్తికుల మాట.తిరువాన్మ్యూరులోని అమ్మవారి గర్భాలయ గోడలపై చోళుల కాలంనాటి శిలాశాసనాలు కనిపిస్తాయి.కానీ పరమేశ్వరుడి గర్భాలయం చుట్టూ ఒక్క శిలాశాసనంకూడా కనిపించదు.తేవారం అనే దివ్య ప్రబంధంలో ఈ ఊరు విశేషాలు చెప్పడానికి ముందరే ఇక్కడి గొప్పతనం చరిత్రపుటలు తిరగేస్తే తెలుస్తుందని పరిశోధకుల మాట.వాన్మ్యూర్ అనే మాటే ఈ ఊరు పేరుగా ఉండవచ్చని, తిరు అనే మాట ఆ మాట ముందు కలపడం అనేది భక్తి ఉద్యమకాలంలో జరిగి ఉండవచ్చని ఆస్తికుల అభిప్రాయం.ఈ ప్రాంతంలో చెట్లు దట్టంగా ఉండేవట. అలాగే సముద్ర.తీర ప్రాంతముకూడా.ఇక్కడ వాల్మీకి పుట్టొకటి ఉందని అర్థంళ చెప్పే పాటలూ ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో ఒట్రియూర్ తదిర ప్రాంతాలు కూడా పుట్ట గురించి కథలు చెబుతాయని గ్రహించవచ్చు. పుట్టతో సంబంధమున్న వాన్మ్యూర్ అనే పేరు పొంది ఉండవచ్చని పరిశోధకుల అభిప్రాయం.తిరువాన్మ్యూరులో సందర్శించాల్సిన ఆలయమొకటుంది. ఆ ఆలయం పేరు మరుందీశ్వరర్ ఆలయం.ఇక్కడి జర్నలిస్టుల కాలనీలో నాకు పరిచయమున్న వారు ఇద్దరున్నారు. ఒకరు రఘుకుమార్ గారు. జెమినీ టీవీలో నేను పని చేసినప్పుడు ఈయన వార్తా విభాగానికి ఎడిటర్ గా ఉండేవారు.మరొకరు...బుజ్జాయి (బుజ్జాయి అనే మాసపత్రికతో ఎలాంటి సంబంధమూ లేదు) పేరుతో సుపరిచితులైన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారు. రచయిత. సుప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కుమారుడైన ఈయనను నేను ఓ ఆన్ లైన్ వెబ్ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి కలిశాను. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడాను. అలాగే కృష్ణశాస్త్రిగారు త్యాగరాయనగర్లోని జగదాంబా వీధిలో ఉన్నప్పుడు నేను మా నాన్నగారితో పాటు వొరింటికి వెళ్ళడం బాగా గుర్తు. ముళ్ళపూడివారి బుడుగెలాగో బుజ్జాయిగారి డుంబు పాత్ర అలాంటిది. బుజ్జాయి గారి పేరు స్ఫురణకు రావడంతోనే డుంబు కథనం, ఆయన వివిధ పత్రికలలో వేసిన కామిక్ స్ట్రిప్స్ గుర్తుకొస్తాయి. ఆయనసలు స్కూలుకే వెళ్ళలేదు.ఆయన విద్యాభ్యాసం.మ సంప్రదాయ పద్ధతుల్లో జరుగలేదు. అయితేనేం, ఆయన స్వయంప్రతిభాపాటవాలతో ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించారు.ఎప్పుడూ తండ్రి వెంటే ఉండటం వల్ల అలనాటి గొప్పగొప్ప వ్యక్తులను కలిసిన అదృష్టం బుజ్జాయి గారికి దక్కింది. కొన్ని నెలల క్రితం వార్త ఆదివారం అనుబంధానికి కామిక్స్ చరిత్ర గురించి రాసినప్పుడు బుజ్జాయి గురించికూడా కొన్ని మాటలు రాశాను. అప్పుడా వ్యాసం చూసి ఓ మిత్రుడు బుజ్జాయిగారికి ఆ విషయం చెప్పారు. అనంతరం బుజ్జాయిగారు మా రెండో అన్నయ్యను కాంటాక్ట్ చేసి తన నెంబర్ ఇచ్చారు. మా అన్నయ్య నాకు ఫోన్ చేసి బుజ్జాయిగారు నిన్ను ఫోన్ చేయమన్నారంటూ ఆయన నెంబర్ ఇచ్చినప్పుడు సరేనని చెప్పాను. కానీ మనసులో ఒకింత భయం. నా వ్యాసంలో ఏదైనా తప్పు దొర్లిందా అని. ఏదైతే అదే జరుగుతుందని వెంటనే ఫోన్ చేశాను. నమస్కొరమంటూ నేను చెప్పిన మరుక్షణం ఆయన ప్రతినమస్కొరం చేస్తూ "వార్త"లో వచ్చిన వ్యాసం గురించి ప్రస్తావిస్తూ ఇంకాస్త రాస్తే బాగుంటుందని సూచించారు. అంతేకాదు, మరో వారంలోపు ఓ మూడు పుస్తకాలు నాకు మద్రాసు నుంచి చేరవేశారు. వాటిలో ఒకటి ఆయన తన తండ్రిగారి (నాన్న - నేను) గురించి రాసిన పుస్తకమొకటి. మిగిలిన రెండూ బొమ్మల కథల పుస్తకాలు. ఆయన తన పదిహేడో ఏట "బానిస పిల్ల" అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరు గడించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ (ఇంగ్లీష్)లో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా వచ్చిన ఆయన బొమ్మల పంచతంత్రం కథలు లక్షలాది మంది పాఠకులను ఆకట్టుకున్నాయనడం అతిశయోక్తి కాదు. అటువంటి చిత్రకారుడితో నాకూ కొద్దో గొప్పో పరిచయముండటం నా భాగ్యం.- యామిజాల జగదీశ్
August 2, 2020 • T. VEDANTA SURY • Memories