ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మా పాప ఆన్ లైన్ తరగతుల వల్ల నేను కూడా రోజూ స్కూలుకు వెళుతున్నట్లుంది. ముందే స్కూలంటే తెగ ఇష్టం మరి. రోజూ పాఠాలు వినడం, రాసుకోవడం, దినచర్యలో ఒక భాగమయ్యాయి. ఇలా ఈరోజు ఒక మంచి కథ విన్నాను. నాకు అది చాలా బాగా నచ్చింది. మీలో కూడా చాలా మంది వినే వుంటారు. అయినా క్లుప్తంగా వివరిస్తాను. " ఒక అడవిలో ఒక హైనా ఉండేది. అది హఠాత్తుగా తన నవ్వును పోగొట్టుకుంది. అయితే అది తన నవ్వును వెతుకుతూ ఒక "జిరాఫీ'ని కలిసింది. దానిని, నా నవ్వు పోగొట్టుకున్నాను. నువ్వెక్కడన్నా కనుగొన్నావా? అని అడిగింది. అది తన పొడవాటి మెడతో అంతా కలయ చూసి, నాకు ఎక్కడా కనిపించలేదు అంది. సరే! అంటూ దిగులుగా ముందుకు కదిలింది హైనా. తరువాత ఒక కొలనులో 'నీటిఏనుగు'ను చూసి, నా నవ్వును ఎక్కడన్నా విన్నావా? అని అడిగింది. అది నీటిలోపలికి వెళ్ళి వెతికి, బయటికి వచ్చి తనకెక్కడా వినిపించలేదంది. హైనా దిగులుగా ముందుకు వెళ్ళి, ఏనుగు కనపడగానే, అదే ప్రశ్న తనని కూడా అడిగింది. ఏనుగు కూడా తన చాటంత చెవులను ఆడిస్తూ, తానూ., ఎక్కడా వినలేదని చెప్పింది. దానితో పూర్తిగా నిరాశ చెందిన హైనా, బాధగా వెళుతోంది. అప్పుడు తనకు చెట్టుకొమ్మని పట్టుకుని వ్రేళ్ళాడుతూ వున్న కోతి కనిపించింది. దానిని కూడా అందరినీఅడిగినట్లే అడిగింది. అయితే కోతి హైనాను అడిగింది??, ముందు నువ్వు ఇది చెప్పు, 'ఎక్కడ నువ్వు నీ నవ్వును పోగొట్టుకున్నావు?' అని అడిగింది. అప్పుడు హైనా ఇలా చెప్పనారంభించింది. "నేను నవ్విన ప్రతిసారి నా పెద్ద పళ్ళు కనపడడంతో, కొందరు భయపడడం, మరికొందరు ఎగతాళి చేస్తుండడంతో, నవ్వాలంటే భయమేసింది" అంది. అప్పుడు కోతి అంది, అయితే నువ్వు ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నావు అంటూ క్రిందికి దూకి ఒక ఈకతో హైనాకు గిలిగింతలు పెట్టడం మొదలు పెట్టింది. అంతే హైనా పడి-పడి నవ్వడం మొదలు పెట్టింది. ఆ నవ్వు విన్న జిరాఫి, నీటి ఏనుగు మరియు ఏనుగు అక్కడికి వచ్చి, హైనా నవ్వును ఎక్కడ కనుగొన్నావని కోతిని అడిగాయి. కోతి వాటికి ఇలా సమాధానం ఇచ్చింది. 'హైనా నవ్వు తన లోపలే దాగి వుంది. నేను బయటకు తెచ్చానంతే.' అంది. " ఇదీ కథ. కథ చాలా బాగుంది కదా!. ఈ కథలో హైనా నవ్వు మాయమయినట్లు మనలో చాలా మంది నవ్వు మాయమైంది. మన నవ్వు మాయమవడానికి చాలా కారణాలు వుండవచ్చు. చాలా మంది, హైనాకు కారణమయినట్లే మన నవ్వు పోవడానికి కారణం అయి వుండవచ్చు. దిగులు పడి, ఒత్తిడికి లొంగిపోయి, నవ్వడం మరచిపోయి కృంగుతున్నాం. బయటపడి మన నవ్వును తిరిగి తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం. అలా వెతికితే దొరకడం కష్టం. అసాధ్యం కూడా. ఆ కారణాలు, వ్యక్తులు చక్కబడితే నవ్వు తిరిగి వస్తుందనుకుంటాం. అవేవీ మన చేతుల్లో వుండవు. అవి మారవు కూడా. మన క్షేమం కోసం మనమే మారాలి. భూతకాలమా?, మార్చలేము, భవిష్యత్తా?, ఊహించలేము, వర్తమానమా?, మన చేతిలో వుందనుకుంటాము. మనమేదో చేయాలనుకుంటాము. అదీ మన చేతిలో లేదు. భగవంతుని స్మరించుకుని కర్తవ్యం నిర్వహించడమే. ఆలోచనలకు కృంగి, కృశించిపోతే మన ఆరోగ్యాలు పాడవుతాయి. అది అదనపు భారం అవుతుంది. వీలయినంత మనల్ని వేధించే ఆలోచనలను ప్రక్కకు నెట్టే ఒకే ఒక మార్గం. ఆలోచనలను దారి మళ్ళించడమే. ఇది సులభమైన పని ఏమీ కాదు. కష్ట సాధ్యమే. అసాధ్యం మాత్రం కాదు. ఇలాంటివి చెప్పడం సులభమే. ఆచరించడం చాలా కష్టం. కానీ ఆచరించడానికి తప్పక ప్రయత్నం చేద్దాం.మనమే కాదు, యుగాలుగా ధర్మవర్తనుల నవ్వు దోచబడింది. బాధలు పడ్డారు, నిందలు మోశారు. ఎప్పుడైనా అన్నింటికీ ఒకటే పరిష్కారం "శరణాగతి". ఆర్భాటాలు, అంతస్తులు చూపించుకునే పూజలు కాదు. నిత్యం దైవ నామస్మరణ మనసులో జరుగుతుండాలి. మనసంతా దేవుని మీద నిలిపి ప్రార్థించే ప్రార్థన ఒక్క ఘడియ అయినా చాలు. ఎవరి కొరకో నవ్వులను కోల్పోకుండా, నవ్వును దోచుకున్న పరిస్థితులకు, వ్యక్తులకు మన నవ్వును త్యాగం చేయకుండా....మన కోసం మనం నవ్వుదాం. ఒత్తిడులను అధిగమిద్దాం.--గోమతి
June 25, 2020 • T. VEDANTA SURY • Story