ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిన్ను - బాలల నవల మూడో భాగం--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
October 15, 2020 • T. VEDANTA SURY • Serial

వాళ్ళు కొత్తగా చేరిన నగరంలో ఎక్కడా ఒక పెద్ద చెట్టూ లేదు. ముచ్చటైన పక్షుల పలకరింతా లేదు. అక్కడక్కడ కొందరిళ్ళలో చిన్నచిన్న పూల మొక్కలు కుండీల్లో పెరుగుతున్నాయంతే. చిన్నీ మిన్నుకు ఎప్పుడూ తమ పక్షుల వీధే మతికి వచ్చేది. దాని గురించే పదే పదే కలలు కంటా వుండేటోళ్ళు.

కొద్ది రోజులకు చిన్ని పుట్టినరోజు వచ్చింది. వాళ్ళ అమ్మానాన్న రంగురంగుల పూలమొక్కలు వున్న కుండీలు బహుమతిగా ఇచ్చారు. కానీ మిన్ను అక్కకు ఏం బహుమతిగా ఇవ్వాలా అని బాగా ఆలోచించి అంతవరకూ ఎప్పుడూ తయారుచేయని రంగురంగుల అందమైన గూడు తయారుచేసి అక్కకు బహుమతిగా ఇచ్చాడు. చిన్ని ఆ ముచ్చటయిన గూడును చూసి చానా సంబరపడింది. దానిని ఇంటి ముందున్న వరండాలో పైన వేలాడదీసింది.

చిన్ని రోజూ వచ్చి ఏ పక్షులైనా ఆ గూటిలో వాలతాయేమోనని ఎదురు చూడసాగింది. అలా ఒకొక్కరోజే గడచిపోతా నెల దాటింది. ఏ పక్షులూ అటువైపు రాలేదు. పాపం.... చిన్ని ముఖం వాడిపోయింది. దాంతో ఒకరోజు కోపంగా “ఆ గూడు తీసుకుపోయి దిబ్బలో పాడేయండి. నాకొద్దు" అంది విసుగ్గా. అది చూసి వాళ్ళ నాన్న చిరునవ్వు నవ్వుతా చిన్నిని దగ్గరకు తీసుకొని “చూడమ్మా... మేం చిన్నగున్నప్పుడు రైతులు పక్షుల కోసం ఇళ్ళ ముందు నిండుగా వున్న కంకులు తీసుకువచ్చి చూరులో వేలాడదీసేవాళ్ళు. పక్షులు ఆ గింజలు తినడం కోసం ఇంటి చుట్టూ తిరుగుతా వుండేవి. మీరు గూడా అలా చేసి చూడండి" అన్నాడు. తరువాత రోజు చిన్ని ఒక జొన్నకంకి తీసుకువచ్చి ఆ గూటి ముందు వేలాడదీసింది.

అలా వేలాడదీసిన కాసేపటికే ఒక పిట్ట వచ్చి అక్కడ వాలింది. చిన్నగా, బొద్దుగా, గోధుమ రంగులో వుంది. అందమైన చిన్నితోకను అటూయిటూ తిప్పుతా కంకిపైకి చేరింది. తన కొశ్నని ముక్కుతో టపాటపా ఒక్కొక్క గింజనే పొడుచుకుంటా తినసాగింది. దాని కిచకిచలు విని మిన్ను కిటికీలోంచి తొంగి చూశాడు. వురుక్కుంటా పోయి అక్కకు చెప్పాడు. ఇద్దరూ వేగంగా వరండాలోకి వచ్చారు. వాళ్ళని చూసి పిట్ట భయంతో తుర్రున అక్కడి నుంచి ఎగిరిపోయింది. “అరెరే... రాకరాక ఒక్కటి ఇన్ని రోజులకి వచ్చింది. కానీ ఒక్క నిమిషమైనా చూడలేకపోతినే” అంది చిన్ని. అది చూసి వాళ్ళమ్మ మౌళిని "రేయ్... పక్షులు చిన్నచిన్న చప్పుళ్ళకు కూడా బెదిరిపోతాయి కదా... మీరు దూరం నుండే గమనించాలి. ఓపికగా ఎదురుచూడాలి. వాటిని మనమేం చేయం అని వాటికి నమ్మకం కలిగించాలి. అప్పుడు అవి మన దగ్గర వాలతాయి. తొందరపడకండి" అని చెప్పింది. 

“ఔనుగదా... నిజమే... పాపం... చిన్ని పక్షులు" అనుకున్నారిద్దరూ.

కాసేపటికి మరలా ఆ బుజ్జిపిట్ట అక్కడికి చేరింది. ఒకొక్క గింజే తీసుకుంటా పక్కనే వున్న రంగురంగుల ముచ్చటైన గూటిని చూసింది. ఎగిరి దానిలోకి దూకింది. కిందా పైనా తిరిగింది. కాసేపు అక్కడే వుండి ఎగిరిపోయింది. దూరం నుంచే అది చూసి అక్కాతమ్ముళ్ళిద్దరూ బాగా సంబరపడిపోయారు.

తరువాత రోజు ఆ పిట్ట మరలా వచ్చింది. ఈసారి ఒంటరిగా కాదు. జంటతో వచ్చింది. రెండూ ఆ అందమైన బుజ్జి గూడుపై వాలాయి. రెండూ దాని చుట్టూ తిరిగాయి. కిచకిచలాడుకున్నాయి. చుట్టూ గమనించాయి. ఎగిరిపోయాయి. కాసేపటికి ఒకటి ఒక గడ్డిపోచ ముక్కుతో కరచుకొని వచ్చి అక్కడ వాలింది. అది చూడగానే చిన్నికి అవి గూడు కడుతున్నట్టు తెలిసిపోయింది. సంబరపడిపోయింది. పరుగెత్తుకుంటూ పోయి అమ్మకు, నాన్నకు, తమ్మునికి చెప్పింది. బళ్ళో పిల్లలందరికీ చెప్పింది. ఆరోజు నుంచీ చిన్ని, మిన్ను ఇద్దరూ బడయిపోగానే పరుగెత్తుకుంటా ఇంటికి చేరుకునే వాళ్ళు. గబగబా చదవడం, రాయడం, ఇంటిపని చేసుకుని ఆ పిట్టలనే చూసుకుంటా వుండేవాళ్ళు. 

చిన్ని వాటిపై

పిట్టమ్మ పిట్ట
మా మంచి పిట్ట
ముద్దు ముద్దు పిట్ట
మురిపాల పిట్ట
చిన్నిచిన్నిముక్కు
కిచకిచలాడు 
బుజ్జిబుజ్జి రెక్కలు 
ఎగిరెగిరిదుంకు 
చిట్టిపొట్టి బొజ్జ 
గింజగింజ మింగు 
గింతగింత కళ్ళు 
అటుయిటు తిప్పు 
పిట్టమ్మ పిట్ట
మా మంచి పిట్ట 
ముద్దుముద్దు పిట్ట 
మురిపాల పిట్ట

అని ఒక చిట్టి కవిత గూడా రాసి అందరికీ చూపించింది. పిట్టలు గడ్డిపరకలు, పక్షుల ఈకలు తెచ్చి గూడులో మెత్తని, వెచ్చని పరుపును తయారు చేసుకున్నాయి. ఇక ఆడపిట్ట లోపలే వుండసాగింది. కొద్దిరోజులకు అది ఒకదాని తరువాత ఒక గుడ్డు చొప్పున వరుసగా నాలుగు పెట్టింది. తరువాత వాటిని పొదగడం మొదలు పెట్టింది. తల్లిపిట్ట ఎక్కువసేపు వాటిపైనే వుండేది. అప్పుడప్పుడు ఆహారం కోసం కాసేపు బైటకి పోతే మగపిట్ట గూటిలో వుండేది. వెచ్చదనం కొంచం గూడా తగ్గకుండా చూసుకునేవి. చిన్ని, మిన్ను రోజూ బియ్యం గింజలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఆ వరండాలో చల్లేవారు. పిట్టలు అవి తింటా అక్కడే కిచకిచలాడుతా తిరిగేవి. మొదట వీళ్ళు వచ్చిన అలికిడి వినగానే ఎగిరిపోయేవి. కానీ నెమ్మదిగా వాటికి భయం పోయింది. చిన్ని, మిన్ను వున్నా భయపడకుండా కిచకిచలాడుతా పక్కకు వచ్చి గింజలు తినడం మొదలుపెట్టాయి.

అలా రోజులు గడచిపోతా వున్నాయి. ఎప్పుడెప్పుడు గుడ్డు పగులగొట్టుకొని పిల్లలు బైటకి వచ్చి కిచకిచమంటాయా అని అందరూ ఎదురుచూడసాగారు. అలా నెల దాటింది. చిన్న సవ్వడి గూడా లేదు.

ఒకరోజు పిట్టలు రెండూ బైటకి వచ్చి ఎక్కడికో ఎగిరిపోయాయి. మరలా రాలేదు. వరుసగా మూడు రోజులు ఎదురుచూశారు. వాటి జాడే లేదు. ఎందుకబ్బా అనుకుంటా నెమ్మదిగా నిచ్చెన వేసుకొని పైకెక్కి చిన్ని గూటిలోకి తొంగి చూసింది. అక్కడంతా గుప్పుమని కుళ్ళిన వాసన కొడతా వుంది. అవి పొదగకముందే మురిగిపోయాయి. చిన్నికి, మిన్నుకి చానా బాధనిపించింది. గూడు కిందకి తీసుకువచ్చి సబ్బుతో బాగా కడిగి మరలా పైన కట్టారు. అవి ఎందుకలా పాడయిపోయాయో వారికి ఎంత ఆలోచించినా తెలీలేదు.

చీకటి పడ్డాక వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. ఇద్దరూ బాధగా నాన్న దగ్గరికి చేరి జరిగిందంతా చెప్పారు. నాన్న వాళ్ళ తల నిమురుతా మన వీధికి పక్కనే చాలా దగ్గరలో సెల్ టవర్ వుంది గదా... దాని నుంచి వచ్చే రేడియేషన్ తరంగాలు వీటి మీద పడ్డట్టున్నాయి. దాంతో ఇవి పిల్లలని కనే సత్తువను పోగొట్టుకున్నట్టున్నాయి. అందుకే ఒక గుడ్డు కూడా పొదగలేక పోయాయి. ఇందువల్లనే మేం చిన్నగున్నప్పుడు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఇంటి పెరటిలో, పశువుల చావిడిలో, పంటపొలాల్లో ఎగురుతా దుంకుతా సందడిగా కనబడే పిట్టలు ఇప్పుడు పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో గూడా నెమ్మదిగా కనుమరుగవుతా వున్నాయి. దానికి తోడు పంటలపై చల్లే రసాయనిక మందులు, నగరాల్లో ఎక్కడా చెట్టనేదే లేకపోవడం, ఆహారం దొరకక పోవడం, వాహనాలు పెరిగిపోయి వాటిని ఢీ కొట్టడం, గాల్లో కరెంటు తీగలకు తగులుకోవడం... ఇలా నాగరికత పెరుగుతున్న కొద్దీ రోజూ వందలకొద్దీ పక్షులు చనిపోతా వున్నాయి. ముందుముందు మనం పిట్టలనే కాదు, ఇలాంటి చిన్నచిన్న పక్షుల్లో చానా వాటిని చూడలేకపోవచ్చు. అందుకే ఇంతకు ముందు మనం వున్న వీధిలోలాగే అన్ని వీధుల్లోనూ పక్షులను కాపాడడానికి పిల్లలూ, యువకులు, పెద్దలూ ముందుకు రావాలి. మనిషి లేకున్నా పక్షులు జీవించగలవేమో కానీ పక్షులు లేకుంటే మానవజాతికి మనుగడే లేదు. ఆ విషయం అందరూ తెలుసుకోవాలి' అన్నాడు వివరంగా.

“అదేంటి నాన్నా... పక్షులు లేకపోతే మానవజాతే వుండదా" అంది చిన్ని.

"అవునురా బంగారూ... మన భూమ్మీద అనేక రకాలైన పురుగులు, కీటకాలు వేలకువేలు వున్నాయి. ఇవి అనంతంగా అడ్డూ అదుపూ లేకుండా సంతానాన్ని కంటా వుంటాయి. వాటి సంతతి అలాగే పెరిగిపోతే దెబ్బకు ఈ భూమ్మీద ఒక్క చెట్టు గూడా మిగలదు. అన్నీ వాటికే ఆహారమైపోతాయి. పక్షులు పంటకు హాని కలిగించే ఈ పరుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటా వాటి జనాభా పెరగకుండా అడ్డుకొంటున్నాయి. అంతేగాక పక్షులు రకరకాల పళ్ళు తిని ఒకచోటి నుంచి ఇంకొక చోటికి ఎగిరిపోతా ఉంటాయి. అవి ఇంకొక చోట రెట్ట వేసినప్పుడు అందులో అరగకుండా వున్న విత్తనాలు భూమి మీద పడి వానలు రాగానే కొత్త మొక్కలు పెరుగుతున్నాయి. వేప, మర్రిలాంటివి అలా పక్షుల రెట్టల వలననే అనేక చోటుల్లో పెరుగుతా వున్నాయి" అన్నాడు నాన్న.

“నాన్నా నువ్వెప్పుడయినా ఇలా జంతువులను గానీ పక్షులను గానీ పెంచుకున్నావా" అనడిగింది చిన్ని,

ఆ మాటలకు హరి చిరునవ్వు నవ్వుతా "నేనెప్పుడూ పెంచుకోలేదు గానీ చిన్నగున్నప్పుడు మీ అమ్మ ఒక పిల్లిపిల్లను పెంచుకుందంట కొన్నాళ్ళు. నాకోసారి చెప్పింది. మీ అమ్మనడగండి” అన్నాడు. అంతే ఇద్దరూ వురుక్కుంటా పోయి వాళ్ళ అమ్మ మౌళినిని చుట్టుకున్నారు. “అమ్మా.. అమ్మా... చెప్పమ్మా" అంటా వెంటబన్నారు. అమ్మ వంటింటిలో పనంతా ముగించుకొని వచ్చి వరండాలో చేరింది. ఇద్దరూ అమ్మ ముందే కూచున్నారు. అమ్మ కాసేపు కళ్ళు మూసుకొంది. ఆమె ముఖంలో కొంత సంతోషం. కొంత విషాదం. చెప్పడం మొదలు పెట్టింది.
*******************************
 *అమ్మ చెప్పిన పిల్లి పిల్ల కథ రేపు తెలుసుకుందాం*