ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మలిసంధ్య --కె ఎస్ అనంతాచార్య
October 3, 2020 • T. VEDANTA SURY • Poem

మొగ్గ పూవుగా కాయగా పండుగా
పరిణతి చెంది పదుగురికి  పచ్చిగా పరిమళాలను  పంచి రుచులతో ఆకుపచ్చని విందు చేస్తుంది

సహజ దృశ్యమే
కాలo రoగులను మార్చుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది

గోరుముద్దలు తినిపించిన తల్లికి ముద్దకరువైంది
భుజాల నెక్కించుక తిరిగిన తండ్రికి ఆసరా
అందక శ్వాస ఇబ్బంది పడుతుంది

ముదుసలి నాసికలకు
మిస మిసలాడే డియో డరెంట్లు 
చికాకులు కలిగించొచ్చు

రంగు వెలిసిపోయేలా
చర్మం కందిపోయేలా
సాకి సవరించిన నిన్నటి జ్ఞాపకాల మీదనుంచి సాగిపోయి ముడుతలు పడి వణికె దేహాo వెచ్చటి కంబలికోసం ఎదిరి చూస్తుంది

లోకాన్ని చూపించి పోకడలు తెల్పిన దృగ్గోళాలు నీ
దయ కోసం వెతుకులాడుతూ
మసకబారి పోయాయి

చేయి పట్టి నడిపించిన చేతులు పట్టుతప్పకుండా
నీ చేయి కోసం వాకబు చేస్తున్నాయి 

ఒళ్ళో కూర్చోపెట్టుకొని వినిపించిన కథలన్నీ కంచికి చేరాయో లేదోగాని కొత్త కథకు ప్రతినాయకుడి వి కావొద్దు

బూచోడు అని భయ పడ్డప్పుడు చుట్టూ ముట్టిన భయాన్ని ఎడబాపి మందలో కలిపి  తాను ఒంటరయి పరాధీనతలో సాంత్వన కోసం వెర్రి చూపు చూస్తుంది

అవసరాలు తీర్చడం కోసం రాత్రి పగళ్ల వెచ్చించి తెచ్చుకున్న రోగాలు మందుల కోసం దేవురిస్తున్నాయి

ఇష్టాన్ని చెమట లో రంగరించి నిర్మించిన ఇంట్లో మంచం చోటుకోసం పొట్లాట తప్పట్లేదు

పరిణామ దశల్లోని
వృద్ధాప్యం ఆప్యాయత ను కోల్పోయి ఆశ్రమాల్లోకి
నెట్టేయబడి తల్లడిల్లిపోయే ముగ్గుబుట్టల తరం

కష్టాల కావిళ్లు దుఃఖాల సముద్రాలు దాటినవని సంబరాల్లేవు 
రెండవ బాల్యం లో ఎదురుకోనే సమస్యలకు అంతు లేదు!

ముదిమి అనేది
అవసానానికి చేరటం కాదు 
అనుభవాన్ని పంచే  
అద్భుత జ్ఞాన విన్యాసం

పెద్దవారికి అండ 
 అనురాగపు మాటల దండ