ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మిన్ను - బాలల నవల రెండో భాగం--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032211
October 14, 2020 • T. VEDANTA SURY • Serial

 ఆరోజు నుంచీ మిన్ను చానా మారిపోయాడు. రవితో కలసి తిరగడం మానివేశాడు. పక్షుల కోసం ఏం చేసి తన తప్పు సరిదిద్దుకోవాలా అని ఆలోచించసాగాడు.మిన్ను వాళ్ళ వీధి చివర చెక్కపని చేసేవాళ్ళు వున్నారు. వాళ్ళు ఇళ్ళకు కావలసిన సామానులు అనేకం చేసి అమ్ముతుండేవారు. మిన్నుకు మెరుపులాంటి ఉపాయం తోచింది. వెంటనే పరుగుపరుగున ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలో మిన్నుకు ఒక హుండీ వుంది. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడుగానీ, పుట్టినరోజప్పుడుగానీ పెద్దవాళ్ళు ఇచ్చే డబ్బులు అందులో వేసేవాడు. ఆ హుండీ పగలగొట్టి డబ్బులన్నీ తీసుకొని పరుగెత్తుకుంటా ఆ చెక్కపని చేసేవాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడున్న ఒక ముసలాయన ముందు ఆ డబ్బులు పెట్టి “ఇవన్నీ తీసుకొని నాకు పక్షుల కోసం గూళ్ళు ఎలా తయారు చేయాలో చెప్పండి" అన్నాడు. ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి “ఏం చేసుకుంటావు గూళ్ళు తయారుచేసి" అన్నాడు. మిన్ను జరిగిందంతా చెప్పి “పాపం.. ఇంతకాలం వాటిని ఎంతగా బాధ పెట్టానో తలచుకుంటే అన్నం గూడా తినబుద్ధి కావడం లేదు. అందుకే వాటి కోసం మంచి మంచి గూళ్ళు తయారుచేసి వీధంతా పెడతాను" అన్నాడు. ముసలాయనకు మిన్ను తపన నచ్చింది. మిన్నును దగ్గరకు తీసుకొని “నువ్వు చేసే పనికి మేమూ తోడుంటాం. మాకేం డబ్బులు వద్దు" అంటూ రకరకాల గూళ్ళు ఎలా తయారు చేయాలో చూపెట్టసాగాడు. మిన్ను కొద్దిరోజుల్లోనే అందులోని మెళకువలన్నీ తెలుసుకున్నాడు. తన దగ్గర వున్న డబ్బులతో మంచి చెక్కముక్కలు కొనుక్కొచ్చాడు. వాటితో చిన్న చిన్న గూళ్ళు తయారుచేసి ఇంటి ముందున్న పెద్ద చెట్టు మీద అక్కడక్కడ పక్షుల కోసం తగిలించాడు. వీధిలోని పిల్లలను ఒక జట్టుగా తయారుచేసి వాళ్ళకు గూడా గూళ్ళు ఎలా తయారుచేయాలో చూపించాడు. దాంతో ఆ పిల్లలు గూడా అందమైన గూళ్ళు తయారుచేసి పక్షుల కోసం తమ ఇళ్ళ ముందు తగిలించసాగారు. దాంతో కొద్దిరోజుల్లోనే ఆ వీధంతా పక్షుల కిలకిలలతో నిండిపోయింది. చిలుకలు,
గోరింకలు, కంజులు, లకుముకిపిట్టలు, బెల్లంగువ్వలు, పాలపిట్టలు, వానకోయిలలు... ఇలా రకరకాల రంగురంగుల పక్షులు ఆ గూళ్ళలో చేరి కేరింతలు కొడతా వుంటే వీధిలో పెద్దలు, పిల్లలు అందరూ మురిసిపోయారు. ఉదయాలు వాటి కిలకిలల పలకరింపులతో చానా అందంగా వుండేవి. సాయంకాలపు అలసట వాటి అందమైన రంగుల్లో మాయం అయ్యేది. దాంతో పెద్దలు గూడా పిల్లలకు అండగా నిలిచారు. వీధంతా పక్షుల కోసం పళ్ళమొక్కలు నాటారు. పిల్లలు అందరి ఇళ్ళకు వెళ్ళి “అమ్మా! మీరు వారానికోసారన్నా అన్నం చేసేటప్పుడు పక్షుల కోసం ఒక పిడికెడు బియ్యంగానీ, ఏవైనా గింజలు గానీ తీసుకొని మీ వరండాలో గానీ, మిద్దెపైన గానీ చల్లండి. వాటి చిన్ని బొజలు నింపండి" అని చెప్పేవాళ్ళు. వాళ్ళు గూడా ఆనందంగా అలాగే చేసేవాళ్ళు. తొందరగానే ఆ వీధికి 'పక్షుల వీధి' అనే పేరు గూడా వచ్చేసింది. కందనవోలు నగరంలోనే అన్నింటికన్నా అందమైన వీధి అని అందరూ తెగ మెచ్చుకునేవాళ్ళు.

అదంతా తలచుకుంటా మిన్ను సంతోషంగా పడుకున్నాడు. కాసేపటికే బాగా నిదురపట్టింది. అంతలో చెవి పక్కన కిచకిచకిచమని పిచుకల అరుపులు వినబడ్డాయి. లేచాడు. ఒక బుజ్జిపిట్ట ముందుకు వచ్చి “మిన్నూ... నువ్వు, మీ అక్క మా పక్షుల కోసం ఎంతగానో ఆలోచించి మీ వీధి వీధంతా చక్కని గూళ్ళు తయారుచేసి పెడతా వున్నారు. మా పక్షులన్నీ మీకెంతో ఋణపడి వున్నాయి. అందుకే మీ ఇద్దరినీ మా పక్షుల లోకంలో విందుకు పిలుచుకొని రమ్మని మా నెమలిరాజు చెప్పాడు' అనింది.

మిన్ను అక్కను లేపి సంగతి చెప్పాడు. ఇద్దరూ బెరబెరా తయారై మంచి బట్టలు వేసుకొని బైటకు వచ్చారు. అంతలో చిన్ని “కానీ... మీరేమో ఆకాశంలో... మేమేమో నేల మీద. ఎలా మీతో రావడం" అనడిగింది.

“మీకెందుకు భయం. మేమున్నాం గదా... మా మీదకు ఎక్కండి. తీసుకుపోతాం" అంటూ రెండు పెద్ద హంసలు ముందుకు వచ్చాయి. చిన్ని, మిన్ను సంబరంగా వాటి మీదకు ఎక్కారు. హంసలు నెమ్మదిగా రెక్కలు వూపుతూ గాల్లోకి లేచాయి. వాటి వెంటే కోయిలలు, కొంగలు, కాకులు, పిట్టలు, గోరువంకలు, పాలపిట్టలు, తూనీగలు, సీతాకోకచిలుకలు... ఒకటా రెండా... వందలు వందలు. ఆకాశమంతా రకరకాల రంగురంగుల పక్షులతో నిండిపోయింది. అంత పైనుంచి కిందికి చూసి ఇద్దరూ సంబరపడ్డారు. నదులు, లోయలు, కొండలు, మైదానాలు, అడవులు, ఇళ్ళు, వాహనాలు అన్నీ చిన్న చిన్న ఆటబొమ్మల్లా కనబడతా వున్నాయి.

“అక్కా... మనకు గూడా రెక్కలుంటే ఎంత బాగుండు. మనం గూడా వీటితో బాటు హాయిగా ఎగురుతుంటిమి గదా" అన్నాడు బాధగా మిన్ను

అది చిలుక వింది. పక్కనున్న కోయిల చెవిలో ఏదో చెప్పింది. కోయిల కొంగలకు సంగతి వివరించింది. కొంగలు సరేనంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాయి.

కాసేపటికి కొంగలు నాలుగు పెద్ద పెద్ద రెక్కలు మోసుకుంటా అక్కడికి వచ్చాయి. అవి చూసిన హంస “చిన్నీ, మిన్నూ... మీ కోసం మా నెమలి రాజు ఈ రంగు రంగుల అందమైన రెక్కలు పంపించాడు. ఇవి భుజాలకు తగిలించుకోండి. మాలాగే మీరూ హాయిగా ఆకాశంలో ఎగరొచ్చు" అంది.

చిన్నీ మిన్ను ఆనందంగా వాటిని అందుకున్నారు. రకరకాల పక్షుల ఈకలతో తళతళా మెరిసిపోతున్నాయి. ఇద్దరూ వాటిని భుజాలకు కట్టుకొని రెక్కలు ఆడించారు. అంతే... నెమ్మదిగా హంస మీద నుండి గాల్లోకి లేచారు. వేగంగా ఆడించారు. సర్రున పైకి దూసుకుపోయారు. ఇద్దరికీ సంబరం సంబరం కాదు. “అరే... ఎంత మజాగా వుంది ఇలా ఎగురుతోంటే. అసలు నమ్మలేకున్నాం. మాకీ ముచ్చటయిన రెక్కలు ఇచ్చినందుకు మీకు లక్ష వందనాలు" అంటూ ఆనందంగా అరిచారు. పక్షులతో పోటీ పడతా గిర్రున పైకీ కిందికీ తిరుగుతా వున్నారు. కిలకిలకిల నవ్వుతా వున్నారు. ఆనందంతో ఎగిరెగిరి దుంకుతా వున్నారు. సర్రున గాల్లో గిరికీలు కొడతా వున్నారు.

అంతలో... అనుకోకుండా... మిన్ను కట్టుకున్న రెక్కలు వూడిపోయాయి.

మిన్ను అదిరిపడ్డాడు. సర్రున వేగంగా కిందకు పడిపోతా వున్నాడు. పక్షులు ఏవీ గమనించలేదు. “కాపాడండి... కాపాడండి" అంటా గట్టిగా కేకలు పెడతావున్నాడు. పక్షులు దూరమైపోతా వున్నాయి. వేగంగా భూమి వంక పోతున్నాడు. కింద పెద్ద కొండ వుంది. కాళ్ళూ చేతులు వణుకుతా వున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడతా వున్నాయి. భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.

అంతే... పైనుంచి దభీమని కింద పడ్డాడు. "అమ్మా" అంటూ లేచి కూచున్నాడు.

గుండెలు అదురుతా వున్నాయి. కాళ్ళూ చేతులు చెమటతో తడిసిపోయాయి. గసబెడతా వున్నాడు. చుట్టూ చూశాడు. మంచం మీద అమ్మ, అక్క పడుకోని వున్నారు. తాను మంచం మీద నుండి కిందపడి వున్నాడు. 

“అరెరే... ఇదంతా కలనా" అనుకున్నాడు. తలచుకోగానే నవ్వు వచ్చింది. లేచి మంచినీళ్ళు తాగి, మరలా పడుకొని హాయిగా నిదురబోయాడు.
కొద్ది రోజులకు వాళ్ళ నాన్నకు ఆవూరి నుంచి పక్కనే వున్న ఇంకో నగరానికి బదిలీ అయ్యింది. దాంతో వాళ్ళందరూ ఆ వీధిని వదలి వెళ్ళవలసి వచ్చింది. చిన్నీ మిన్నులకు ఆ పచ్చని పళ్ళమొక్కలు, రంగురంగుల అందమైన పక్షులు, ముచ్చటైన గూళ్ళు, పక్షుల కిలకిలా రావాలు... ఇవన్నీ వదలాలంటే మనసు ఎలాగో అయిపోయింది. కానీ తప్పదు. ఆ విషయం తెలుసుకున్న ఆ వీధి పెద్దలు, పిల్లలు అందరూ కలిసి చివరి రోజు పెద్ద సభ జరిపి “ఈ వీధి ఇంత అందంగా కళకళలాడుతా వుందంటే దానికి కారణం చిన్నీ మిన్నుల కృషే. వాళ్ళని మేమెప్పటికీ మరువం" అంటా ఘనంగా వీడుకోలు ఇచ్చారు. చిన్నీ మిన్ను కళ్ళనీళ్ళతో, బాధతో నిండిన మనసుతో వదలలేక వదలలేక ఆ వీధిని వదిలారు.
*******************************
 *కొత్తగా చేరిన నగరం ఎలా  ఉంది. అక్కడ చిన్ని మిన్ను ఏం చేశారో రేపు మూడవ భాగంలో చూద్దాం*