ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మద్రాసులో నాకు తెలిసిన హిందీ పుటలు ---హిందీకి బద్ధ వ్యతిరేకి తమిళనాడు అనే అభిప్రాయం మన భారత దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలవారిది. అందుకు కారణమూ లేకపోలేదు. నా చిన్నప్పుడు హిందీని వ్యతిరేకిస్తూ మద్రాసులో పెద్ద ఎత్తున ఆందోళనా కార్య క్రమాలు జరిగిన సంఘటనలున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాల గురించి నాటి స్థానిక పత్రికలలో ప్రముఖంగా ఫోటోలతో పాటు వార్తలు వచ్చేవి. అయినా మద్రాసులో హిందీ అనే మాట అసలే లేదని చెప్పడానికి వీల్లేదు. హిందీ నేర్పించే శిక్షణా తరగతులున్నాయి. హిందీ సినిమాలు ఆడాయి. ఆడుతున్నాయికూడా. స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ హిందీ తరగతులు లేకపోలేదు. మా పెద్దవదిన, మా మూడో అన్నయ్య కూతురు హిందీ బోధకులే. మా వదిన ఐసీఎఫ్ వారి సిల్వర్ జూబ్లీ స్కూల్లో పైతరగతులకు హిందీ నేర్పారు. నేను హిందీ ప్రాథమిక్ పరీక్షలకు వెళ్ళి యాభై అయిదు మార్కులతో ప్యాసవడం మా వదిన దగ్గర హిందీ నేర్చుకోవడం వల్లనే. ప్రాథమిక్ తర్వాత నేర్చుకోలేదు. ఇప్పటికీ హిందీ అక్షరాలు కూడబలుక్కుని చిన్న చిన్న మాటలు చదవగలను కానీ ఐర్థాలు చెప్పలేను. మాటలాడలేను. తగిన కృషి చేయలేదు. మా అన్నయ్య కూతురు ఈ ఏడాది మొదట్దోనే నుంగంబాక్కంలో ఉన్న లయోలా కాలేజీలో హిందీ లెక్చరర్ గా చేరారు. మా మూడో అన్నయ్య చిన్నప్పుడు ఇంటికి దగ్గర్లోనే ఓ ఇంట ఉచితంగా హిందీ చెప్పిస్తే వెళ్తుండటం నాకు గుర్తే. మద్రాసులో హిందీ అనగానే నావరకూ నాకు ఇద్దరు తెలుగువారి పేర్లు గుర్తుకొస్తాయి. ఈ ఇద్దరినీ నేను ప్రత్యక్షంగా చూశానుకూడా. వారిలో ఒకరు చావలి సూర్యనారాయణగారని మేముండిన వివేకానందా స్ట్రీటుకి రెండో వీధైన ఉన్నామళై అమ్మాళ్ స్ట్రీటులో ఉండేవారు. ఆయన మీనంబాక్కంలోని ఎ.ఎం. జైన్ కాలేజీలో హిందీ పాటాలు చెప్పేవారు. ఆయన ఇంటికి మా నాన్నగారితో పాటు వెళ్తుండేవాడిని. ఇక రెండో ఆయన డాక్టర్ బాలశౌరి రెడ్డిగారు. ఆంధ్రుడిగా పుట్టి జాతీయ భాష హిందీలో సాహిత్య రచనలు చేసి, కేంద్ర సాహిత్య పురస్కారాలను అందుకున్న బాలశౌరి రెడ్డి ప్రధాని సలహాదారుగానూ ఉండేవారు. రాయలసీమలో పుట్టిపెరిగిన ఈయన ఉత్తరాదిన రచనా వ్యాసాంగాన్ని చేపట్టి, తమిళనాట స్థిరపడి ఇక్కడి తెలుగు వారికి ఆత్మీయులయ్యారు. ఆయన నిగర్వి. సహృదయులు. హిందీ భాషా ప్రేమికుడిగా మన్ననలు అందుకున్న శౌరిరెడ్డిగారికి మద్రాసుతో దశాబ్దాల బంధముంది.కడప జిల్లా, పులివెందుల తాలూకా గొల్లల గూడూరులో ఎద్దుల ఓబులమ్మ, గంగిరెడ్డి దంపతులకు 1928 జూలై ఒకటో తేదీన పుట్టిన బాలశౌరిరెడ్డిగారు కడప, నెల్లూరు, అలహాబాద్, బెనారస్‌లలో చదువుకున్నారు. హిందీ శిక్షణ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఈయన హిందీ చందమామకు రెండు దశాబ్దాలకుపైగా సంపాదకత్వం వహించారు. కోల్‌కత్తాలోని భారతీయ భాషా పరిషత్తుకు 1990-94 మధ్య డెరైక్టర్‌గా, ఆంధ్ర హిందీ అకాడమీ - హైదరాబాదుకు చైర్మన్‌గాను పని చేసిన బాలశౌరిరెడ్డిగారు హిందీ సాహిత్య సమ్మేళన, ప్రయోగ, తమిళనాడు హిందీ అకాడమీకి అధ్యక్షులుగా పని చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల నేకం అందుకున్న ఈయనకు సాహిత్యంపై ఎనలేని ప్రేమ. హిందీ, తెలుగు భాషల్లో అనేక రచనలు చేసిన ఆయన హిందీలో నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి అనువాదాలు చేశారు.శౌరిరెడ్డి రచనలపై దేశవ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. మా అన్నయ్య కూతురు ఆయన సాహిత్య రచనలపైనే పరిశోధన చేసింది.బాలశౌరిరెడ్డి అనేక తెలుగు నవలను హిందీలోకి అనువదించారు. రుద్రమదేవి, నారాయణ భట్ (నోరివారి రచనలు), రాజశేఖర చరిత్ర (వీరేశలింగం పంతులు), అల్పజీవి (రాచకొండ) తదితర ప్రముఖ నవలలను ఆయన తెలుగు నుంచి హిందీలోకి అనువదించారు.సాహితీ రంగంలో శౌరిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2006లో సాహిత్య పురస్కారాన్ని అందించింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి సన్మానంతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రముఖులు నుంచి సన్మానాలు పొందిన బాల శౌరిరెడ్డిగారు భారత ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించే కేంద్రీయ హిందీ సమితికి సలహాదారుడుగా స్థానం పొందడం విశేషం. ఆయన 88 వ ఏట 2015లో మద్రాసులోనే కన్నుమూశారు.ఇదిలా ఉండగా, గతులోకొక్కసారి వెళ్తే మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభను 1918లో మహాత్మాగాంధీ ఈ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రచార సభ టీ. నగర్లోని తణికాచలం చెట్టి స్ట్రీట్లో ఉంది. గాంధీజీ దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నాక 1915 లో మొదటిసారిగా మద్రాసుకొచ్చారు.ఆ అర్వాత ఆయన అనేకసార్లు మద్రాసుకొచ్చారు. దక్షిణ భారత దేశ ప్రజలుకూడా హిందీ నేర్చుకుంటే జాతీయ సమగ్రతకు, ఐకమత్యానికి దోహదపడుతుందని ఆయన ఆశించారు. ఇందుకోసం ఆయన తగిన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా హిందీ సాహిత్య సమ్మేళన్ ను ఆదేశించారు. అంతేకాకుండా అందుకు నిధులు సేకరించమని కూడా సూచించారు. 1918లో హిందీ సాహిత్య సమ్మేళన్ వార్షికోత్సవ సమయంలో తన కుమారుడు దేవదాస్ గాంధీని మద్రాసుకు పంపించారు. హిందీ భాష ప్రచారంకోసం శ్రీకారం చుట్టమన్నారు. మొదట్లో మద్రాస్ రావడానికి అంతగా మొగ్గుచూపని దేవదాస్ తర్వాత తండ్రి మాటను కాదనలేక వచ్చారు. జార్జ్ టౌన్ లోని గోఖలే హాల్లో 1918 మే నెల మొదటి వారంలో ఆయన మొట్టమొదటిసారిగా హిందీ క్లాస్ నిర్వహించారు. ఈ క్లాసుకు ముందు ఓ చిన్నపాటి కార్యక్రామం ఏర్పాటు చేశారు. సి.పి. రామస్వామి అయ్యర్, డాక్టర్ అనిబిసెంట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంతోనే మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ పుట్టుకొచ్చింది. గాంధీజీ పిలుపు మేరకు మద్రాసులో ఎందరో ప్రముఖులు హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టారు. జార్జి టౌన్లో మొదటగా ప్రారంభమైన ఈ హిందీ ప్రచార సభను ఆ తర్వాత మైలాపూరుకి మార్చారు. అక్కడి నుంచి ట్రిప్లికేన్ కి మారిన ఈ సభ 1936 వరకూ ఇక్కడే నడిచింది. అనంతరం ఇప్పుడున్న టీ. నగర్ చిరునామాకు హిందీ ప్రచార సభ మారింది.కాంగ్రెస్ పార్టీ అధికారం లోకొచ్చిన తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీకి రాజాజీ ముఖ్యమంత్రి అయ్యాక విద్యాలయాలలో హిందీ సబ్జెక్టుని నిర్బంధం చేశారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఆరంభమయ్యాయి. దాంతో హిందీ ఆప్షనల్ సబ్జెక్టుగా మారింది.హిందీ ప్రచార సభ రజత్యుత్సవాలు 1943 లో జరగాల్సి ఉండగా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా వాయిదా పడింది. అందువల్ల 1946 లో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గాంధీజీ హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వారంరోజులపాటు ఈ ప్రచార సభలోనే బస చేశారు. సాయంత్రాలు ప్రార్థనలలో పాల్గొనేవారు. గాంధీ బస చేసిన కారణంగా దీనికి గాంధీ నివాస్ అని కూడా నామకరణం చేశారు. గాంధీజీ 1946 నాటి పర్యటన స్మృత్యర్థం 1963లో ఈ సభ ప్రాంగణంలో గాంధీ మండపం కూడా నిర్మించారు. ఇక్కడో విషయం చెప్పాల్సి ఉంది. హిందీ ప్రచారం కోసం మద్రాసు వచ్చినప్పుడు దేవదాస్ గాంధీ రాజాజీ కుమార్తె లక్ష్మితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్ళి చేసుకున్నారుకూడా.- యామిజాల జగదీశ్
July 29, 2020 • T. VEDANTA SURY • Memories