ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మేరునగ ధీరుడు--శ్రీ.కిలపర్తి.దాలినాయుడు
August 25, 2020 • T. VEDANTA SURY • Poem

గుజరాత్ పర్వత శిఖరంపైనుండి
సత్యాగ్రహ దండంతో ఓ నవభాస్కరుడు పుడతాడని
పుతలీ బాయ్ ఊహకందదు!
కరంచంద్ ఆనాడే పుత్రోత్సాహం
ప్రదర్శించాడోలేదో తెలియదు!
సత్యాన్ని ,అహింసను మెదడులో
జీర్ణించుకున్న ఓ ఋషి అని
అప్పుడెవరూ ఊహించి ఉండరు!

న్యాయాన్ని కరవాలంచేసి దక్షిణాఫ్రికా
నల్లజాతికి ఓ రక్షణ దళపతినౌతానని
తనకు తానుగా ఊహించుకొని
ఉండరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ!

ఏ తెల్ల దొర తనను మొదటి తరగతి
పెట్టెనుండి క్రిందకు దించిందో
ఆ దొరతనాన్ని దింపడానికి
అదే దారిని తిరిగి పంపడానికి
కంకణం కట్టుకుంది ఆప్పుడే!

వర్ణోగ్రవాదాన్ని భరించుతున్న
నల్లసూరీళ్ళకోసం
అంటరానితనపు పంకిలాన్ని
మోస్తున్న భారతీయ కడగొట్టు సోదరుల కోసం
విముక్త పథానికి పథకం రచించ బడింది
అక్కడే.....
అప్పుడే వస్తానని వెళ్ళిన పోరాటతనానికి
ఏక వింశతి వత్సర వ్రతంపూర్తి చేసి
మాతృభూమిపై అడుగుమోపి మట్టిని
కళ్ళకద్దుకున్న బారిష్టర్ గాంధీ!

చంపారాన్ రైతుల చెంపలపై కన్నీళ్ళను
తుడిచి ,ఖేడ్ రైతుల ఖేదాన్ని పోగొట్టి
బొంబాయ్ కార్మికుల వెన్నెముకగా నిలచి
సబర్మతిలో ఉద్యమ పాఠశాలను స్థాపించిన
కుళ్ళాయి వీరుడు!
కాంగ్రేస్ నాయక శ్రేణిలో ముందునిలచి
బ్రిటన్ దమననీతిని ఎండగడుతూనే
సత్యాగ్రహాయుధంతో వెంటతగిలిన
పోరాట యోధుడు!
ఛరఖాను విష్ణు చక్రంచేసి
పరదేశీ దుండగులమీద విసరిన" స్వదేశీ!"
నూలుపోగుల్లాంటి భారతీయులను పేని
సహాయనిరాకరణ త్రాటిని అల్లి
తెల్ల ఏనుగును బంధించిన మావటి!
శాసనోల్లంఘనను చేసి
ఉప్పును పిడికిట పట్టి ఉప్పెనగా
మార్చిన దండి సత్యాగ్రాహి!
ఈశ్వర్ అల్లాతేరేనామ్ ,
హరిజనులారా గుడికెళదాం....అన్న
మానవతా వాది!
క్విట్టిండియాతో చావో రేవో
ఉరకండి సోదరులారా!ఉరికొయ్యలు
మననేంచేస్తాయ్!అంటూ
భరత మాత దాశ్య శృంఖలాలను
త్రెంచిన జాతి నేత ,యుగదూత!
మన గాంధి తాత!జాతి పిత!
ఓ"బాపూ" !భారత జనహృదయాలన్నీ
నీ ఆలయాలే!
ప్రపంచ పౌరులకు దిక్సూచిగా నిలచిన
ఓ మహాత్మా!
రక్తధారల దారాలతో నేసిన
మువ్వన్నె జెండాను భుజంపై మోసి
స్వాతంత్ర్యఫలాలనందించిన త్యాగధనుడా
జోహార్!జోహార్!
--కిలపర్తి దాలినాయుడు