ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మా వూరు( బాల గేయం ): రావిపల్లి వాసుదేవరావుపార్వతీపురం 9441713136.
September 20, 2020 • T. VEDANTA SURY • Poem

చక్కనైన మా ఊరును చూసొద్దామా
ఎన్నెన్నో విషయాలు ను తెలుసుకొందుమా

అదిగదిగో మర్రిచెట్టు నీడనిచ్చును
పశువులను పక్షులనూ సేదతీర్చును

అవిగవిగో పచ్చనైన పంటపొలాలు
అన్నదాత కష్టానికి ప్రతిఫలాలు

అల్లదిగో ఘనమైన పర్వతరాజం
సకల జీవరాసికది చక్కని నిలయం

చూస్తారా రాములోరి గాలిగోపురం
దాని ద్వార కలుగుతుంది దైవదర్శనం

ఆలమందలవిగవిగో బిరబిర పోదాం
పశువుల కాపరులు పాడే పాటలు విందాం

తూరుపున పారుతున్న ఏరును చూద్దాం
ఆ నీటిలో ఈది మనం సేదదీరుదాం

పడమరన ఉన్నట్టి చెరువును చూద్దాం
ఆ చెరువు గట్టుపైన షికారును చేద్దాం

ఊరు చివరనున్నట్టి బడికి వెళదాం
క్రమశిక్షణతో మెలిగే పిల్లలను చూద్దాం

ఊరంతా పరచుకున్న వనములు చూద్దాం
మా ఊరే అన్నింటా గొప్పని అందాం