ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మనసు కవి ఆత్రేయ జయంతి ఈరోజు* --మాడిశెట్టి గోపాల్, కరీంనగర్
September 13, 2020 • T. VEDANTA SURY • News

సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు.  దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి.  అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించాడు ఆయన . ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ', 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.[2]
తెలుగు సినిమాల్లో ఆత్రేయ మనసు పాటలతో పాటు తనదైన ముద్రగల వలపు పాటలు, వానపాటలు, వీణ పాటలు, అమ్మ పాటలు, అభ్యుదయ గీతాలు, తాత్విక గీతాలు మొదలైనవి రాశారు. ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండటం వలన అతను మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. 'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన 'సంసారం' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. 'అర్థాంగి' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', 'తోడి కోడళ్ళు' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి...', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా...', 'మంచి మనసులు'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు...', 'మూగ మనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో...' 'డాక్టర్‌ చక్రవర్తి'లో 'నీవులేక వీణ ...', 'అంతస్తులు'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము...', 'ప్రేమ్‌నగర్‌'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...', 'మరోచరిత్ర'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో...', 'ఇంద్రధనస్సు'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి...', 'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు...', 'మరోచరిత్ర'లో 'విధి చేయు వింతలన్నీ...', 'ఇది కథ కాదు'లో 'సరిగమలు గలగలలు...', 'స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య...' తోపాటు 'తేనే మనసులు', 'ప్రైవేట్‌ మాస్టర్‌', 'బ్రహ్మాచారి', 'మట్టిలో మాణిక్యం', 'బడి పంతులు', 'పాపం పసివాడు', 'భక్త తుకారం', 'బాబు', 'జ్యోతి', 'అందమైన అనుబంధం', 'గుప్పెడు మనసు', 'ఆకలి రాజ్యం', 'అభిలాష', 'కోకిలమ్మ', 'అభినందన', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు. ఎన్ని గొప్ప నాటకాలు, ఎన్ని సినిమాలు! ఎన్ని గొప్ప పాటలు! అతను చేత పాట రాయించుకోవాలని తిరగని వాళ్లు లేరు. ఐతే, ఆ పాట, ఆ మనసులో ఎప్పుడు పుడుతుందో! అతనుకే తెలీదు. ఆత్రేయ సంభాషణలూ అంతే, వింటూ థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. ఆయన రాసిన మరి కొన్ని పాటలు 
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము - జీవన తరంగాలు
• ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో
• కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో - తోడికోడళ్ళు
• చిటపట చినుకులు పడుతూ వుంటే చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటె
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయి - ఆత్మబలం
• నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసునా
• పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా
• పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
కనిపించని ఆశలవిందు మనసునే మరపించు గానం మనసునే మరపించు - పెళ్ళి కానుక
• భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికీ జేజేలు - బడిపంతులు
• మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే - ప్రేమనగర్
 సినిమా మాధ్యమంలోని పాటల్లో కూడా తన అంతరంగాన్ని ఆవిష్కరించి మనిషికీ మనసుకీ కొత్త భాష్యాలు చెప్పిన ఆచార్య ఆత్రేయ ఓ అక్షర యోగి! తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.

*ఆయనకు ప్రగాఢ నివాళులు*