ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మూకశంకరులు - మూకపంచశతి---మూకశంకరులు - మూకపంచశతి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భాగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురం లో సర్వజ్ఞ పీఠం స్థాపించారు. అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఈ పీఠం గురుపరంపరలో 20 వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. ఆయనను మూక శంకరులు అంటారు. ఈయన క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన తండ్రి శ్రీ విద్యావతి ఖగోళ జ్యోతిష్యులు. మూక శంకరులు పుట్టుకతోనే మూగ, చెవుటి ఉన్నవారు. అందుకనే ఆయనను "మూక కవి' అనేవారు. కానీ అమ్మ వారి కటాక్షముంటే, పుట్టుకతో మాటలు రాని వారైనా మాట్లాడతారనడానికి మూక శంకరుల జీవితమే ఓ గొప్ప నిదర్శనం.ఓరోజు మూక శంకరులు కామాక్షీ అమ్మ వారి ఆలయంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు మరొక సాధకుడు కూడా అమ్మను ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షీ అమ్మవారు వీరిని అనుగ్రహించే క్రమంలో ఓ స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద కొంచెం తీసి మూక శంకరుల పక్కనే ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ ఆగమనం గుర్తించలేక, ఆమె ఓ స్త్రీ అనుకుని, ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించలేదు.కామాక్షీ అమ్మవారు ఆ వెంటనే ఆ తాంబూలాన్ని మూక శంకరుల చేతికి ఇచ్చింది. ఆయన మహాప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు. అంతే మరుక్షణమే కామాక్షీ అమ్మవారి అనుగ్రహంతో మూక శంకరులవారికి మాట వచ్చింది. మాట రావడంతోనే, ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది. కామాక్షీ అమ్మవారిని చూస్తూ ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు. ఆ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇందులో అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తూ వంద శ్లోకాలు (ఆర్యా శతకం), అమ్మవారిని స్తుతి చేస్తూ వంద శ్లోకాలు (స్తుతి శతకం), అమ్మవారి కన్నులు చూస్తూ మరో వంద శ్లోకాలు (కటాక్ష శతకం), అమ్మవారి నవ్వును స్తుతిస్తూ ఇంకొక వంద శ్లోకాలు (మందస్మిత శతకం), అమ్మవారి పాదాలు స్తుతిస్తూ వంద శ్లోకాలు (పాదారవింద శతకం) చెప్పారు. ఇవన్నీ కలిపి మొత్తం అయిదు వందల శ్లోకాలయ్యాయి.కామాక్షీ అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన ఈ స్తోత్ర రత్న మాలే "మూక పంచశతి"గా ప్రసిద్ధి చెందింది. - యామిజాల జగదీశ్
June 20, 2020 • T. VEDANTA SURY • Book Review