ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మానేరు ముచ్చట్లు -రామ్మోహన్ రావు తుమ్మూరి --1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుండి 2014లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడేదాక అనేకమంది ముఖ్య మంత్రులు వారి వారి పార్టీలు ఆశయాలు,అభిరుచుల మేరకు పాలన కొనసాగించారు.అవన్నీ ఏకరువు పెట్టదలచుకోలేదు. మాధ్యమాల పుణ్యమా అని దాదాపుగా ఆ విషయాలు చాలావరకు అవగతమే.అదే కాకుండా గ్రంథవిస్తరభీతి కూడా ఉండటంతో ముక్తాయింపుకు రావాలనుకున్నాను.దశాబ్దకాలంఉధృతమైన తెలంగాణ పోరాటంలో ఆబాలగోపాలం పాల్గొన్న సంగతి అందరికీ విదితమే.1969లో తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఆగిపో యింది.కాని ఈసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి సిద్ధాంతకర్తలు,డా.సామల సదాశివ లాంటి ఖట్టర్ తెలంగాణ కవులు,కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులాంటి పట్టువదలని రాజకీయ విక్రమార్కులు,న్యాయవాదులు,ఉపాధ్యాయులు,ఉద్యోగులు,కవులు,కళాకారులు,గృహిణులు,పిల్లలు ఏకైక దీక్షతో తెలంగాణ కోరుకున్నారు.జూన్ 2,2014 న తెలంగాణ ఆవిర్భావం జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచి మిత్రులవలె విడిపో యినా సఖ్యత సంయమనాలతో ఉన్నారు.కలిసి ఉండి కాట్లాడుకునే కంటే విడిపోయి గౌరవంగా ఉండటం హాయిగా ఉంది.అందరూ కొత్త వ్యవస్థలకు అలవాటు పడిపోయారు.నన్ను ప్రోత్సహిస్తూ నేను మొదలు పెట్టిన నా మానేరు ముచ్చట్లను ఆదరించిన రెండు తెలుగు రాష్ట్రాల మిత్రులందరికీ ఈ సందర్భంగా నా మనః పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ప్రపంచమంతటా ప్రస్తుతం కరోనా విలయతాండవమే కొనసాగుతున్నది.ఇంకా ఆశావహ పరిస్థితి ఏర్పడలేదు.చాలమంది ఇళ్లల్లోనే ఉంటున్నారు.అందరిలాగే నేనూ లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్నాను.మార్చి 22న లాక్ డౌన్ ప్రకటించినపుడు ఎప్పటినుంచో చేయాలనుకున్న పనిని ఆ రోజే మొదలు పెట్టాను.నా 67వ పుట్టిన రోజుకు ఒకరోజు ముందు మొదలు పెట్టిన ఈ పని ఈ రోజు ఒక మహా మేధావి,తెలుగు వాడు,స్వాతంత్ర్య సమరయోధుడు,సంస్కరణశీలముగలిన వ్యక్తి,సంగీత సారస్వతములందనురక్తుడు,రాజర్షి, బహుభాషాకోవిదుడు ,నిరాడంబరుడైన మహనీయుడు కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారి శతజయంతి వేడుకల తొలిరోజున ముగిస్తూ మా కరీంనగర్ జిల్లాకు గర్వకారణ మైన ఆయన పాదాలకు ఈ రోజు నా చిరు ప్రయత్న ఫలితాన్ని అభిషేకిస్తున్నాను.మరో విశేషం కాకతాళీయంగా నా బంగారు తల్లి కూతురు సౌభాగ్యవతి డా.స్పందన తుమ్మూరి పుట్టిన రోజు కూడా ఈ రోజే కావటం విశేషం.తనకు ఆశీస్సులు.మా ఊరంటే నాకు వల్లమాలిన అభిమానం.మా బాపు రాయాలను కున్న మా ఊరిచరిత్ర నేను “వెయ్యేళ్ల వెలగందుల” పేరుతో రాయాలని చాలా రోజులనుండి అనుకుంటున్నా,ఇన్నాళ్లకు కాలం కరోనా కారణంగా ఇలా కలిసి వచ్చింది.బాపు సేకరించిన సమాచారం , కొంత,గత ముప్పై ఏళ్లుగా ఏ పత్రికలోమా ఎలగందుల గురించి రాసినా ఆ పేపరు కట్టింగ్స్ జాగ్రత్తగా భద్రపరచి ఉంచాను.వాటి ఆధారంగా ముందు ఏ సంవత్సరంలో ఏం జరిగింది అని ఒక పట్టిక తయారు చేసుకున్నాను.ఊళ్లో రాయవలసిన ప్రదేశాల పేర్లు,వ్యక్తుల పేర్లు సన్నివేశాలు ఒక జాబితా తయారు చేసుకున్నాను.కావలసిన సమాచారం కోసం కొన్ని పుస్తకాలు సేకరించుకొని ఉన్నాను.ఆంధ్రప్రదేశ్ చరిత్ర,కరీంనగర్ శాసనాలు,కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి వంటి పుస్తకాలు కొని ఉంచాను. మా ఊరు వెళ్లినపుడల్లాఅనేక ఫోటోలు తీసాను.ప్రముఖ చరిత్ర పరిశోధకులు డా.సంగన భట్ల నర్సయ్య గారితో చాలాకాలం క్రితం మా ఎలగందుల చరిత్ర రాయాలను కుంటున్నా అన్నప్పుడు వారు ప్రోత్సహించడమే గాక కలిసినప్పుడల్లా ఏమయింది అడుగుతుండేవారు.వారికి నా కృతజ్ఞతలు.నేను మొదలు పెట్టిన రోజునుంచి ఈరోజు దాకా నాకు ఎంతో ప్రోత్సాహం అందజేస్తున్న మా ఊరి కవి నా శ్రేయోభిలాషి నాగరాజు రామస్వామి గారికి,అలాగే నేను తప్పటడుగుల వెయ్యకుండా ఎప్పటికప్పుడు సూచన లిస్తూ ప్రోత్సహిస్తున్న మా కాగజ్ నగర్ మిత్రులు కే.నారాయణగౌడు, కరీంనగర్ సాహితీ మిత్రులు పెద్దలు గండ్ర లక్ష్మన్ రావు,అడుగ గానే వలసిన సమాచారం అందించిన మనాశర్మ , ప్రొ.లక్ష్మయ్య, మజారుద్దీన్, లతీఫ్ గారలు ఆదరంతో స్పందించిన బి.ఎస్.రాములు, డా.వడ్డె పల్లి కృష్ణ , శ్రీధర్ రావు దేశ్ పాండే, డా.ఏనుగు నర్సింహారెడ్డి ,బొప్పిశెట్టి శ్రీనివాస్,ఆత్మీయ మిత్రులు తాళ్లపల్లి మురళీధర్ గౌడు, డా. చెమన్ సింగ్ ,డా.పత్తిపాక మోహన్, నాగబాల సురేశ్ కుమార్, శ్రీరామోజు హరగోపాల్, శ్రీరామోజు లక్ష్మీ రాజయ్య పి.ఎల్.ఎన్. శ్రీరామాచార్యులు, సనారె,ఎలనాగ , వెంకట్ రాములు,పరమేశ్వరప్ప ముఖ్యంగా చాలామంది ఫేస్బుక్ మిత్రులు, ఊరివాళ్లు,బంధువులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత నేనంటే ఎనలేని వాత్సల్యంకలిగిన పండిత కవి,వారి కావ్యసుధను నాకు ఆశీఃపురస్సరంగాఅంకితమిచ్చిన డా.తిరుమల శ్రీనివాసాచార్య గారికి నా నమస్సులు.వారు కరీంనగర్ జిల్లా నారాయణ పురంలో పుట్టి పెరిగిన వారు.కరీంనగర్ జిల్లా కు చెందిన మరో పండిత కవి ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్యగారికి నా పై ఎనలేని ప్రేమ వారికి నాకృతజ్ఞతలుచివరగా ఒక మహనీయుుడు పరిచయమైన ప్రతివారికి ఆత్మీయు డనిపించే ప్రతిభాశాలి కళాకారులకు చేయూత,అనేక మంది ముఖ్యమం త్రులకు అండదండ ప్రస్తుత తెలం గాణ ప్రభుత్వ సలహాదారు సాహితీ వేత్త నేనంటే మిక్కిలి ప్రేమ కలిగిన వ్యక్తి అన్నిటికంటే మించి మా కరీంనగర్ జిల్లా మాణిక్యం సిరిసిల్ల దగ్గరి నారాయణ పురం జన్మస్థలమైన డా.కే.వి.రమణ గారికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఖిల్లాలో ఇటీవల లైట్ షో మరియు వీడియో షో ఏర్పాటుకు,ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంకు మూలకారణ మైనవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యం లో అత్యంత ప్రాభవంతో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన మా ఎలగందులను ఒక అపురూప మైన పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ఈ పుస్తకం ఒక స్ఫూర్తిగా ఉంటుందని ఆశిస్తూ ఎనభై రోజులుగా ఫేస్ బుక్ మాధ్యమంగా నన్ను ప్రోత్సహించిన అందరికీ మరొక్క సారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
June 29, 2020 • T. VEDANTA SURY • Memories