ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మరుపు రాని కానుక--వురమళ్ల సునంద , ఖమ్మం
October 4, 2020 • T. VEDANTA SURY • Story

 బడిలో ఏ క్లాస్ పిల్లలను మందలించినా అదే విషయం. చర్విత చరణంగా వినిపిస్తూనే ఉంది!
నాలుగైదు తరగతుల పిల్లలైతే  ఓ లీడరును పెట్టుకుని  పేర్లు రాయించుకుంటున్నారు కూడా.
అక్కడే వచ్చింది చిక్కంతా...
*********
వాసు గాడి చిన్ని జీవితంలో పెద్ద తుఫానునే తెచ్చింది. వాళ్ళందరూ కంపాస్ బాక్సు ల్లో, చొక్కా,లాగు జేబుల్లో దాచుకున్నవి ఇచ్చి, వాసు గాడి వైపు కాలర్ ఎగరేస్తూ చూస్తుంటే ...
మస్తు అవమానంగా ఉంది. కానీ ఏం చేయలేని దుస్థితి. మధ్యాహ్నం బల్లో పెట్టిన అన్నం కూడా తినబుద్ది కాలేదు.
సాయంత్రం ఇంటికి వచ్చీ రాగానే పుస్తకాల సంచి మూలకు విసిరేశాడు. మోకాళ్ళ లోపల తలకాయ పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. 
తాత గురవయ్య ఇదంతా చూసి చలించి పోయాడు. "ఏందిరా వాసుగా! ఇట్రా నాయినా!  పిలుస్తూ మంచంలోంచి కూసోబోయి వెనక్కి పడ్డాడు. "ఓ తాతా! ఒక్కుదుటున లేచి తాతను పట్టుకుని సరిగ్గా కూచోబెట్టి పోబోతుంటే.. "ఏందిరా! ఏమైందిరా! ఎప్పుడూ లేగదూడోలె చెంగనాలు పెట్టేవాడివి. గట్లెందుకున్నవ్! ఎవురైనా కొట్టిండ్రా! తిట్టిండ్రా ! బుదగిరిస్తూ అడిగే సరికి దుఃఖం వరదలా పొంగుకొచ్చింది వాసుకు. భోరుమని ఏడ్చాడు. "తాతా!  మా బల్లో  ఆనంద్ సారు  ఉజ్జోగం నుంచి దిగిపోతున్నడు. గా సారు చానా చానా మంచోడు తాతా! ఆ సార్ కు ఏదైనా  మంచి బహుమతి కొనాలని
 అందరూ తలా కొన్ని డబ్బులేసుకుంటున్నారు... నేనే... అంటూ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకున్న మనువడిని చూస్తుంటే మస్తు బాధగా అనిపించింది గురవయ్యకు.. తన దగ్గర ఉంటే ఎంటనే ఇచ్చేటోడు. ముసలి శరీరం.. అమ్మా అయ్య చచ్చిపోతే దిక్కులేనోడు ఐతాడని తెచ్చుకుని సాత్తున్నరు. భార్య రంగి కూలి నాలికి పోతేనే ఇల్లు ఎల్లేది. చేతుల పైసలు ఏడుంటయి!  
బాగా ఆలోచించిండు. ఏం చేయాలో తోచలేదు. చిన్నప్పుడు మనువడికి  నేర్పిన కంజెర గుర్తుకు వచ్చింది. తెమ్మని చెప్పిండు. గా దాన్ని మంచిగా శుభ్రం చేసి ఓ సంచీలో పెట్టి మనింట్లో "గిదొక్కటే ఉందిరా గిది తీసుకొని పొయ్యి ఇవ్వురా!" అనగానే వాసుకు ఓపక్క సంతోషం మరో పక్క గదిస్తే ఏమనుకుంటరో అని బాధ పడ్డడు.గది తాతకు ఇష్టమైన వస్తువు. ఇంకేమైనా ఇద్దామంటే.. ఇంట్లో అంతకంటే ఖరీదు కల్లవేవీ లేవు.
**************
మరుసటి రోజు  మీటింగులో అందరూ సారుకు రకరకాల బహుమతులు ఇస్తుంటే వాసుకు తను తీసుకు పోయింది ఇవ్వాలా!వద్దా! అని తటపటాయించాడు. ఎవరు ఏమన్న  అనుకోని.. గిదే సారుకు ఇస్తాననుకుంటూ  వెళ్ళాడు. ముందుగా సారుకు దండం పెట్టి గా కంజెర మీద తాత నేర్పిన పాటొకటి  పాడాడు. అద్భుతంగా ఉందంటూ అందరూ చప్పట్లు కొట్టారు. మరో పాట సారు మీద తాను రాసిన పాట  పాడిండు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా సంచీలో పెట్టి సారుకు ఇచ్చాడు.
అందరూ మెచ్చుకున్నారు.
 వచ్చిన అతిథి వాసు గానానికి ముగ్ధుడై వందరూపాయల నోటు చేతిలో పెట్టాడు. అది కూడా సారుకు ఇవ్వబోతుంటే "నీ పాటే నాకు అపురూపమైన కానుకరా" 
 "ఈ కంజర మీద మరిన్ని పాటలు నేర్చుకో " ఇది నీ దగ్గర ఉంటేనే మరిన్ని పాటలు నేర్చుకో గలవు"అంటూ దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆశీర్వదించాడు సారు.