ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మనిషి విలువ నోరు చెబుతుంది'..!----సేకరణ: సుజాత.పి.వి.ఎల్.
September 10, 2020 • T. VEDANTA SURY • Story

ఒకసారి  విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు.      వేటాడుతూ..వేటాడుతూ 
అడవిలో ఒకరికొకరు దారి తప్పి దూరమైనారు. 
ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉన్నాడు.
అతన్ని చూసిన విక్రమాదిత్యుడు.."ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా స్వామీ"? అని అడిగాడు.
ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: 
" మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు " 
అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో  
 " స్వామీ మీకు కళ్లు కనిపించవు కదా! 
నా సేవకుడు, సేనా నాయకుడు, మంత్రి అని, వారు  ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? 
నేను రాజునని  కూడా ఎలా కనుగొన్నారు.? " అని అడిగారు .
అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: 
" మహారాజా..!  నేనా ముగ్గురినీ, మిమ్ములను 
మీ మాటలు విని కనిపెట్టాను. 
అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, 
"ఏమిరా, గుడ్డివాడా.! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. 
కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, 
"సూర్ దాస్! ఇటు ఎవరైనా వెళ్ళారా....?" అని అడిగాడు.
చివరకు మీ మంత్రి వచ్చి ,
" సూర్ దాస్ జీ ! ఇటు ఎవరైనా వెళ్ళారా......? " 
 అని అడిగారు.
ఇప్పుడు మీరు వచ్చి , 
" స్వామీ! ఇటు ఎవరైనా బాటసారులు వచ్చి వెళ్ళారా ?"  అని అడిగారు.
"మహారాజా! ఒక వ్యక్తి యొక్క నోటి నుండి వచ్చే మాటల ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు" అని ఆ సాధువు వివరించారు.
******(ఇంత చక్కని కథను నాకు షేర్ చేసిన మిత్రులు పి.తిరుమలరావు గార్కి ధన్యవాదాలు)