ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మహనీయుడు: --- యామిజాల జగదీశ్
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

తమిళుడై జన్మించి
భారతీయుడిగా ఎదిగి
ఎవరూ 
అందుకోలేనన్ని సాధనలతో
ప్రపంచ దేశాలన్నింటినీ 
భారత్ దేశంవైపు చూసేలా చేసిన
పిల్లల ప్రేమికులూ మీరు!!
క్షిపణుల శిఖరం మీరు!!

మమ్మల్ని కలలు కనండంటూ చెప్పి
కలలు నిజమయ్యే లోపే
మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం 
మీకు సముచితమేనా?!

మీరు మాట్లాడుతుండటం వల్లేగా
మేం మౌనంగా ఉంటూ వచ్చాం
ఇక మాట్లాడి ప్రయోజనం లేదని
మాట్లాడకుండా వెళ్ళిపోయేరా?!

మీరు 
కలలు కనమన్నారనేగా
మేము నిద్రపోయి
ఎన్నో ఎన్నెన్నో కలలు కన్నాం, కానీ
ఒక్కసారి కనలేదు
మీరిలా కనిపించని లోకానికి
వెళ్ళిపోతారని....

ఒకవేళ అటువంటి కలంటూ 
కని ఉంటే
మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చిన 
కాలయముడితో
కలాం మహనీయులు
మాక్కావాలంటూ 
మొరపెట్టుకుని ఉండేవాళ్ళం!!

మన పుట్టుక ఓ సంఘటనై ఉండొచ్చు
కానీ మరణం ఓ చరిత్రై ఉండాలనడమే కాక
చేతలలో చేసి చూపిన ఓ శకం మీరు!!

ఇప్పటివరకూ
ఎవరూ చూసింది లేదు
మీలాంటి ఓ క్షిపణి శిఖరాన్ని!!
మీ కలలు నిజమయ్యేది 
మరెంతో దూరంలో లేదు
కలాంగారూ!!
మీ మాటా
మీ ఆశయం
మీ ఆచరణ
మీ సాధన
యావత్ మానవాళికీ
ఓ విలువైన పాఠం!!
మరచిపోలేని పాఠం!!
కలాంగారూ,
మీకిదే మా జోహార్లు!!