ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మనిషి నల్లన.. మనస్సు తెల్లన.. -------- (కథ)---- బోగా పురుషోత్తం, తుంబూరు
September 30, 2020 • T. VEDANTA SURY • Story

 చీరాలలో  చిన్నయ్య అనే ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు. అతను స్వయంగా తన వద్దఉన్న చేనేత  మగ్గాలపై పట్టు చీరలు తయారు చేసేవాడు. వాటిని తన వ్యానులో తీసుకెళ్లి చెన్నై, కలకత్తా, ముంబై వంటి  నగరాలలో తన స్వంత  షాపుల్లో  విక్రయించేవాడు. గత ఆరు  నెలలుగా  లాక్  డౌను  కారణంగా చీరలు  గుట్టలుగుట్టలుగా నిలిచిపోయాయి. వాటి  విలువ  దాదాపు పాతిక కోట్లు పైనే ఉంటుంది.  సరుకంతా ఒక్కసారిగా నిలిచిపోవడంతో  కార్మిక  కుటుంబాలకు వేతనాలు  సకాలంలో అందించలేకపోయాడు. అదే సమయంలో పెళ్లి  ఈడు కొచ్చిన ముగ్గురు కుమార్తెల వివాహాలు ఎలాచేయాలి..? అని ఆలోచించసాగాడు. ఓ  పక్క  కరోనా  కారణంగా ఇంటినుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి. . తన తాహత్తుకు తగినవిధంగా పెళ్లిళ్లు  చేయడం  అసాధ్యం  అనుకున్నాడు. ఇక చేసేదేమీ లేక ఓ నిర్ణయానికి  వచ్చాడు.  తను కోటీశ్వరుడు అనే  విషయాన్ని మరిచి పొమ్మని  అతని  భార్య  కోరింది. అయినా చిన్నయ్య కోటీశ్వరుడిననే అహంభావం వీడలేదు. ఆ  కారణంగానే తన కూతుర్లకు ఎన్ని సంబంధాలు వచ్చినా అంగీకరించలేదు. వారంతా తన కాలి గోటికి కూడా సరిపోరని భావించడంవల్లే వచ్చిన  సంబంధాలన్నీ వెళ్లిపోయాయి. ఇప్పుడు లాక్  డౌన్  కారణంగా సంబంధాలు  అసలు  రాలేదు. తన పెద్ద కూతురి వయస్సు నలభై కి  చేరువ అవుతుండడంతో ఇక  పెళ్లి కాదేమో ననే భయం పట్టుకుంది. ఇప్పుడు ఆదాయం కూడా తగ్గడంతో చిన్నయ్య  మదిలో ఆందోళన మొదలయింది. లాక్  డౌన్ కాలంలోనే ఎలాంటి 'సంబంధం  వచ్చినా పెళ్లి  చేసేద్దామని నిశ్చయించాడు.  తన ఇంటి ఎదురుగా వున్న చెల్లయ్య కుటుంబం చిన్న వస్త్ర  దుకాణం నడుపుతుంది. చెల్లయ్య  అబ్బాయి బాగా చదివినవాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే మనిషి కొంచెం నల్లగా  వున్నాడు.  వాళ్ళ నాన్నే స్వయంగా వచ్చి తన కుమారుడ్ని అల్లుడిగా చేసుకోవాలని కోరాడు. చిన్నయ్యకు అహంభావం అడ్డువచ్చింది. *వాళ్ళ స్థాయి ఎక్కడ? మన స్థాయి  ఎక్కడ?* అని నిలదీశాడు. పైగా అబ్బాయి చాలా నల్లగా వున్నాడు. " అని శత కోటి వంకలు పెట్టాడు. అతని భార్య బాగా అలోచించింది. భర్తకు సర్ది చెప్పింది. " అబ్బాయి నల్లగా ఉంటే ఎం? మనస్సు తెల్లగానే ఉంటుంది. " అని తన దూరపు బంధువు అన్నయ్య అయిన చెల్లయ్య కొడుకు మనష్టత్వం  గురించి తన కూతురికి వివరించి నచ్చజెప్పింది. చిన్నయ్య భార్య. చిన్నయ్య కు ఆ సంబంధం నచ్చలేదు. ఎడమొహం పెడమొహం పెట్టాడు. తను వరుడికి ఒక్క పైసా కూడా కట్నం ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. చెల్లయ్య "అసలేమీ కట్నం ఇవ్వక్కర్లేదు.. కావలిస్తే మేమే ఎదురుకట్నం ఇస్తాము.. " అని ఒప్పించాడు. అయిష్టంగానే చిన్నయ్య పెద్ద  కూతురి పెళ్లి జరిగింది. సరిగ్గా చిన్నయ్య వద్ద నిలిచిపోయిన చీరలన్నింటినీ  తన  వస్త్ర దుకాణంలో  నెమ్మదిగా విక్రయించి పాతిక  కోట్లు అతని చేతిలో పెడుతుంటే చిన్నయ్య  తెల్లబోయాడు. ఆగిన తన వ్యాపారం మళ్ళి పుంజుకుంది. తన ఇద్దరి కూతుళ్లకు  కూడా తన పెద్దల్లుడు  మంచి  సంబంధాలు చూసి తన తాహత్తుకు తగిన విధంగా వివాహాలు చేసేశాడు. ఇక వయస్సు మీద పడుతున్న చిన్నయ్యకు వ్యాపారం చూసుకునే  వాళ్లు కరువయ్యారు. ఈ  పరిస్థితుల్లో నమ్మకమైన  పెద్దల్లుడుకి తన వ్యాపార లావాదేవీలు అప్పగించాలని నిర్ణయించాడు చిన్నయ్య. అతని  భార్య కూడా అంగీకారం తెలిపింది.  కొద్ది రోజులకే వ్యాపారం పుంజుకుంది. చిన్నయ్య  భార్య ,అతని చిన్న కూతుళ్లు ఇంట్లో వున్న సమయంలో " ఏమయ్యా ..ఇంత కోట్ల వ్యాపారాన్ని ఇద్దరు తెల్ల రంగు కలిగిన అల్లుళ్లు ఉండగా ఆ నల్లోడికే ఎందుకు అప్పగించావు?" అని ప్రశ్నించింది. 
   చిన్నయ్యకు  కోపం చిర్రెత్తుకొచ్చింది. "నా అల్లుడు  రంగు నల్లే అయినా మనస్సు తెల్లన.. వాడొచ్చాకనే నాకు అదృష్టం కలిసొచ్చింది. నా చిన్న కూతుళ్ళకి పెళ్లిళ్లు చేసి నాపై భారం తగ్గించాడు. ఇప్పుడు వ్యాపారం కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. ఏo మనిషి నల్లగా ఉంటే ఏ o? వాడి మనస్సు తెల్లన ..వాడిని ఇలా విమర్శించి నాకు కోపం తెప్పించొద్దు. .."అని అల్లుడిపై పల్లెత్తు మాట కూడా పడనివ్వలేదు. 
         భర్తలో  వచ్చిన మార్పును చూసి లోలోన మురిసి పోయింది చిన్నయ్య భార్య. 
      " నీపై మా  నాన్నకి వున్న విశ్వాసాన్ని వమ్ము చేయొద్దు.." అంటూ తన భర్త  చెవిలో గుసగుస లాడింది.. వెన్నలాంటి మనస్సువున్న  చిన్నయ్య  పెద్దకూతురు.