ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మాయమవుతున్న మానవత్వం: - - యామిజాల జగదీశ్
November 6, 2020 • T. VEDANTA SURY • Poem

ప్రకృతి 
అమ్మ రూపంలో 
ఉప్పొంగుతోంది

కానీ
ధర్మం
దయ
కరుణ
సాయంవంటివన్నీ
అక్షరాలకే పరిమితమైపోతున్నాయి

ప్రకృతివైపరీత్యాలలో
మానవత్వాన్ని 
భూతద్దంలో చూడవలసి వస్తోంది

ఆపన్నహస్తం
అటకెక్కి చేతులు ముడుచుకొని కూర్చుంటోంది

కాకుల నుంచి నేర్చుకోవలసిన 
ఐకమత్య జాడలు
మనిషిలో కనిపించడం లేదు

నీరెండిన బావిలా
ఇంకిపోతోంది మానవత్వం

ఆదుకోవడంలో
నీ మతం 
నా మతం అనే తేడాలు
చొచ్చుకొచ్చి
మానవత్వం సన్నగిల్లుతోంది

ఏ మతమైనా
సమ్మతమే అనే మాట 
కేవలం నోటిమాటైపోయింది

స్వార్థం 
పెచ్చుమీరడంతో
మానవత్వం 
మరుగున పడిపోతోంది

మనిషిలో 
నిద్రపోతున్న మానవత్వాన్ని
తట్టి లేపి 
దుమ్ము దులిపి
ఒక్కసారి కళ్ళు తెరచి చూడమని
చెప్పే స్థితికొచ్చింది

ప్రకృతి 
మనకిచ్చిన అరుదైన 
మానవత్వ తడారిపోకుండా
జీవనదిలా
నలుదిశలా 
నడిచేలా చూడవలసిన 
అవసరం 
ఎంతకంతకూ
అధికమవుతోంది