ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
మొల్ల తను రాసిన రామాయణంలో అన్ని పాత్రలను సమదృష్టితో పరికించి రాసినప్పటికీ స్త్రీ పాత్రల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు, దానికి కారణం నాడు సమాజంలో స్త్రీలు అణిగి మణిగి ఉండడమే‌. అందుకే ఆ పాత్రల చిత్రీకరణలో ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పక తప్పదు. మూలకథకు భంగం కలగకుండా, రామాయణ ఔచిత్యం పోకుండా, భావయుక్తంగా తన కౌశలం చూపిస్తూ రచన సాగించారు ఆమె రూపకల్పన చేసిన గుహుని పాత్ర విశిష్టమైనది. శ్రీరాముడు తాటకిని వధించి తరువాత విశ్వామిత్రునితో మిథిలా నగరానికి బయలుదేరుతాడు. ఆ నగరానికి వెళ్లేదారిలో గంగను దాటవలసి వస్తుంది. గుహుడు నావికుడు కదా! అహల్యా శాప విమోచనం ఆయనకి గుర్తుకు వస్తుంది. వెంటనే శ్రీరాముని పాదాలు కడుగుతాడు. ఈ అంశం సంస్కృత ఆధ్యాత్మిక రామాయణంలో ఉంది. కానీ వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టం లేదు. మొల్ల ఈ అంశాన్ని తీసుకొని తన రామాయణ కావ్యంలో అతి చమత్కారంగా గుహునికి అన్వయించి వ్రాసింది.సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయియే/ర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగనితని పాదరేణు/ య్యెడ వడి నోడ సోక నిది యేమగునోయని సంశయాత్ముడై/కడిగె గుహుండు రామ పద కంజ యుగంబు భయమ్ము పెంపునన్/గుహుడు చదువుసంధ్యలు లేని కేవటి కుటుంబానికి చెందిన వాడు. నదిలో పడవ నడపడం ఆయనకుతెలసిన విద్య. అతను గొప్ప శ్రీరామ భక్తుడు. దశరధ తనయుడు అయిన శ్రీరాముని దర్శించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. రాముడు రానే వచ్చాడు, అతనిని తన పడవలో గంగానది దాటించాలి. రాతిగా ఉన్న అహల్యను నాతిగా మార్చిన ఘటన తెలిసిందే! ఇప్పుడు తన పడవలో రాముడు పాదం మోపితే స్త్రీ గా మారితే ఎలా? తన జీవనాధారమే ఆ పడవ. గుహుడు తన భయాన్ని బయట పెట్టాడు. కారణం లేకుండా రాముని పాదాల కడగడం భావ్యం కాదని తలంచాడు. భయభక్తులతో రెండు విధాలా గుహుని మానసిక స్థితిని మొల్ల ఎంత చక్కగా వర్ణించింది కదా! ఇది మొల్ల భావనా శక్తికి ఒక నిదర్శనం. తెలుగు భాష బాగా తెలిసిన గొప్ప పండితురాలు మొల్ల. తెలుగు నుడికారంతో రుచిగా, శుచిగా తన కవిత్వం ఉండాలనేది ఈమె భావన.మృదుమధురమైన చక్కని పదప్రయోగం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. అయోధ్య నగరం వర్ణించినపుడు రాజుల వర్ణన చూడండి.పద్యం:-రాజులు కాంతి యందు రతి రాజులు రూపము నందు వాహినీ/రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో/రాజులు భోగమందు దిన రాజులు సంతత తేజ మందు రా/ రాజులు మాన మందు నగరమ్మున రాజకుమారులం దరున్ // రాజులు అన్న పదంతో పద్యం ప్రారంభించి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విశేషణం ఉపయోగించి పద్యానికి ప్రాణం పోసి చమత్కరించింది మొల్ల తన రామాయణంలో హనుమంతుడు సీత జాడను వెదకుచూ అశోక వనమును చేరిన విధము చాలా విశేషంగా వర్ణించింది. మొల్ల రాసిన ఈ పద్యం :- నీలమేఘచ్ఛాయబోలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబుసన్నిభమైన కంఠంబు గలవాడు బాగైనయట్టి గుల్ఫములవాడు తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాడు ఘనమైన దుందుభి స్వనమువాడు పద్మ రేఖలు గల్గు పదయుగంబులవాడు చక్కని పీనవక్షంబువాడు తే. కపటమెరుగని సత్య వాక్యముల వాడు రమణి రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణముల రూపింప నెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు! నిరాడంబరంగా ఉండి, పరమ ఆత్మీయంగా ఉన్న ఈ పద్యం మొల్ల రాసింది. అంత కష్టపడి సముద్రాన్ని దాటి రాత్రంతా లంక మూలమూలలు గాలించి, వెతికి, వేసారి, చివరకు అశోకవనంలో సీతను కనుగొని మాట్లాడుదాం అనుకునేలోగా రావణుడు వచ్చి కారు కూతలు కూసి బెదిరించి పోయిన తర్వాత, కాపలా స్త్రీలు కూడా బెదిరించి విసిగి విసిగించి పోయిన పిదప, త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పిన పిమ్మట గాని హనుమంతునికి జానకితో మాట్లాడే వీలు కలుగలేదు. కొంత సంభాషణ జరిగిన తర్వాత అప్పటికే రాక్షస మాయలతో వేసారి ఉన్న సీత హనుమంతుని నమ్మలేక- సరే రాముడు లక్ష్మణుడు ఎలాంటి వారో చెప్పమంటే వారిని వర్ణిస్తూ ఆయన జవాబుగా చెప్పిన పద్యం ఇది. ఎంతో నిసర్గంగా ఉంది ఇదిగదూ ఈ వర్ణన, ఆడంబరంగా చెప్పింది ఏమీ లేదు. చెప్పిన నాలుగైదు ఉపమానాలు కూడా చాలా చాలా సాదాసీదావీ, మామూలుగా ఎవరైనా చెప్పేవే. ఏ ఉపమానాలు లేకుండా అక్కడక్కడా రూపించిన "బాగైన, తిన్ననైన, ఘనమైన, చక్కని" ఇలాంటి విశేషణాలు ఏ పోలికలు వ్యక్తీకరించలేని అందాన్ని కుప్పపోసాయి అక్కడ. ఎదుటి వ్యక్తి ఏమి వినాలి అనుకుంటుందో, ఏది ఎలా చెబితే ఆ వినాలనుకునే ఆమె ప్రసన్నురాలవుతుందో, అది తెలిసి చెప్పడం ఒక సమర్థమైన మనోభావ విశ్లేషణ. మల్ల హనుమ చేత అలా ఆర్ద్రంగా, ఆప్తంగా చెప్పించడం ఆ రహస్యం తెలిసి చేసిన ప్రయత్నం.మొల్ల రామాయణం అనుసరించి ఆమె యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఊహించవచ్చు. రాజుల ఆశ్రయంతో ఆరోజుల్లో అగ్రవర్ణాలకు చెందిన విశిష్ట కవి పండితులు అధికం. స్త్రీ విద్య, శూద్ర విద్య నిషేధం అమల్లో ఉన్న రోజుల్లో ఎలాగో చదువుకుని పాండిత్యం గడించి రమ్య కవితా శక్తిని సంతరించుకున్నది కవయిత్రి మొల్ల. తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఆమె రచనా శైలి అద్భుతంగా ఉంటుంది. కవయిత్రిగా మొల్ల నాటి సమాజానికే కాదు, నేటి సమాజానికి కూడా ఆదర్శ కవయిత్రి. ఈమె సాహితీ ప్రకర్ష వనితలకు గర్వకారణం. (అయిపోయింది)(ఇదీ 39 భాగము )-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు: 9290061336
June 25, 2020 • T. VEDANTA SURY • Serial