ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మరీ అంత ఆశయితే ఎట్లా చెప్పు (జానపద నీతి కథ) డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 94410 32212
September 24, 2020 • T. VEDANTA SURY • Story

ఒకూర్లో ఒక వేటగాడు వుండేటోడు. వాడు వారానికోసారి వేటకు పోయి ఏదో ఒక జంతువును పట్టుకోనొచ్చేటోడు. దాన్ని వూర్లో అమ్మి ఆ డబ్బుల్తో ఆ వారమంతా హాయిగా తిరిగేటోడు. ఒకసారి వాడు వేటకు పోయినాడు. పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ అడవంతా తిరిగినాడు గానీ ఒక్క జంతువు గూడా దొరకలేదు. “ఇదేందబ్బా... ఎప్పుడు వచ్చినా ఏదో ఒక జంతువు అర్థగంటకల్లా దొరికిపోయేది. కానీ ఈరోజేమి కనుచూపు మేరలో ఒక్క జంతువు గూడా కనబడ్డం లేదు. అడవంతా బోసిగా వుంది. ఏమయిపోయినాయి ఇవన్నీ” అనుకుంటూ నీరసంగా అడుగులు వేస్తా కనీసం కడుపునిండా నీళ్లయినా తాగుదామని ఒక చెరువు వద్దకు పోయినాడు.
     వేటగానికి చెరువు దగ్గరున్న బురదలో జంతువులు నీళ్ళు తాగడానికి వచ్చిన అడుగుల గుర్తులే తప్ప, తిరిగి వెనిక్కి వెళ్ళిన గుర్తులు కనబల్లేదు. దాంతో అనుమానమొచ్చి నీళ్ళు తాగకుండా పక్కనే వున్న ఒక చెట్టుపైకి ఎక్కి చెరువువంకే చూడసాగినాడు. అట్లా చూస్తావుంటే కాసేపటికి ఒక అడవి పంది అక్కడికి వచ్చింది. అది చెరువులోకి దిగి నీళ్ళు తాగసాగింది.
అంతలో ఎక్కడినుండి వచ్చిందో గానీ ఒక మొసలి రయ్యిమని వచ్చి ఆ అడవిపంది కాళ్ళు పట్టుకొని సర్రున లోపలికి గుంజుకోని పోయింది. అది చూసిన వేటగాడు “ఓహో.... ఇదా సంగతి. ఈ మొసలి నీళ్ళకని వచ్చిన జంతువులనల్లా చంపి తింటావున్నట్టుంది. అందుకే అడవిలోని జంతువులన్నీ తగ్గిపోయినాయి. దీన్నెలాగయినా ఆపకపోతే ముందుముందు నాకు కష్టమే అనుకున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే వేటగాడు ఒక మాంచి తప్పెట తీసుకోనొచ్చి చెట్టుమీద కూచున్నాడు. జంతువులు చెరువుకాడికి వచ్చినప్పుడల్లా ధనధనమని గట్టిగా వాయించసాగినాడు. ఆ చప్పుడు విని అవి భయపడి పారిపోసాగినాయి. ఆ రోజు మొసలికి తినడానికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. తరువాత రోజు పొద్దున్నే వేటగాడు మళ్ళా తప్పెట తీసుకోనొచ్చి చెట్టుమీదకెక్కి వాయించసాగినాడు. అట్లా ఒక పదిరోజులు చేస్తే మొసలికి ఆహారం ఏమీ దొరక్క ఆకలితో చస్తుందని ఆ వేటగాడి ఉపాయం .
      వరుసగా రెండో రోజు కూడా ఏమీ దొరక్కపోవడంతో మొసలి ఆకలితో అల్లాడిపోసాగింది. తరువాత రోజు పొద్దున్నే తప్పెట తీసుకోనొచ్చిన వేటగానితో ఆ మొసలి "ఓ మనిషి బావా... ఎందుకట్లో రోజూ తప్పెట వాయిస్తా నా నోటి దగ్గరి కూడు లాగేస్తా వున్నావు. నేను నీకేం అపకారం చేసినాను. దేవుడు నా నుదుట రాసిన తిండి తినడం తప్ప ” అనడిగింది. దానికా వేటగాడు “నేనీ అడవిని నమ్ముకొని ఎన్నో ఏళ్ళనుంచి బతుకుతా వున్నాను.
కానీ నీ వళ్ళ ఇప్పుడు నాకు జంతువులు దొరకడం కష్టమయిపోతావుంది. నువ్వు చస్తేగానీ నా జీవితం బాగుపడదు” అన్నాడు.
      అప్పుడా మొసలి కాసేపు ఆలోచించి “చూడు మనిషి బావా... మా తాత ముత్తాతల కాలం నుంచీ మేము ఈ చెరువులో జంతువులతో బాటు ఎవరయినా మనుషులు దిగితే వాళ్ళని గూడా పట్టుకోని తింటా వున్నాము. అప్పుడు వాళ్ళ వంటి మీదున్న నగలూ బంగారం అంతా ఒకచోట దాచి పెడతా వున్నాము. నీవు మరలా ఇటువైపు రానని మాటిస్తే అదంతా తెచ్చి నీకిస్తా... ఏం సరేనా” అనింది.        వేటగాడు ఆ మాటలకు సంబరంగా సరేనంటూ ఒప్పుకున్నాడు. మొసలి లోపలికి పోయి చానా బంగారం తీసుకోని వచ్చింది.    వేటగాడు అవన్నీ తీసుకోని పోయి పెద్ద మేడ కట్టుకోని, బాగా పశువులు కొనుక్కోని, పదిమంది గాసగాళ్లను పెట్టుకోని హాయిగా కాలుమీద కాలేసుకోని బదకసాగినాడు.
        కానీ... అట్లా కొంతకాలం పోయినాక వానికి ఇంకా ఇంకా డబ్బు కావాలనిపించింది. పెద్ద పెద్ద బంగళాలు, వాహనాలు కొనాలనిపించింది. కానీ ఒళ్ళు కష్టపడడానికి ఒప్పుకోలేదు. తేరగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. అప్పుడు వానికి మళ్ళీ మొసలి గుర్తుకు వచ్చింది. దాని దగ్గర ఇంకా చానా బంగారం వుంటుందనిపించింది. దాంతో తప్పెట తీసుకోని మళ్ళా చెరువు కాడికి పోయినాడు. గట్టిగా తప్పెట కొట్టసాగినాడు.
అదిచూసి మొసలి బైటకు వచ్చి "ఏం మనిషి బావా... మాటతప్పి మళ్ళా వచ్చి నా నోటి దగ్గరికూడు లాగేస్తావున్నావు. ఇదేమయినా మంచి పద్ధతేనా. నేను గూడా బతకాల గదా” అనింది. దానికి వాడు నవ్వుతా “ఏం చేద్దాం చెప్పు. నువ్విచ్చినేది నా కాలిగోటికి కూడా సరిపోవడం లేదు. ఇంకా లోపల ఏమేం దాచి పెట్టినావో అవన్నీ తీసుకొని రాపో... నిన్ను వదిలేస్తా” అన్నాడు.
ఆ మాటలకు మొసలికి చానా కోపం వచ్చింది. దురాశ ఊబి లాంటిది. పడితే నిమిష నిమిషానికి లోపలికి పోవడమే. వీనికి ఎంతిచ్చినా లాభం లేదనుకోని బాగా ఆలోచించి “నీళ్ళ లోపల ఒక పెద్ద పెట్టె వుంది. దాన్నిండా బంగారం, వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు చానా వున్నాయి. కానీ దాన్ని బైటకు తీసుకోని రావడం నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. తాడు తీసుకోని నువ్వు కూడా నాతోబాటురా. దానికి కట్టి లాగుదాం” అనింది. వేటగాడు సరేనంటూ తాడు తీసుకోనొచ్చి సంబరంగా చెరువులోనికి దిగినాడు.
       అంతే... మొసలి లటుక్కున వాని కాలు పట్టుకోని సర్రున నీళ్ళలోకి లాక్కోని పోయింది. ఆశకుపోయి ఆ వేటగాడు చివరికి ఆ మొసలికే బలైపోయినాడు.