ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మధ్యయుగము నందలి సాహిత్య పోకడలు, రచనా విశిష్టతలు వేరైనను, పురాణ సాహిత్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రబలింది. రామాయణ, మహాభారత, భాగవత ఇతిహాసాలు అనుసరించే సాహిత్య రచన సాగింది. కావ్య ప్రబంధ యుగాలలో రస భావాలు, శృంగారానికి కవులు ప్రాధాన్యతనిచ్చారు. అందుకు కారణం ఆనాటి కవులు రాజాస్థానాలలో ఉండడం, మరియు యువ రాజుల ప్రాపకం కూడా కారణం అయింది. అంతేకాదు పురుషాధిక్యత కూడా కారణమే, ఇవి కాక పెక్కు కారణాలవల్ల కావ్యాలలో శృంగార రసం ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలుగు కవిత్వంలో శబ్దార్ధ భావాలకు కూడా ప్రాధాన్యత కనిపిస్తుంది. దక్షిణాంధ్ర యుగములో అదే మరింత అభివృద్ధి అయినట్లు కనిపిస్తుంది. చివరకు క్రీ.శ. 19వ శతాబ్ది ఆరంభము నాటికి తెలుగు కవిత రస భావములందు కొరవడి శబ్దార్థాలంకారాల ప్రధానమైన ఔచిత్యమును కోల్పోవుట సంబంధించినది. ఈ శతాబ్దము పూర్వభాగం వరకు స్వతంత్ర ప్రక్రియలకు పూను కొనుట లేదు. పెద్దన, రామరాజభూషణాదుల ప్రభుత్వ నిబంధనలను అనుసరించుటయే పరిపాటి అయినది. ఈ కారణములచే నాడు తెలుగు సరస్వతి, యమక శ్లేష అనుప్రాసాది అలంకారము లలో చిక్కుకుని సహజ స్వచ్ఛ సంచారమునకు దూరం కావలసి వచ్చినది. గురజాడకు ముందు తరం కవి శ్రీ శ్రీ వీరేశలింగం పంతులుగారు రచించిన సరస్వతి నారద సంవాదమను ఖండకావ్యము లో ఆనాటి కవితా పరిస్థితులు నిర్దిష్టంగా వర్ణించడం జరిగింది. సాహిత్య రంగమున కొంత చైతన్య భావము లోపించినట్లు కనిపిస్తుంది, అనుకరణమే ఆదిపత్యం వహించుట చూచి ఆంగ్ల భాష యందు నిష్ణాతులు, పండితులు, యువకులు నూతన మార్గములను అన్వేషిస్తూ అనుసరింప వలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా యువకవులు రచనా విధానము యెన్ను కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సాంప్రదాయ సిద్ధమైన కవితా ప్రవాహం ఏదో ఒక విధంగా సాగుతూనే ఉంది. వారి అన్వేషణ ఫలితంగా తెలుగు భాష యందు నూతన కవితా ప్రవాహం ఏర్పడి దేశం నలుమూలల యందు వ్యాపించడం జరిగింది. ఈ విధమైన పరిణామ వికాసముల వివరణమే తెలుగు వాఙ్మయ చరిత్రమున ప్రధాన స్థానం ఆక్రమించుకోవడం జరిగింది.ఆధునిక యుగంలో సాహిత్యం నూతన పుంతలు తొక్కినది. జానపద సాహిత్యం కూడా చోటు చేసుకున్నది. గేయ సంపద అనేక భాగాలుగా నూతన పోకడలతో కొనసాగుతున్నది. ఇందులో పౌరాణిక గేయాలు, చారిత్రక గేయాలు, పారమార్థిక గేయాలు, శృంగార గేయాలు, అద్భుత రస గేయాలు, కరుణ రస గేయాలు ఉన్నవి.ఇది గాక అనేక ఆధునిక భావనలతో అభివృద్ధి చెందింది. ఇందుకు కారణం విద్యాలయాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గేయ కవితను ప్రభావితం చేస్తూ పురోగమన దిశలో సాగుతున్నది. ( ఇది 84వ భాగం ) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 6, 2020 • T. VEDANTA SURY • News