ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మూఢనమ్మకం--డి.కె.చదువుల బాబు9440703716
September 23, 2020 • T. VEDANTA SURY • Story

శివరాముడికి పిచ్చి పట్టినట్లు ఉంది.ఆలోచనలతో తల దిమ్మెక్కిపోతోంది.నూతన సంవత్సరంలో ఎదురైన సంఘటనలు అతని మనసును కలిచివేస్తున్నాయి.భయభ్రాంతుడిని చేస్తున్నాయి.
శివరాముడికి పెళ్ళీడుకొచ్చిన  కూతురుంది.ఏడవతరగతి చదువుతున్న కొడుకున్నాడు.కూతురు కోసం సంబంధాలు వెదికాడు.అమ్మాయి నచ్చలేదంటూ నాలుగు సంబంధాలు వెనక్కిపోయాయి.
కాలుకు బలపం కట్టుకుని తిరిగి ఇంటిదాకా
తెచ్చిన సంబంధాలు తప్పిపోవటం మనసును కలిచివేసింది.
ఆరోజు శివరాముని కొడుకు పుట్టినరోజు.
బీరువాలో దాచిన ఉంగరాన్ని భార్య బలవంతంతో కొడుకు సుధీర్ కిచ్చాడు
శివరాముడు.జాగ్రత్తలు చెప్పాడు.
మిత్రులకు,పరిచయస్తులకు చాక్లెట్లు పంచి,
కొద్దిసేపు ఆడుకుని ఇంటికొచ్చాడు సుధీర్.
కొడుకు ఇల్లుచేరుకున్న కొద్దిసేపటికి వాడి
వ్రేలికి ఉంగరం లేకపోవడం గమనించాడు శివరాముడు.వాడిని అడిగితే "నేను ఇప్పటి
దాకాగమనించలేదు.ఎక్కడపోయిందో?"
అంటూ ఏడ్వసాగాడు.తర్వాత ఎంత ప్రయత్నించినా ఉంగరం దొరకలేదు.
ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత శివరాముడి భార్య సుశీలకు జ్వరం
వచ్చింది.ఆస్పత్రికెడితే మలేరియా జ్వరం
అన్నారు.మందులు,సూదులు వ్రాసిచ్చారు.
తర్వాత రెండు రోజులకు సుధీర్ కూడా
జ్వరంతో మంచమెక్కాడు.తల్లీ,కొడుకూ
కోలుకోవటానికి రెండువేలరూపాయలు పైగానే ఖర్చయింది.
ఈ సంఘటనలతో పిచ్చి పట్టినట్లున్న శివరా
ముడు ఆరోజు జరిగిన మరో సంఘటనతో
ఇంకా బెంబేలెత్తిపోయాడు.
ఆ రోజు..
శివరాముడుయధాప్రకారంతెల్లవారుఝామునే లేచాడు.రోజులాగే ఎద్దులతో పొలానికి బయలుదేరాడు.ఎండకు ఎద్దులు
అలిసిపోతాయని చీకట్లోనే బయలుదేరటం,
తెల్లవారే సమయానికి పొలంచేరటం,పదకొండుగంటలవరకూ సేద్యం చేసి ఇంటిదారి పట్టడం అతడి అలవాటు.తెల్లారే సరికి పొలం చేరుకున్నాడు.పొలం చేరిన పదినిమిషాలకు
ఓ ఎద్దు స్పృహతప్పి పడిపోయింది.
కొంతసేపటికిచనిపోయింది.వేలరూపాయలు ఖరీదు చేసేఎద్దుఅకస్మాత్తుగాచనిపోవటంతో బాధతో విలవిలలాడాడు. కూలీలను తీసు
కెళ్ళి ఎద్దును పొలంలోనే పూడ్చి ఇల్లు చేరాడు.
ఈ సంఘటనతో శివరాముడు బాగా భయపడ్డాడు.'ఇంటికేదో పీడ పట్టింది.ఈ
నష్టాలేమిటి?'అనుకుంటూ పరుగున ప్రశ్నచెప్పే జగన్నాయక్ దగ్గరకెళ్ళాడు.
జగన్నాయక్ వెయ్యిరూపాయలు తీసుకుని
ఇంటికొచ్చి నట్టింట్లో కూర్చుని ఓ అరగంటసేపు ఏదో చదువుతూండి పోయాడు.తర్వాత కళ్ళు తెరిచి "శివరాముడూ!నీఇంటిని ఓ దుష్టశక్తి
ఆవహించింది.దాన్ని పారద్రోలాలంటే పది
వేలదాకా ఖర్చవుతుంది.నీకిష్టమైతే రేపే
దిగ్భంధన పూజ ప్రారంభిస్తాను."అన్నాడు.
"డబ్బు ఇస్తాను.దాన్ని పారద్రోలండి."భయపడుతూ అన్నాడు శివరాముడు.
పూజకు కావలసిన సామాగ్రి వ్రాసిచ్చి వెళ్ళిపోయాడు జగన్నాయక్.
పూజకు ఆవుపాలు అవసరమేర్పడ్డాయి.
పొరుగూరిలోనున్న తన అన్నకొడుకు రమేష్
కు ఫోన్లో విషయంచెప్పి "ఇక్కడ ఆవుపాలు
దొరకవు.మీకు ఆవులున్నాయికదా!పాలు
తీసుకురా!" అన్నాడు శివరాముడు.
రమేష్ వెంటనే ప్రయాణమై వచ్చాడు.రమేష్ స్వతహాగా తెలివైనవాడు.ఏవిషయాన్నయినా శాస్త్రీయ కోణంలోచూస్తాడు.సమస్య మూలాల్ని అన్వేషిస్తాడు.
రమేష్ వెంటనే అందరినీ సమావేశ పరిిచి
"చిన్నాన్నా!పిన్నీ !మీరెవరూభయపడాల్సిన పని లేదు.దెయ్యాలు,దుష్ట శక్తులూ నిజంకావు. మూఢనమ్మకాలు."అన్నాడు.
"ఒరే!జరిగిన సంఘటనలు,నష్టాలు నీకళ్ళకు కనిపించడంలేదా?నీ సొద ఏంటి?"
విసుగ్గా అన్నాడు శివరాముడు.
రమేష్ నవ్వుతూ తనచేతిని చాపి "చిన్నాన్నా! నా చేతికున్న ఉంగరాన్ని తీసుకో."అన్నాడు.
శివరాముడు ఎంత ప్రయత్నించినా బిగువుగా ఉన్న ఉంగరం రాలేదు.
"చిన్నాన్నా!నా ఉంగరం నావ్రేలికి బిగుతుగా ఉంది.కాబట్టి రాలేదు. సుధీర్ ఉంగరం వదులుగా ఉందని దాచిన దాన్నిపుట్టినరోజు తీసిచ్చారు.వదులుగా
ఉండటంవల్ల ఎక్కడో జారిపోయింది.
పుట్టినరోజు ఆనందంలో సుధీర్ గమనించలేదు.దీనికీ,దుష్టశక్తికీ సంబంధ మేమిటి?"అన్నాడు రమేష్.
రమేష్  చెప్పింది నిజమేననిపించింది శివరాముడికి.
ఓక్షణం తర్వాత రమేష్  నవ్వి"చూడు చిన్నాన్నా! ఈ ఇంట్లో ఉన్న దోమతెరలు
చిరిగి ఉన్నాయి.మలేరియా జ్వరం దోమల
ద్వారా వస్తుంది.ఈ ఇంటికి దగ్గరగా ఆమురికిగుంట చూడు.దోమలతో ఎలా
వుందో!రాత్రయితే చాలు ఆదోమలు ఇంట్లో
దూరుతాయి.రంధ్రాలున్న దోమతెరల్లో
దూరి కుట్టడం ద్వారా జబ్బులు తెప్పిస్తాయి. ఇందుకు కారణం మీ అజాగ్రత్త,నిర్లక్ష్యమే!దుష్టశక్తి కాదు."
చెప్పాడు రమేష్.
"మరి అమ్మాయినచ్చలేదని పెండ్లి సం బంధాలు తప్పిపోవటానికి కారణమేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శివరాముడు.
"దాందేముందీ...వారికి మన లలిత నచ్చలేదు.వేరొకరికి నచ్చవచ్చు.ఏది ఏమైనా మన లలిత పెళ్ళిచూపుల సమయం లో  లలిత కంటే అందమైన
స్నేహితురాళ్ళు పక్కన లేకుండాచూడండి.
వారి అందంముందు లలిత అందంగా
,ఆకర్శణీయంగా కనిపించక పోవచ్చు." అన్నాడురమేష్.
"నీవు చెప్పింది నిజమే. మరి ఎద్దు చనిపోవ
డం కూడా యధాలాపంగా జరిగిందే అంటావా?"అడిగాడు ఆశ్చర్యంగా శివరాముడు.   
"చిన్నాన్నా!చీకట్లో నీవు లేచినప్పుడు ఎద్దు బాగానే ఉందా?జరిగింది వివరంగా చెప్పు."
అడిగాడు రమేష్.
"రాత్రి నుండీ ఎద్దు బాగానే ఉంది.రాత్రి చొప్ప వేశాను.తెల్లవారు ఝామున రోజులాగే జొన్నపిండి,ఎముకలపొడి కలిపి
నీళ్ళు తాపాను.ఆ ఎద్దు మిగిల్చిన నీళ్ళు
రెండో దానికి పెట్టాను.అది తాగలేదు.దానికి
దాహం లేదేమోఅనుకున్నా!ఆ నీళ్ళు బయటచల్లి కాడికట్టుకుని పొలానికెళ్ళాను.
పొలం చేరాక కొద్దిసేపటికి స్పృహతప్పి
పడిపోయింది.నోటనురగతో చనిపోయింది.
"చెప్పాడు శివరాముడు.
"చనిపోయింది నీళ్ళుతాగిన ఎద్దుకదా?"
అడిగాడు రమేష్.
ఔనన్నాడు శివరాముడు.
"ఆ నీళ్ళలో ఏదో విషం కలిసింది."అన్నాడు రమేష్.
రాత్రి తాను చేసిన పని శివరాముడి భార్యకు గుర్తుకొచ్చింది.వణుకుతూ "బంగారంలాంటి
ఎద్దును చేతులారా చంపుకున్నాం దేవుడా!"అంటూ ఏడ్వసాగింది.
"విషయమేంటో చెప్పేడ్వు"గద్దించాడు శివరాముడు.
పురుగులను చంపటానికి వాడే మందు
బాత్రూంలో చల్లి ఆ ప్యాకెట్ ను అక్కడే
ఎముకలబలానికి వాడే పొడి ప్యాకెట్లున్న గూటిలో ఉంచిన విషయం చెప్పి ఏడ్వసాగిందామె.
జరిగిందేమిటో వారికి అర్థమయింది.
చీకటిలో రోజులాగే అలవాటు ప్రకారం ఎముకలబలానికివాడేపొడి ప్యాకెట్ అనుకుని ,పురుగు
లమందు ప్యాకెట్ తీసుకుని నీటిలో కలిపాడు శివరాముడు.ఆ నీళ్ళు తాగటం వల్లనే ఎద్దు చనిపోయిందని గుర్తించారు.
చేతులారా చేసుకున్న పనులకు దుష్టశక్తి
ఇంటిని ఆవహించిదనే మూఢనమ్మకంతో
పూజలపేరుతో వేలరూపాయలు పోగొట్టుకోవటానికి సిద్దపడ్డ తన మూర్కత్వానికి సిగ్గుపడ్డాడు శివరాముడు.
తర్వాత రమేష్ సూచనల ప్రకారం ప్రతివిషయాన్ని వాస్తవ ధృక్పథంతో ఆలోచించటం నేర్చుకున్నాడు శివరాముడు.