ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ముద్దుల దేవుడు--ఈ పుస్తక రచయిత్రి మనుషీ భారతి. ఇదొక కవితా సంపుటి.ఈ సంపుటిలో మొత్తం 75 కవితలు ఉన్నాయి. వీటిలో తొంబై శాతం ప్రేమకు సంబంధించినవే. తొంబై ఆరు పేజీల ఈ పుస్తకం ధర వంద రూపాయలు.కవితలు ఏదో ఒక విషయం చెప్పాలనేం లేదు.కవి ఉద్వేగానుభూతుల ప్రవాహమే కవిత. వాటిని చెప్పగలగడంలో ఈమె సఫలమయ్యారు. ఆ విధంగానే ఈమె పాఠకులను ఆకట్టుకున్నారు.కవిత మనల్ని అన్వేషింపచేయాలన్నదే ఈమె ఆశయం. అందులో ఆమె విజయం సాధించారు.ఆమె తన కవితలతో మనతోనూ ప్రయాణం చేయించారు. ఈ క్రమంలో మనం ఆమె కవితలతో మమేకమైపోతాం.ఆమె ప్రతి కవితలోనూ ఓ ప్రశ్న ఉంటోంది.ఈ పుస్తకంలోకెళ్ళే ముందర ఆమె గురించి ఒకటి రెండు మాటలు...జయభారతి అనే మనుషీ భారతి 2008 నుంచి కవితలు రాస్తున్నారు.ఆమె తొలి కవితా సంపుటి "కుట్టి ఇళవరసి" (చిట్టి యువరాణి"). ఈ పుస్తకం 2013లో విడుదలైంది.ఇక ఈ ముద్దుల దేవుడు కవితా సంపుటి 2014లో విడుదలైంది. ఇప్పటికే పలు పురస్కారాలందుకున్న ఆమెకు 2017లో సాహిత్య అకాడమీ "యువ పురస్కారం"తో సత్కరించింది. ఆది కాదలిన్ నినైవు కురిప్పుగళ్ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.ఇక ఈమె ముద్దుల దేవుడు సంపుటిలో చివరి కవిత శీర్షికనే తన పుస్తకానికి పేరు పెట్టారు.ఆ కవితలోని చివరి నాలుగు పంక్తులు... "కొత్త ముద్దుల ప్రపంచాన్ని సృష్టించడానికీ ముద్దుల జీవరాసులను సృష్టించడానికీ పూజ గదిలోంచి శ్రీకారం చుడదాం విజయానికైన తొలి ముద్దుని" ఇటువంటి వాక్యాలతో కవయిత్రి పాఠకులను ఎక్కడికో తీసుకువెళ్తారు. నిజమే...ఆమె రాసిన కవితలలో అధిక శాతం ప్రేమానుభూతులను వెల్లడించేవే.నిజానికి ఈ కవితలను నిశితంగా పరిశీలిస్తే వాటి వెనుక ఓ ఏకాంతం లేకపోలేదు.ఆశ, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, బంధాలు వంటి ప్రశ్నలు మనకు కలుగుతాయి. రెండేసి వాక్యాల్లోనూ మూడేసి వాక్యాల్లోనూ నాలుగేసి వాక్యాల్లోనూ ఆమె భావాలు మనకు లాలిపాటలై అలరిస్తాయి. ఈ ఊహల ఊసులన్నీ మనల్ని మరో ప్రేమ ప్రపంచంలోకి తీసుకుపోతాయి. కొన్నిసార్లు మన బాధలను ఓదార్చడానికి ఓ ఒడి కావలసివస్తుంది. తీరని ప్రేమ అనే కవితలో ఉత్సవాల సమూహంలో తల్లి కోసం వెతికే బిడ్డలా ప్రేమను వెతుకుతున్నానన్నారొక చోట. నేను వెతికే ప్రేమ నువ్వై ఉండొచ్చు మరొక కవితలో ద్వేషించేందుకు ఏముంది? ఓ కారణం చెప్పు... కానీ నేను నిన్ను ప్రేమింంచడానికైన కారణం నా వద్ద బలంగా ఉంది.... "రాత్రంతా రోదించాను కన్నీటిచుక్కలు తీసుకురాని నాకైన మృత్యువును..." ఎంతటి ఊహ... స్వర మరణం బలహీనమైనది ప్రేమ బుద్ధుడి ప్రేమ ఇటువంటి శీర్షికలతో కొనసాగాయి ఆమె కవితలు.... శీర్షికలే కవితలుగా అనిపిస్తాయి. ఆమె పదబంధాలు హృదయాన్ని నెమలీకతో స్పర్శించినట్లనిపిస్తాయి. ప్రేమ ఎప్పుడూ అబద్ధమైపోకూడదన్నది ఆమె మాట. ఆమె కవితల్లో కొన్ని చోట్ల కోపం, ఆవేశం, ఏడ్పు ఇలా అనేక రసాలు మనసులో ప్రళయం సృష్టిస్తాయి. అయినప్పటికీ వీటన్నింటినీ అధిగమించి బతగ్గలననే నమ్మకాన్ని ఆమె కవితల ద్వారా చెప్పక చెప్పారు. ఓడిపోతామో గెలుస్తామో అనేది పక్కన పెట్టి ప్రేమ ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. ప్రయాణించాలంటారు కవయిత్రి. - యామిజాల జగదీశ్
July 29, 2020 • T. VEDANTA SURY • Book Review