ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మహాకవి..సుబ్రహ్మణ్యభారతి'!---సుజాత.పి.వి.ఎల్.
September 13, 2020 • T. VEDANTA SURY • Story

మహాకవి భారతి దృష్టిలో తెలుగు సుందరమైన భాష; గానామకూలమయిన భాష. ఈ క్రింది గీతములో ఆయనే అదే చెప్పారు.
"విరియ గాచిన వెన్నెల రాత్రిలో
చేరదేశపు చెలులు వెంట రా
సుందరాంధ్ర పదమ్ము పాడుచున్
సింధునదిని పడవనడుపుచు నాడుదాం!"
ఎక్కడి చేరదేశము! ఎక్కడి సింధునది! కన్యాకుమారినుండి కాశ్మీరము వరకును గల అఖండభారతము తనమాతృదేశమని భారతి విశ్వసించెను.ఆయన దృష్టిలో ఆయన తొలుత భారతీయుడు; ఆవల తమిళుడు. తేనెసోనలు జాలువారు తెలుగు పదమును పాడుచు సింధునదిలో నౌకా విహారము చేయువలెనట! ఎంత తీయని కల్పన మిది! ఇది భారతి అమృత హృదయమును ప్రవ్యక్త మొనర్చుచున్నది.
భారతి రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగివున్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు.
చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి (1882 డిసెంబరు 11 – 1921 సెప్టెంబరు 11) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. ఆయన అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి.
అప్పటి తిరునల్వేలి జిల్లా ప్రస్తుతం తూత్తుకుడిలో ఉంది. ఎట్టాయపురంలో భారతి 1882లో జన్మించారు. ఆయన తొలుత  తిరునల్వేలిలోనూ, తర్వాత వారణాసిలోనూ విద్యాభ్యాసం చేసి, పాత్రికేయ రంగంలో  స్వదేశమిత్రన్,  ఇండియా వంటి పలు పత్రికలకు  పనిచేశారు. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యునిగా జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. 1908లో భారతి విప్లవాత్మక కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీచేసింది, ఈ స్థితిగతులు ఆయన పాండిచ్చేరికి వలసపోయి జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరిచాయి. ఆయన అక్కడే 1918 వరకూ జీవించారు. భారతి రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగివున్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ,సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు.
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా భారతి గారు తన కుల గుర్తింపును విడిచిపెట్టేశారు. జీవించే ప్రతి జీవం సమానమేనని భావించారు. దీన్ని చూపించేందుకు ఒక యువ దళితునికి ఉపనయనం చేసి బ్రాహ్మణుని చేశారు. అప్పట్లో తర్వాతి తరాల వారి మనస్సులోకి పెద్దలు విభజన బీజాలు నాటడాన్ని వెక్కిరించారు. వేదాలను, గీతను బోధించేప్పుడు తమ స్వంత ఆలోచనలు దానిలో చేర్చి కువ్యాఖ్యానాలు చేయడాన్ని బహిరంగంగా ఖండించారు. దళితులను హిందూ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడాన్ని ఆయన గట్టిగా ప్రబోధించారు.
తమిళనాట సుబ్రహ్మణ్య భారతి భావాత్మకంగా గొప్ప విప్లవాన్ని సాధించారు. సంస్కరణ, దేశభక్తి, జాతీయవాదం, తమిళ భాష ఔన్నత్యం వంటి అంశాల్లో ఆయన కవితలు తమిళులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సామాన్యమైన ప్రజలు ఆయన కవితలను కంఠస్థం చేసి సందర్భానుసారం ప్రస్తావించే స్థాయికి వచ్చాయి. కోట్లాదిమంది ప్రజలు ఆయన రాసిన కవితల పంక్తులను ప్రస్తావించడం చెప్పుకోతగ్గ గొప్ప విశేషం.