ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి : -తీగ ఎండిపోయే సమయానికి కుక్కమూతి పిందెలు కాస్తాయని ఒక సామెత మనకు తెలుగులో ఉన్నది. దాదాపు రెండువందల సంవత్సరాలకు పైగా పరిపాలించిన ఆసఫ్జాహీల వంశం చివరి పాలకుడైన ఉస్మానలీఖాన్ నిజాం, ప్రముఖ పాత్రికేయులు జి.వెంక ట రామారావు గారన్నట్లు ఎంత సమర్థుడో అంత వివాదాస్పదుడు.ఇతని కాలములోనే హైదరాబాదు సర్వతోముఖాభివృద్ధి చెందిందని విషయం క్రితం ముచ్చట్లలో తెలుసుకున్నాం.కానీ చివరిదశలో మాత్రం ప్రజాకంట కుడనే పేరు తెచ్చుకున్నాడు. “బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లమీద వోతవ్ కొడుకో నైజాము సర్కరోడ నీ గోరి గడ్తం కొడుకో నైజాము సర్కరోడా “ అనే దాకా వచ్చింది. మహా కవి దాశరథి జైలు గోడల మీద “ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ “ అని రాసేట్లు చేశాడు. దేశం లో కెల్లా అత్యంత ధనికులలో రెండో స్థానమో మూడో స్థానమో ఈయ నది.తన ఖర్చుకు సంబంధించి మిక్కిలి పిసినారి గానూ, దాన ధర్మాలలో, అభివృద్ధి కార్యక్రమాల్లో అతి ఉదారుడు గానూ పేర్కొనబడ్డాడు.ప్రథమ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులకు అన్ని విధాలుగా సహకరించి,ఐదవ జార్జి చక్రవర్తి చేత His Exalted Highness (మహా ఘనత వహించిన), Faithful Ally of the British Government (బ్రిటిష్ ప్రభుత్వ విశ్వాస పాత్రుడైన సహాయకుడు) బిరుదుల పొందిన వాడు.వ్యక్తిగతంగా నిరాడంబర జీవితము గడిపిన వాడు, డంబాతీతుడు.కానీ సర్వ స్వతంత్రంగా రాజ్యాన్ని పరిపాలించాలనే కాంక్షతో తప్పుదోవ పట్టాడు.ముస్లిం మతప్రచార,మత మార్పిడిలకు తోడుపడే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను పరోక్షంగా సమర్థించాడు.1927లో నవాబు సదర్ యార్ జంగ్ అధ్యక్షుడిగా ఈ సంస్థ ఏర్పడింది.1939 లో నవాబు బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడైన తరువాత బలపడింది. మొదట్లో అనేక మంది దళితుల చేత మత మార్పిడి చేయించి,ఆ తరువాత ముస్లిం ఆధిపత్యానికి పెద్ద పీటవేసింది.ఇందులో సభ్యులుగ చేరిన వారికి సైనిక శిక్షణను ఇప్పించి ఒక కత్తి,ఒక బాకు ఇవ్వటం జరిగింది.వీరిన రజాకార్లు అని పిలిచేవారు.బహదూర్ యార్ జంగ్ తరువాత నాయకుడైన కాశిం రజ్వీ నైజామును కూడా లెక్క చేయని విధంగా దురాగతాలను చేయించాడు. తెలంగా ణా లోని అనేక గ్రామాల్లో ముస్లిమేతరు లను దారుణంగా, హింసించడం, మహిళలను మానభంగాలు చేయడం,ఎదురు తిరిగిన వారిని వెంటాడి చంపడం తో రాజ్యమంతా అల్లకల్లోలమైంది. పోలీసుల్లాగే ఖాతా యూనిఫాం ధరించి,నిజాం పోలీసులతో సహా అనేక ఘాతుకాలకు ఒడికట్టారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.నిజాం కు రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయడం ఇష్టం లేక రజాకార్లకు మద్దతు నివ్వడంతో హైదరాబాదు రాష్ట్రం అట్టుడికి పోయింది.వినాశ కాలే విపరీత బుద్ధిః అన్నట్లు 1948 లో భారత్హోం మంత్రి నేతృత్వంలో అన్ని వైపుల నుండి పోలీసు చర్య ఆపరేషన్ పోలో చేపట్టడంతో నిజాం ఓడిపోయి హైదరాబాదు రాజ్యం భారత్ లో చేర్చబడింది.మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్ గా బాధ్యతలుచేపట్టడం జరిగింది.సెప్టెంబర్ 18,1948 నాడు నిజాం లొంగి పోయాడు. ప్రధానమంత్రిగా ఉన్న లాయకలీ పాకిస్థాన్ కు పారిపోయాడు.కాశీం రజ్వీ పట్టుబడి జైలు పాలయ్యాడు.1950 దాకా మిలిటరీ గవర్నమెంటు నడిచింది.1950 లో పౌర ప్రభుత్వం ఏర్పడింది.1952 లో సార్వత్రిక ఎన్నికలు జరుగగా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా మొదటి మంత్రి వర్గం ఏర్పడింది.ఏడవ నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్ రాజ్ ప్రముఖ్ అయ్యాడు.(సశేషం)
June 24, 2020 • T. VEDANTA SURY • Memories