ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మనోమూలం --కె ఎస్ అనంతాచార్య
October 15, 2020 • T. VEDANTA SURY • Poem

గతం ఉన్నతమయ్యిందే
భవిష్యత్  కోరికల సాధన కోసం వేసే అడుగుల వెనక  నిలబడ్డ నీడ

సౌందర్యం కోసం
 సమస్తాన్ని వదులుకొనే తెగువ కు ఉసిగొల్పే అవ్యక్త భూత రాశి

తనువు ఆత్మల మధ్య పిల్లి రొట్టెల 
పంపకం  చేసే మాటల కోతి!


జిహ్వా..  రుచుల తోటలో
విహరిస్తూ సాధన కొరకు సాహాస యాత్రలు

పోల్చుకుంటూ కొలుచుకుంటూ ఉద్వేగాల వలకు  చిక్కిన చేప!

క్షణ మొక చిత్తం
 విత్త సముపార్జనకు వత్తాసు పలికే గుత్తేదారు!

తప్పు తనదైనా
తగువులా డే మూల ధాతువు ! 


మాట వెనక  మర్మం
నడక లోపలి నాణ్యత
నడత  అంచున  మంచి చెడుల
  పడుగు పేకల జరీ పోగు
 

గతించిన ఉదయాల దగ్గర ఆగక
 ఉజ్వల మధ్యాహ్నo కోసం ఉబలాటం  

ఉత్కృష్ట  మానవ ఆవిర్భావపు ఊపిరి  జ్ఞాన జ్ఞేయాల సమ్మేళనం 

అన్నింటికి మూలమైన
మనస్సు 
తమస్సు తొలగితే మిగిలే ముఖ వర్చ స్సు