ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మరిన్ని ప్రాంతాలూ పేర్లూ...రచన - యామిజాల జగదీశ్--మద్రాసులోని కొన్ని ప్రాంతాల పుట్టుక గురించి ఇప్పటికే అప్పుడప్పుడూ చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మరో మూడు ప్రాంతాల గురించి చూద్దాం...1క్రోంపేట: -చరిత్ర ప్రాధాన్యం ఉన్న తొండ మండలంలో ఓ భాగమై ఉండేదీ ప్రాంతం. ఇప్పుడు భద్రాసులో ఓ భాగం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ని స్థాపించడమే కాకుండా మన భారత దేశంలోని ఇస్లామీయుల పితామహుడిగాపిలువబడే ఖాయిదే మిల్లత్ ఇస్మాయిల్ సాహిబ్ ఈ ప్రాంతంలోనే జన్మించారు. 1884లో మన దేశానికి వచ్చిన జార్జ్ అలెగ్జాండర్ చేంబర్స్ 1903 లో తోలును శుభ్రం చేసే పరిశ్రమను ప్రారంభించారు.దీనికి కొనసాగింపుగా పల్లావరం పరిధిలో దక్షిణ భాగాన 1912లో 25 ఎకరాల విస్తీర్ణంలో క్రోం లెదర్ కంపెనీని జీ.ఎ. చేంబర్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతానికి క్రోంపేట్టయ్ అనే పేరు రూపొందింది.దేశ స్వాతంత్ర్యానికి అనంతరం 1949లో ఇరవై హెక్టార్ల విస్తీర్ణంలో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) అనే విద్యాలయం ఈ ప్రాంతంలో నెలకొల్పారు.ఆ తర్వాత నివాసగృహాలు, వ్యాపర కట్టడాల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. క్రోంపేట్ పేరుతో ఓ లోకల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది.2తేనాంపేట:-తేనాంపేట 1800 వరకూ వ్యవసాయక్షేత్రంగా ఉండేది. వరి, తమలపాకు, అరటి, చెరకు, కాయగూరలు అధికంగా సాగవుతుండేవి. ఈ ప్రాంతంలో ఓ పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువునీరే ఈ పంటలకు వినియోగించేవారు. వేలాలర్లు‌, పల్లర్లనే తెగవారు ఎక్కువ సంఖ్యలో నివసించేవారు. ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్లు ఎక్కువగా ఉండేవారు. క్రీ.శ. 1800తర్వాత ఆంగ్లేయుల రాక ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడింది. పన్నెండో శతాబ్దం తర్వాత ముసల్మాన్లు ప్రవేశించారు. నుగంబాక్కంలోని అగస్త్యీశ్వర స్వామి ఆలయ శాసనంతో మరికొంత చరిత్ర తెలియవచ్చింది. అగస్త్యీశ్వర స్వామి, అఖిలాండీశ్వరి ఆలయాలకు దెయివనాయక ముదలియార్ భూమి, సత్రం తోపు వంటివాటిని దానం చేశారనే విషయం ఈ శాసనం వల్ల తెలుస్తోంది. దెయివనాయక ముదలియార్ సంపన్నుడు. అలాగే పలుకుబడి గల వ్యక్తికూడా. కనుక దెయివనాయకులకు చెందిన ప్రాంతాలను‌, దెయివనాయక పేట్టయ్ అని పిలువసాగారు. కాలక్రమేణా ఈ పేరు తేనాంపేటగా మారి ఉండవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం.3. నుంగంబాక్కం :- అగస్త్యీశ్వర ఆలయంలోని శిలాశాసనం 1808 నాటికి చెందినది. కనుక అంతకన్నా ముందరే ఇక్కడ నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండి ఉంటాయనే అభిప్రాయముంది. నుంగంబాక్కం, బొమ్మరం అనే రెండు పేర్లూ పద్దెనిమిదో శతాబ్దానికన్నా ముందున్నవే.నుంగు, అం, బాక్కం అనే మూడు మాటలు కలిసి నుంగంబాక్కం అనే మాటైంది. చెన్నై జిల్లా ఆలయ చరిత్ర రచయిత సుబ్రమణ్య పిళ్ళయ్ అభిప్రాయం మేరకు నుంగంబాక్కం గ్రామదేవత సేతుపట్టి (చెట్పట్) లో ఉండే కరుకాత్త అమ్మన్. .దీనినిబట్టి నుంగంబాక్కం ఒకానొకప్పుడు చెట్పట్ లో భాగమై ఉండవచ్చని తెలుస్తోంది. చెట్పట్ మొదట ఓ ఊరుగా ఉండేది. సువిశాలమైన ఈ ప్రాంతంలో తాటిచెట్లు విపరీతంగా ఉండేవి. ఈ ప్రాంతంలోనే మరొక భాగం నివాసస్థలాలుగా మారాయి. ఈ నివాసస్థలాలను నుంగంబాక్కం అని పిలువసాగారు. పూర్వం ఇక్కడ తెలుగువారు ఐధిక సంఖ్యలో నివసించిన కారణంగా బొమ్మరం అనే పేరు వచ్చినప్పటికీ నుంగంబాక్కం అనే పేరు నలుగురి నోటా నాని నుంగంబాక్కం పేరు స్థిరపడింది. రెండువేల సంవత్సరాల క్రితం తిరువల్లువర్ రాసిన "తిరుక్కురళ్" ని తమిళులు దక్షిణ వేదంగా భావిస్తారు. ఆయన ఓ కవి. తత్త్వజ్ఞాని. ఆయన పేరిట నిర్మించిన వల్లువర్ కోట్టం టీ.నగర్లోని కోడంబాక్కం హైరోడ్డు నుంచి నుంగంబాక్కంలోకి ప్రవేశించే మలుపు మొదట్లోనే ఉంది.ఓ రథం ఆకృతిలో నిర్మించారు. ఈ కట్టడంలోని కురళ్ మణిమండపంలో వల్లువర్ 133 అధ్యాయాలలో రాసిన 1330 ద్విపదలను ఈ వల్లువర్ కోట్టంలో గ్రానైట్ పలకలపై చెక్కించడం విశేషం. 1975 - 76 ప్రాంతంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండిన కరుణానిధి దీనిని నిర్మించారు. ఒకానొకప్పుడు మద్రాసు నగరంలోని చెత్తనంతా ఇక్కడ కుమ్మరించేవారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని బాగుచేసి వల్లువర్ కోట్టం కట్టడానికి వినియోగించారు. మద్రాసు నగరంలోని దర్శనీయ స్థలాలలో ఇదొకటి. మా పెద్దన్నయ్య ఇక్కడికి దగ్గర్లోని జోషియర్ స్ట్రీట్లో అద్దెకుండటం వల్ల తరచూ అతనింటికి వెళ్తుండేవాడిని. అలా వెళ్ళివచ్చినప్పుడల్లా కాకపోయినా కొన్నిసార్లయినా వల్లువర్ కోట్టం లోపలకు వెళ్ళో వస్తుండేవాడిని. నాకెంతో ఇష్టమైన కట్టడమిది.ఈ రథాకృతి కట్టడం ఎత్తు ముప్పై తొమ్మిది అడుగులు. తిరువారూర్ లోని ఆలయ రథాన్ని పోలినట్లే ఉంటుందీ రథంకూడా. ఇక్కడున్న ఆడిటోరియంలో దాదాపు నాలుగు వేల మంది కూర్చునే వీలుంది. తమిళులకు ఇదొక ఆలయమే. కోటలోకి ప్రవేశించే ప్రధాన ద్వారంలో ఓ సింహం బొమ్మ ఆకర్షణీయం. తమిళ సాహిత్యంలో వల్లువర్ వంతు విశిష్టమైనది. మూడు వేల బ్లాకుల రాతితో నిర్మించిన ఈ రథమిది. ఈ రథ చక్రాలు భారీ ఆకారంలో ఉంటాయి. రథంలో వల్లువర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కళంకారి చిత్రాలను చూడవచ్చు. కన్యాకుమారిలో తిరువల్లువర్ విగ్రహాన్ని సృష్టించిన ప్రముఖ వాస్తుశిల్పి వి. గణపతి స్థపతే వల్లువర్ కోట్టంలోని విగ్రహాన్ని చెక్కారు. గణపతి స్థపతి (26 ఏప్రిల్ 1931 - 7 ఏప్రిల్ 2017) గురించి ఓ నాలుగు మాటలు. ఒక్క తమిళనాడులోనే కాకుండాశ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు నలుదిశలా వ్యాపించింది. హైదరాబాదులోని హుస్సేన్‌ సాగర్‌లో జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ఈయనే ప్రతిష్ఠించారు. కుటుంబ పెద్దల దగ్గర 17 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన ఈయన 1964లోనే అప్పటి మంత్రి కల్లూరి చంద్రమౌళి దృష్టిని ఆకర్షించి తమిళనాడును విడిచిపెట్టి తెలుగునాట అడుగుపెట్టారు. తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి టీటీడీ ఆస్థాన స్థపతి పదవిని పొందారు. తరతరాల వాస్తుశిల్ప సంప్రదాయం, నిరంతరం కొనసాగాలన్న తపనతో ఆయన తన ఆధ్వర్యంలో దేవాదాయ శాఖలో ఒక శిల్ప కళాశాలను స్థాపించి ఎందరో శిల్పులను తీర్చిదిద్దారు.ఆయన శిల్పకళా చాతుర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీనిచ్చి గౌరవించింది. - యామిజాల జగదీశ్
August 1, 2020 • T. VEDANTA SURY • Memories