ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మైలాపూరుతో రవ్వంత బంధం--మయిలై అని పిలువబడే మైలాపూరుతో కొద్దో గొప్పో నాకు అనుబంధముంది. నేను డిగ్రీ చేసింది మైలాపూరులోనే. ఆలాగే కొన్ని నెలలపాటు శ్రీరామకృష్ణ ప్రభలో పని చేసిందీ మైలాపూరులోనే. కనుక మైలాపూరు గురించి నాకు తెలిసిన ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్పాలనిపించిందీ రోజు.మద్రాసు నగరంలో ప్రత్యేకత ఉన్న మైలాపూరులో కపాలీశ్వర ఆలయం, శ్రీనివాస పెరుమాళ్ ఆలయం, మాధవ పెరుమాళ్ ఆలయం, సముద్రతీరాన ఊన్న శాంతోమ్ చర్చి వంటి సుప్రసిద్ధమైనవి ఉన్నాయి. తమిళులు దక్షిణ వేదంగా భావించే తిరుక్కురళ్ కృతికర్త తిరువల్లువర్ మైలాపూరులో నివసించినట్లు కొందరి అభిప్రాయం. ఆయన కిక్కడ ఓ గుడికూడా కట్టించారు. మద్రాసు మహానగరం ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మైలాపూరు ఓ సముద్రతీర ప్రాంతంగా ఉండేది.ప్రారంభంలో మైలార్ఫొన్ అని పిలిచేవారట. పల్లవుల కాలంలో ఈ ప్రాంతం ఓ సుప్రసిద్ధ రేవుపట్టణమై ఉండేది. పదహారవ శతాబ్దంలో ఇక్కడ పోర్చుగీసువారి ఆధిపత్యం కొనసాగింది. వారి హయాంలో మైలాపూరులో నివాసస్థలాలు వృద్ధి చెందాయని ఓ మాట.కపాలీశ్వర ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది అత్యంత పురాతన ఆలయంగా చరిత్రపుటల ద్వారా తెలుస్తోంది. 1250 నాటి శిలాఫలకంద్వారా ఈ విషయం తెలిసింది. అయితే మొదట ఉన్న ఈ శివాలయ మూలాలు లేకుండా పోర్చుగీసువారు ధ్వంసం చేశారు. అయితే ఇప్పుడున్న కపాలీశ.వరుడి ఆలయం పదహారు లేదా పదిహేడో శతాబ్దంలో నిర్మితమైనట్లు చెప్తున్నారు.నాయనార్లలో ఒకరైన వాయలార్ నాయనార్ ఇక్కడ అవతరించారు. కపాలం - ఈశ్వరుడు అనే మాటలు ఏకమై కపాలీశ్వరుడిగా ఏర్పడింది. కైలాసపర్వతంలో బ్రహ్మదేవుడు ఈశ్వరుడి శక్తిని స్వీకరించడానికి అంగీకరించనట్లు, దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు బ్రహ్మ శిరస్సును తీసేసినట్లు, తప్పు తెలుసుకున్న బ్రహ్మ ఈ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్టించి ఆరాధించినట్లు పురాణ కథనం.ఏడవ శతాబ్దంలో సముద్రతీరాన ఉన్న ఆలయాన్ని ఓ పల్లవరాజు కట్టించినట్లు మరొక కథనం. ఇందుకు సంబంధించిన ఆధారాలు తిరుజ్ఞాన సంబంధర్ పాటలలో లభించాయి. అయితే ఇప్పుడున్న ఆలయాన్ని విజయనగర రాజు పదహారో శతాబ్దంలో నిర్మించారట.శ్రీ రామకృష్ణామఠం ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది. ఈ మఠం కేంద్రంగా వెలువడిన శ్రీరామకృష్ణప్రభ మాసపత్రిక 1944 జూలై నుంచి అరవైమూడేళ్ళపాటు వెలువడింది. స్వామి సుకృతానంద గారి సంపాదకత్వంలో 1985 ప్రాంతంలో నేను పని చేసింది ఓ నాలుగు నెలలే అయినా దాదాపు పదేళ్ళపాటు ఈ పత్రికలో కథలు రాశాను. తెన్కచ్చి స్వామినాథన్ (ఆలిండియా రేడియో) గారు శ్రీ రామకృష్ణవిజయంలో నెలనెలా రాసిన నీతికథను తెలుగులోకి అనువదించి స్వామీజీకి ఇచ్చేవాడిని. వాటిని ప్రచురించిన స్వామీజీకి మనఃపూర్వక ధన్యవాదాలు.నా చదువంతా శ్రీరామకృష్ణామిషన్ వారి విద్యాలయాలలోనే కొనసాగింది. రామకృష్ణామిషన్ వారి వివేకానంద కాలేజీలో బి.ఎ. చదివాను. ఈ కాలేజీకి మద్రాసు నగరంలో మంచి పేరుంది. 1946 జూన్ 21 వ తేదీన ఈ కాలేజీ ప్రారంభమైంది. కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ కాలేజీకి ప్రారంభోత్సవం చేశారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజీని స్థాపించారు. అప్పట్లో మద్రాసులో ప్రముఖ ఇన్ కంటాక్స్ లాయర్ గా ఉండిన ఎం. సుబ్బరాయ అయ్యర్ ఈ కాలేజీకి వ్యవ స్థాపక కార్యదర్శిగా ఉండేవారు. మొదట్లో 20 మంది టీచర్లతోనూ, 339 మంది విద్యార్థులతోనూ ఈ కాలేజీ ప్రారంభమైంది. ఈ కాలేజీలో ఓబుల్ రెడ్డి పేరిట ఓ ఆడిటోరియం ఉంది. ఈ వేదికపై జరిగిన కాలేజీ వార్షికోత్సవంలో అప్పటి ఐఐటీ ప్రొఫెసర్ గారి చేతులమీదుగా నేను బిఎ తెలుగు సబ్జెక్టులో క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు బహుమతి అందుకున్నాను. స్వామి వివేకానందవారి ఎనిమిది సంపుటాలు ఇచ్చారు.ఇక్కడ 1971 - 72 లో ప్రీయూనివర్సిటీ కోర్స్ ఒక ఏడాదిపాటు చదివిన అనంతరం మూడేళ్ళు బిఎ ఎకనామిక్స్ డిగ్రీ చేశాను. మా కాలేజీ లైబ్రరీలో దాదాపు లక్ష పుస్తకాలుండేవి. క్రికెట్ గ్రౌండు, టెన్నిస్ కోర్టు ఉండేవి.మాజీ క్రికెటర్లు ఎస్. వెంకటరాఘవన్, కృష్ణమాచారి శ్రీకాంత్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ విజయ్, లక్ష్మీపతి బాలాజీ, పి. రమేష్ తదితరులు ఇక్కడ చదువుకున్నవారే. తమిళనాడు రంజీట్రోఫీలో ఆడిన రమేష్ పీయుసిలో నా క్లాస్ మేట్. ఎంపీ, జర్నలిస్టు, నటుడు చో రామస్వామి, సంగీతవిద్వాంసుడు టి. రమణి, ఉన్నికృష్ణన్, సినీ దర్శకుడు మణిరత్నం, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్, పారిశ్రామికవేత్త ఎంఎఎం రామస్వామి, రంగస్థల నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంతరించుకున్న క్రేజీ మోహన్, అతని సోదరుడు మధుబాలాజీ ఇక్కడ చదువుకున్నవారే. వివేకానందా కాలేజీకీ దగ్గర్లోనే మైలాపూర్ కేసరి హైస్కూల్ ఉండేది. ఇది తెలుగువారి పాఠశాల. ఇక్కడే సంస్కృత కాలేజీ కూడా ఉండేది. లజ్ కార్నర్ నుంచి నేరుగా ముందుకి వెళ్ళే రోడ్డుని కచ్చేరీ రోడ్డు అనేవారు. ఈ రోడ్డులోనే ఎన్.ఆర్. చందూర్ దంపతులు ఉండేవారు. చందూర్ గారి సంపొదకత్వంలో జగతి మాసపత్రిక అనేక సంవత్సరాలు నడిచింది. మాలతీచందూర్ గారు ఆంధ్రప్రభలో ప్రమాదావనం శీర్షికతో సుప్రసిద్ధులయ్యారు. ఈ శీర్షికకింద ఆమె పాఠకులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలన్నీ విజ్ఞానదాయకమే. విశేష ఆదరణ పొందిన శీర్షిక ఇది. ఇక ఇదే కచ్చేరీ రోడ్డు నుంచే పెంకిపిల్ల అనే పత్రిక పసుమర్తి రాఘవరావుగారి సంపాదకత్వంలో వెలువడేది. పెంకిపిల్ల అని నామకరణం చేసిన వారు కీ.శే. తాపీధర్మారావుగారు. పొట్టిశ్రీరాములు హాల్ కూడా లజ్ కార్నర్ లోనే ఉంది. ఇక్కడ ఓ లైబ్రరీకూడా ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. నేను మా కాలేజీ బస్టాప్ ఎదురుగా ఆంధ్రమహిళా సభ విద్యాలయం ఉండేది. ఇక్కడే మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మేనకోడలు రాజేశ్వరిగారు పని చేసేవారు. అన్నింటికన్నా ముఖ్యమైన శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన భవనం లజ్ రోడ్డులోనే ఉండటం మైలాపూర్ విశిష్టతలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 1937 నవంబరు పదహారో తేదీన కాశీనాధుని నాగేశ్వరరావు గారి నివాసమైన శ్రీబాగ్‌లో కోస్తా, రాయలసీమ నాయకులు సమావేశమై ఓ ఒప్పందపత్రంపై సౌతకాలు చేశారు. దీనినే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. తర్వాతి కాలంలోనే పదమూడు జిల్లాల తెలుగు రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి 'ఆంధ్రరాష్ట్రం' గా అవతరించింది. శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇలా ఎన్నో విశేషాలకు నిలయమైన మైలాపూరుతో నాకు రవ్వంత అనుబంధం ఉండటం చిరస్మరణీయమే.- యామిజాల జగదీశ్
June 22, 2020 • T. VEDANTA SURY • Memories