ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మాయాజాలం -( తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన కథ)* -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212) *“సాటి మనిషి సేవ కోసం జీవితమే వెలిగించు... కరిగిపోతూ కాంతిని పంచి పదిమందికి వెలుగును పంచు..."* ప్రకాష్ సెల్ఫోన్లో పాటలు వింటూ చెప్పబోయే పాఠం కోసం పుస్తకంలో పాయింట్స్ నోట్ చేసుకోసాగాడు. అంతలో పక్కన సోషల్ సార్ కూర్చుంటూ "మిత్రమా... కొంచెం ఆ పాట బ్లూటూత్ ద్వారా ఎక్కిస్తావా... చాలా బాగుంది" అంటూ కొత్తగా కొన్న సెల్ చేతిలో పెట్టాడప్రకాష్ దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ “ఏమో సార్... నాకు అంత ఐడియా లేదు. ఫోన్లు, మెసేజ్ లు, పాటలు వినడం తప్ప మిగతా ఆప్షన్లు ఎప్పుడూ చూడలేదు" అన్నాడు తిరిగి ఇచ్చేస్తూ. "నాదీ అదే సమస్య సార్... హైస్కూల్ చదివే చిన్న చిన్న పిల్లలు కూడా చేతికి సెల్ దొరుకుతే చాలు చకచక ఏవేవో నొక్కి ఏమేమో చేసేస్తుంటారు. మనకేమో ఈ టెక్నాలజీ అర్థమై చావడం లేదు" అన్నాడు సోషల్ సార్.“సార్... మన కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ఉన్నాడు గదా... పోయి వాన్ని అడగండి, చెప్తాడు" అన్నాడు ఇంగ్లీష్ సార్ మధ్యలో జోక్యం చేసుకుంటూ. "నిజమేననుకో...కానీ ఆ కంప్యూటర్ రూంలోకి పోవాలంటేనే ఏదో అనీజీ. వానికి పెద్ద టెక్కు ఏదో ఆకాశం నుండి ఊడిపడ్డట్టు, పెద్ద మేధావి అయినట్టు తెగ ఫోజు కొడుతుంటాడు".“నిజమే సార్... మీరు చెప్పేది. మనమింత చదువులు చదివి, ఇంత అనుభవమున్నా ఆ పొట్టెగాళ్ళ ముందు చులకనైపోయాం. డిగ్రీ పాస్ కావడం చేతగాని సన్నాసులు గూడా కంప్యూటర్ల ముందు కూర్చోని ఏవేవో గెలుకుతుంటే కడుపులో దేవినట్లనిపిస్తాది" బాధ పడ్డాడు తెలుగు సారు.“సార్... ఈసారి అందరం మెయిల్ ఐడీ సబ్ మిట్ చేస్తేగానీ జీతాలు రావంట గదా... నిజమేనా?" అడిగాడు ఇంగ్లీష్ సార్."అవునవును. మొన్న మీరు సెలవు పెట్టారుగదా... ఆరోజు వచ్చింది స్టాఫ్ ఆర్డర్. ఐనా అదేమంత కష్టం కాదులే. కొండారెడ్డి బురుజు ఎదురుగా రామం ఇంటర్నెట్ సెంటర్ ఉంది. యాభై రూపాయలు ఇస్తే చాలు. పది నిమిషాల్లో ఐడీ క్రియేట్ చేసి పాస్ వర్డ్ ఇచ్చేస్తాడు. మన టీచర్సంతా అక్కడికే వెళ్ళేది" సమాధానమిచ్చాడు సోషల్ సార్.అంతలో బెల్ కొట్టడంతో ఎవరికి వారు పుస్తకాలు సర్దుకొని వాళ్ళ తరగతులకు బయలుదేరారు. ఫోన్ మోగుతోంది. ఆదివారం కావడంతో బద్దకంగా మంచమ్మీద అటూ యిటూ దొర్లుతున్న లావణ్య విసుగ్గా ఫోన్ అందుకుని చూసింది. ధనలక్ష్మిఏమబ్బా ఇంత పొద్దున... అనుకుంటూ, నిద్రపోతున్న భర్తకు డిస్టర్ కాకుండా పక్కకు వచ్చి ఆన్ చేసింది.“ఏమే... ఈ రోజు ఇంట్లోనే ఉంటున్నావా? బైటికెక్కడికన్నా వెళుతున్నావా? అని అడిగింది ధనలక్ష్మి.“ఇంట్లోనే లే... ఏం?" "కొంచెం మాట్లాడాల... ఎన్ని గంటలకు రమ్మంటావ్?"లావణ్య ఒక నిమిషం ఆలోచించింది. ఎప్పుడూ అడగని ధనలక్ష్మి ఇలా అడుగుతోందంటే ఏదో అత్యవసరమైన పనే ఉంటుందని నిర్ణయానికి వచ్చి “సర్లేవే.... పదకొండింటికి రా... మా ఆయనకు వాళ్ళ కొలీగ్ ఇంట్లో ఏదో ఫంక్షనుందట. అప్పటికంతా వెళ్ళిపోతాడు" చెప్పింది.లావణ్యతో మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి వంటగదిలోకి వచ్చి బెండకాయలు కడిగి, ముక్కలు కట్ చేయసాగింది ధనలక్ష్మి.అప్పుడే నిద్రలేచిన ప్రకాష్ నిద్రకళ్ళతోనే అక్కడికి వచ్చి “ధనా... తొందరగా టిఫిన్ చేయ్... బైటకెళ్ళాలి" అన్నాడు...“సెలవురోజు కూడా అంత తొందరేమీ? పదకొండుకు గదా నీవు బైటపడేది" అంది మూకుడు స్టవ్ పైకి ఎక్కిస్తూ."నిజమేలే... కానీ ఈ రోజు కొంచెం పనుంది. నిన్న సాయంత్రం ట్యూషన్లో చిన్న గొడవయ్యింది. ఒక పిల్లవాడి పేరెంట్స్ ని పిలిపిస్తున్నారు... వెళ్ళాలి" అన్నాడు.“గొడవా... ఏమయ్యింది?" ఆసక్తిగా పనాపేసి భర్తవైపు తిరిగింది. "చెబుతా గానీ, ముందు ఆ టిఫిన్ సంగతి చూడు. "పది నిముషాల్లో కూరయిపోతుందిలే. చపాతీ పిండి ముందే తడిపి పెట్టా...ఇంతకూ ఏమైంది? ఏదో గొడవైందన్నావే" మరొకసారి గుర్తు చేసింది ధనలక్ష్మి.“అదా... నిన్న సాయంత్రం సాయిరాం కాలేజీలో ఈవినింగ్ క్లాస్ చెబుతున్నానా.. వెనక బెంచీలో ఒక పిల్లవాడు కూర్చొని పాఠం వినకుండా కిందికే చూస్తా వున్నాడు. పక్కనున్న పిల్లోళ్ళు గూడా అప్పుడప్పుడు కళ్ళు తిప్పి అటువైపు తొంగి చూస్తా వుంటే... అనుమానం వచ్చి హఠాత్తుగా వాళ్ళ దగ్గరికి పోయి చూస్తే... ఇంకేముంది?! పుస్తకం మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకోని సినిమా హీరోయిన్ల బొమ్మలు చూస్తా వున్నాడు. పిచ్చికోపమొచ్చిందనుకో... ఫట్ ఫటమని చెంప మీద రెండు వాయించి, చొక్కా పట్టుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకుపోయినా. ఆయన దాన్ని ఓపెన్ చేసి చూస్తే... సెల్ ఫోన్ నిండా హాట్ హాట్ వీడియో సాంగ్సే. హీరోయిన్ల అర్ధనగ్న దృశ్యాలు, నీలి చిత్రాల బిట్స్... ఈ తల్లిదండ్రులకు కొంచెం కూడా బుద్ధిలేదు. పిల్లలకు సెల్‌ఫోన్లతో ఏం పని? వాళ్ళు అడిగిందే ఆలస్యం - ఎందుకు, ఏమిటి, అవసరమా, అనవసరమా అని ఆలోచించకుండా కొనియ్యడమే. ఆఖరికి ఆరోతరగతి పిల్లల బ్యాగుల్లో కూడా సెల్ ఫోన్లే. అందుకే ఆ అబ్బాయి తల్లిదండ్రులని పిలిపిస్తున్నాం కౌన్సిలింగ్ కి...." అంటూ బ్రష్ పై పేస్టు వేసుకొని బాత్ రూం వైపు నడిచాడు.ప్రకాష్ చాలా బిజీ. అతని సబ్జెక్ట్ కు మంచి డిమాండ్ వుండడం, పైగా బాగా చెబుతాడనే పేరుండడంతో ఉదయం, సాయంత్రం నాలుగైదు కాలేజీలలో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. పొద్దున ఏడు గంటలకు క్యారియర్ తీసుకొని బైలుదేరితే తిరిగి ఇంటికి చేరేది రాత్రి పదికే.ధనలక్ష్మి డిగ్రీ వరకు చదువుకొంది. ఇంటి బాధ్యతంతా ఆమెదే. పిల్లలు కాలేజీకి పోగానే ఇంటికి కావలసిన సరుకుల దగ్గర్నుండి. కట్టాల్సిన బిల్లుల వరకూ అన్నీ చకచక పూర్తి చేసుకుంటుంది.టైం చూసింది. ఎనిమిదవుతోంది. పిల్లలింకా మిద్దెమీది నుండి దిగిరాలేదు. ఆదివారమయితే చాలు ఏ పదింటికోగాని దిగిరారు. ఇంటర్నెట్ పెట్టించాక మరీ ఆలస్యం అవుతోంది. ఇద్దరూ ఆడపిల్లలే. పెద్దమ్మాయి ఇంజనీరింగ్, చిన్నమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు. పెద్దమ్మాయి సబ్జెక్ట్ కు కావలసిన సమాచారం కొరకు చాలాసార్లు నెట్ సెంటర్‌కు పోవాల్సి వస్తోంది. అది ఇంటికి దూరంగా ఉండడం, రాత్రుళ్ళు ఆలస్యం అవుతుండడంతో... పైగా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ రహస్య వీడియోల వల్ల అమ్మాయిలకు రక్షణ కరువవ్వడం... ఇదంతా ఎందుకని ఇంటికే కనెక్షన్ పెట్టించుకున్నారు. కింద వుంటే ఇంటికొచ్చే బంధువులతో, స్నేహితులతో పిల్లల చదువులకి డిస్టర్బెన్స్ అవుతుండడంతో పై గదిలోకి మార్చారు. అప్పటి నుంచి పిల్లలు కిందికి దిగిరావడమే లేదు. ఇంతకు ముందు టీవీలో సినిమా చూడ్డానికో, సీరియల్ చూడ్డానికో వచ్చేవారు. ఇప్పుడు అన్నం ప్లేట్లు కూడా తీసుకొని పైకి ఉరుకుతున్నారు. చిన్నపిల్ల కూడా గేమ్స్ అనీ, ఫేస్ బుక్ అని వాళ్ళక్కతో పోటీ పడుతూ ఉంటుంది. కంప్యూటర్ కి సంబంధించిన జ్ఞానం ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ లేకపోవడంతో అసలు వాళ్లేమి చేస్తున్నారో, ఏం చదువుతున్నారో కూడా అర్ధం కావడం లేదు. పిల్లలతో మాటలు కూడా చాలా కరువైపోయాయి.ఇంటర్నెట్ ఇంటికి వచ్చాక పిల్లల్లో వచ్చిన మార్పు గురించి ఒకసారి లావణ్యకు బాధపడుతూ చెప్పింది ధనలక్ష్మి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది లావణ్య.“చూడు పిల్లలని గుడ్డిగా నమ్మకూడదు. స్వేచ్ఛని సద్వినియోగం చేసుకునే వయసు, పరిపక్వత వాళ్ళకింకా ఉండదు. కొంచెం నియంత్రణ అవసరం. ఒకసారి నెట్ ఆన్ చేయి. కుడివైపున స్పానర్ లాగా ఒక గుర్తు ఉంటుంది. దానిని క్లిక్ చేయి. కొన్ని పేర్లు వస్తాయి. అందులో హిస్టరీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయి. గతవారం రోజులుగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే విషయాలన్నీ వరుసగా తేదీ, టైమ్ తో సహా ప్రత్యక్షమవుతాయి. దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు" అంది లావణ్య. తరువాత రోజు పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయాక మేడ మీది గదికి చేరింది ధనలక్ష్మి, ఇంటర్నెట్ ఓపెన్ చేసి లావణ్య చెప్పినట్లుగానే చేస్తూ హిస్టరీ ఓపెన్ చేసి చూడగానే అదిరిపోయింది. పెద్దపిల్ల కన్నా చిన్నపిల్ల ఇంకా ఫాస్ట్ గా ఉంది. ఎవరో అబ్బాయితో రోజూ రాత్రి పన్నెండు వరకు ఛాట్ కూడా చేస్తూ వుంది. భర్తకు చెబితే అనవసరంగా గొడవ. నిమిషాల మీద కోపమొచ్చేస్తుంది. వయసొచ్చిన పిల్లలని కూడా చూడకుండా బాదేస్తాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. అందుకే ఆ సమస్య నుండి ఎలా బైటపడాలో అర్థంకాక పొద్దున్నే లావణ్యకు ఫోన్ చేసింది.ఆ ఆలోచనలలో వుండగానే అంతలో భర్త తలస్నానం చేసి బైటకు వచ్చాడు. టిఫిన్ తింటూ "ఇంకా లేవలేదా పిల్లలు" అన్నాడు.“ఆదివారం కదా" అంది ధనలక్ష్మి.“పడుకోనియ్యిలే పాపం... రాత్రంతా చదివి చదివీ అలసిపోయి ఉంటారు. ఈ మధ్య కాలేజీలో వర్క్ ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. రాత్రి పన్నెండయినా పైన లయిట్లు ఆరిపోవడం లేదు.పాపం చాలా కష్టపడుతున్నారు" అంటూ టిఫిన్ తిని కాలేజీ కి వెళ్ళిపోయాడు. ధనలక్ష్మి వంటగది శుభ్రంగా సర్ది పిల్లలను లేపుదామని పైకి పోయింది. పెద్దపిల్ల మంచమ్మీద పడి నిద్రపోతోంది. చిన్నపిల్ల నిద్రమబ్బుతోనే కంప్యూటర్ ముందు కూర్చోని ఏదో టైప్ చేస్తూ వుంది."ఏందే అంత పొద్దున్నే మొదలు పెట్టేశావ్? బ్రష్ చేసేదుందా... లేదా?" అంది కోపంగా ధనలక్ష్మి,.“నీకేం తెలియదులేమ్మా.... చాలా ఇంపార్టెంట్ పని. ఫిజిక్స్ ఎక్స్ పెరిమెంట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఉదయమైతే నెట్ ఫాస్ట్ గా ఉంటుంది" తల తిప్పకుండా సమాధానమిచ్చింది.ధనలక్ష్మి కంప్యూటర్ వైపు చూసింది. ఏదో సినిమా డౌన్లోడ్ అవుతోంది. అమ్మ చూస్తోందని తెలిసినా ఏ మాత్రం తడబాటు లేదు. తమ అజ్ఞానం మీద వాళ్ళకంత నమ్మకం. ఒళ్ళు జలదరించింది. ఏమీ మాట్లాడకుండా "నాకు కొంచెం పనుంది. బైటికి పోతున్నా. చపాతీ పిండి ఫ్రిజ్ లో ఉంది. కాల్చుకుని తినండి" అంటూ కిందికి వెళ్ళిపోయింది.పిల్లల గురించే ఆలోచిస్తూ స్నానం పూర్తి చేసింది. సమయం పది దాటింది. టిఫిన్ తిని నెమ్మదిగా లావణ్య ఇంటికి బైలుదేరింది. చేరుకొనేసరికి పదకొండయ్యింది.“రా... రా... నీ కోసమే ఎదురు చూస్తున్నా" అంటూ ఆహ్వానించింది లావణ్య. “ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప... చాలా రోజులైంది నిన్ను చూడక. కొంచెం ఒళ్ళు చేసినట్లున్నావే" అంది నవ్వుతూ."నీ మాదిరి తిరిగే వుద్యోగం కాదు గదా. తినడం, పడుకోవడం. ఒళ్ళురాక ఏమొస్తాది చెప్పు" నవ్వుతూ సమాధానం ఇచ్చింది ధనలక్ష్మి.ఇద్దరూ కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక “ఏందే... ఎప్పుడూ లేంది అంత పొద్దున్నే ఫోన్ చేశావ్?" అంటూ లావణ్య అసలు విషయంలోకి దించింది.“అదేనే... నీవు చెప్పావు కదా, నెట్లో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించమని. అలాగే చూశా. పనికొచ్చేవి పదయితే పనికిరానివి నూటాపది. కొన్ని చూస్తే తల తిరిగిపోయింది. ఆడపిల్లలు కూడా ఇలాంటివి చూస్తారా అని ఆశ్చర్యమేసింది. ఏం చేయాలో తోచక నీ దగ్గరకొచ్చాను" అంటూ జరిగిందంతా వివరించింది.“ఆడపిల్లలా, మగపిల్లలా అని చూడొద్దు. ఆకర్షణలు అంత బలంగా ఉంటాయి. ఏ మాత్రం నియంత్రణ కోల్పోయినా చాలు సాలెగూట్లో చిక్కుకుపోతారు. మా బంధువుల అబ్బాయైతే చదువులో నెంబర్ వన్. కాలేజీలో టాపర్. అవసరమంటే నెట్ పెట్టించారు. ఎలా చిక్కుకున్నాడో గానీ ఎప్పుడు చూడూ కొత్త సినిమాలు, గేమ్స్, పాటలు, పోర్న్ వీడియోలు, ఫేస్ బుక్ లు, యూట్యూబ్, టిక్ టాక్ , వాట్సాఫ్, ట్విట్జర్లు, ఛాట్లు, మెయిళ్ళంటూ రాత్రింబవళ్ళు ఆ గదిలోనే... వాళ్ళ నాన్న వాడి కళ్ళ కింద నల్లని చారలు చూసి నెట్ పెట్టించాక పాపం ఇంకా కష్టపడి చదువుతున్నాడు అనుకున్నాడేగానీ, రిజల్ట్స్ వచ్చేదాక వాస్తవం గ్రహించలేకపోయాడు. కానీ ఏం లాభం? అప్పటికే బానిసయిపోయాడు. కనెక్షన్ తీసేస్తే పిచ్చిపట్టినవానిలా అరుస్తూ కేకలేస్తున్నాడు. మానసికంగా దెబ్బతిని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు" చెప్పింది లావణ్య.ఆ మాట విని ధనలక్ష్మికి భయం వేసింది. “ఐతే, ఇప్పుడే నెట్ తీపించేస్తా... పీడా పోతుంది" అంది."నేను చెబుతున్నది అందుక్కాదు. వాళ్ళు ఎదగడానికి సదుపాయాలు ఎంత అవసరమో, వాటికి బలి కాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం అని అర్థం చేసుకోవడానికి. ఇందులో పిల్లల తప్పు కన్నా మన తప్పే ఎక్కువ. వచ్చేది కంప్యూటర్ యుగం. భవిష్యత్తులో కంప్యూటర్ తెలియనివాడు నిరక్షరాస్యుని కిందనే లెక్క. ఇంత చదువు చదివి కూడా పిల్లల భవిష్యత్ కోసం ఆ కంప్యూటర్ గురించి, ఇంటర్నెట్ గురించి మనం తెలుసుకోకుంటే ఎలా? అదేదో పెద్ద బ్రహ్మరాక్షసి అన్న భయం మనలో పేరుకుపోయింది. మనం దాంట్లో కోర్సులు నేర్చుకోవడమంటే కష్టంగానీ బేసిక్స్ తెలుసుకోవడానికి ఎంత సేపు? ఈడ్చి కొడితే మూడు నెలలు చాలు. ఏమాత్రం తెలివితేటలు లేని, పనికిరాని సన్నాసయినా సరే... కాస్త బట్లర్ ఇంగ్లీష్ వస్తే చాలు సులభంగా వచ్చేస్తుంది అది. మనకు గూడా కంప్యూటర్ గురించి తెలుసు అనే భావన పిల్లల్లో కలిగితే చాలు. వాళ్ళు హద్దుల్లో వుంటారు. ఆలాగే ఆ కంప్యూటర్ మేడ మీద గదిలోంచి కిందకి దించి అందరూ తిరిగే ప్రదేశంలోనే కాస్త ప్రైవేట్ గా వుండేలా ఏర్పాటు చేయి. దాన్ని వాడటానికి రెండు గంటలో, మూడు గంటలో సమయాన్ని నిర్ణయించు. అలాగే మీరు తప్పు చేయడం లేదు కాబట్టి మీ సెల్ ఫోన్ కూడా ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూస్తామని సున్నితంగా చెప్పండి. అలాగే మీ పిల్లలకి నీవు తెలుసుకున్న విషయాన్ని ఏ మాత్రం తడబాటు లేకుండా నిర్మొహమాటంగా ముఖాముఖి చెప్పి... ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఊర్కోనని , నాన్నకు చెబుతానని వార్నింగ్ ఇవ్వు" అంటూ అనేక సలహాలు ఇచ్చింది.లావణ్యకు థాంక్స్ చెప్పి బయలుదేరింది ధనలక్ష్మి, ఇంటికి దగ్గరలో 'నైస్' కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ కనిపించింది. లావణ్య మాటలు గుర్తుకు వచ్చాయి. కొత్త బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో కనుక్కోవడానికి లోపలికి అడుగు పెట్టింది.
July 27, 2020 • T. VEDANTA SURY • Story