ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిత్రోత్సాహం.--వసుధారాణి.--సూర్యాస్తమయవేళల్లో ఆకాశ మార్గాన గుంపులు గుంపులుగా ఇళ్లకు తరలి వెళ్ళే కొంగలని చూస్తూ ,"కొంగ కొంగ గోళ్లు నా చేతి వేళ్ళు" అంటూ గుప్పిళ్ళు మూసి రెండుచేతులనూ వేగంగా తిప్పే బాల్యం.గుప్పిళ్ళు విప్పి గోళ్ళపై తెల్లటి చుక్కలకోసం వెతుక్కునే బాల్యం. అది నా అమాయక బాల్యం అనే కంటే ఉత్సాహవంతమైన బాల్యం అనాలనిపిస్తుంది నాకు.నీడలని చూసి సమయం కనుక్కోవాలని ప్రయత్నించడం, బావి గట్టుపైకి ఎక్కి రెండు చేతులూ చాచి వేగంగా నడవటం ,ఎర్రని ఎండలో నేలమీద కాయితం ఉంచి భూతద్దం లోంచి సూర్యుడు కాయితాన్ని కాల్చేలా చేయటం ఇది కొంచెం సృజనాత్మక బాల్యం.పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు ఆనందం వెతుక్కోగలరు. అయితే నేను ఆనందంతో పాటు చిన్నప్పుడే కొన్ని ఉద్వేగాలను కూడా వెతుక్కున్నాను.అదీ స్నేహితులలో. బహుశా మా ఇంట్లో ఉండే వాతావరణం నన్ను అలా ప్రేరేపించింది కాబోలు.నా చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా బంధువు వస్తే వారిని చూసే పద్ధతి ఎలా ఉండేది అంటే , ఇంటి అల్లుడైనా, దూరపు బీరకాయ పీచు బంధువైనా ఎవరికైనా ఒకేలాంటి ఆదరణ.ఉన్నంతలో వారిని చక్కగా ఆదరించి పంపటం. వారు సంతోష పడితే మనం ఆనందం పొందటం.వారికి ఇష్టమైనవి వండిపెట్టటం.చక్కటి మాటలు మాట్లాడటం. ఎప్పుడూ మన ప్రవర్తన ద్వారా వారిని నొప్పించక పోవటం.వారి ప్రవర్తన మనకి ఇబ్బంది కరమైనా మన అతిథి కనుక సర్దుకుని గౌరవంగా చూడటం ఇలా ఉండేది.చూసి నేర్చుకునే పసితనం అనుకరణ చేస్తుంది కదా.నేనూ ఈ ఆదరణ ఆదర్శానికి ఆకర్షితురాలనయి అదంతా మిత్రుల మీద చూపేదాన్ని. నా ఈ మిత్రోత్సాహం వలన ఒకటో తరగతి నుంచే బోలేడు మంది మిత్రులు వుండే వారు.రకరకాల మనస్తత్వాలు,రకరకాల మంచితనాలు.మిత్రుల్లో నా ఫస్ట్ క్రష్ రమాదేవి అని ఓ పిల్ల.ఆయమ్మి కోసం ఎన్నెన్ని నేను దాచుకున్న విలువైనవన్నీ ఇచ్చేదాన్నో.ఆఖరికి పుస్తకం మధ్యలో ఆహారం వేసుకుని పెంచుకునే ప్రాణప్రదమైన నెమలీకతో సహా. నేను ఇచ్చిన ఆ అందమైన స్నేహానికి ప్రతిగా, బూమరాంగ్ లాగా తిరిగి బోలెడు ఆనందం ఎటు చూసినా. స్వచ్ఛమైన స్నేహ వీచికలు వీస్తూనే ఉన్నాయి నా జీవితాన.చివరకి నా చెలిమికి ఎంతటి పదోన్నతి లభించిందంటే నా "నువ్వు" తో స్నేహం చేసేంత.ఇదీ నా మిత్రోత్సాహ మెరుపు కథ.
August 3, 2020 • T. VEDANTA SURY • Memories