ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మార్పులేని, రాని నా మాటతీరు---చిన్నపిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కొన్ని సినిమాల్లో అయితే చిన్నపిల్లలతో చెప్పించే డైలాగులు చూస్తుంటే ఏమిటీ అతి అనిపిస్తుంది. అయినా ఎవరి సంగతేమోగానీ మాటతీరుమీదే బంధాలూ అనుబంధాలూ ఆధారపడి ఉంటాయి. నేనెప్పుడైనా ఆవేశంగా ఏదన్నా అంటే వయస్సుకు తగ్గ మాటలేనా నువ్వు మాట్లాడేది...ఒక్కసారి స్థిమితంగా ఆలోచించు అంటుంది మా ఆవిడ. నిజమే, కొందరు నాకు దూరమవడం కూడా నా మాటతీరువల్లేనని తెలుసు. పోనీ ఏదన్నా అనేస్తే అందుకు కట్టుబడతానా అంటే అది ప్రశ్నార్థకమే. నా మాటెప్పుడూ నన్ను కింద పడేస్తుంటుంది. అవును, నా మాట పరుషంగా ఉంటుంది. కొట్టినట్లు మాట్లాడుతావేం అంటుంది మా ఆవిడ. ఇంత వయస్సొచ్చీ ఏం లాభం ఇప్పటివరకూ మాట తీరు తెలుసుకోకుండానే గడిపేశాను. ఏం జీవితమో నాది. మాటతీరు పక్కనపెట్టి ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావుగారి మాటతీరు పుస్తకంమీద ఒకటి రెండు మాటలు చెప్పాలనిపించింది. విజయవాడలోని నిర్మలా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని 2007 జులైలో ప్రచురించింది. అయినా పుస్తకం చదివినంత మాత్రాన నాలో ఏదో మార్పు వస్తుందని అనుకోవడంలేదు. బూదరాజు రాధాకృష్ణగారి మాటల వాడుక, వాడుక మాటలు చదివాను. ఏం లాభం లేదు. నాకు రాయడంలో ఎంత వెనుకబడ్డానో మాట్లాడేతీరులో అంతకన్నా వెనుకబడ్డాను. మిత్రులు ముకుంద రామారావుగారు ఎంత మెత్తగా మాట్లాడుతారో తలచుకున్నప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది. మాటకెక్కడ నొప్పుడుతుందేమో అన్నంత మృదువుగా నిదానంగా మాట్లాడే ముకుంద రామారావుగారికి ఓ సలాం. ఏం లాభం లేదు...ఈ జన్మకింతే...నాకెన్ని ఎదురుదెబ్బలు తగిలినా మాటలెలా వాడాలో తెలీడంలేదు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు. నాలో పెద్ద లోపమిది. - యామిజాల జగదీశ్
August 1, 2020 • T. VEDANTA SURY • News